ఉగాదికి సాముహిక గృహ ప్రవేశాలు

జగనన్న కాల‌నీల్లో చ‌క‌చ‌కా ఇళ్ల నిర్మాణాలు

ఒక్కో ఇంటికి ఇచ్చే రూ.1.80 లక్షలకు తోడు డీఆర్‌డీఏ ద్వారా  రూ.35 వేల రుణం

 ఇసుక, మెటీరియల్‌ అందిస్తూ అండ‌గా నిలిచిన ప్ర‌భుత్వం
తీర‌నున్న అద్దె ఇళ్ల అవ‌స్థ‌లు

  పేదల సొంతింటి కల సాకారమవుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి మెటీరియల్, సకాలంలో  బిల్లులను కూడా చెల్లిస్తూ  అండగా నిలుస్తోంది.   ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు సొంతిళ్లలోకి చేరిపోయారు. తుదిదశకు చేరిన వాటిని ఉగాది పండుగ నాటికి పూర్తి చేయించి  సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.  

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ వేగం పెరిగింది. పేదలు తమకు కేటాయించిన స్థలాల్లో గృహ నిర్మాణాలను చేపట్టి వేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో పడ్డ అవస్థలు తీరుతుండటంతో సంబరపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సొంతింటి కల సాకారం దిశగా పాలన సాగిస్తున్నారని లబ్ధిదారులు కొనియాడుతున్నారు.

అవసరమైన నిధులు కేటాయింపులు జరిగేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలో బ్రాహ్మణపల్లి, బీడుపల్లి, జగరాజుపల్లి, ఎనుములపల్లి వద్ద జగనన్న కాలనీలు వెలిశాయి. అలాగే ధర్మవరం పట్టణ సమీపంలోని కాలనీలో చాలా ఇళ్లు నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నాయి. 

పనుల పరుగులు.. 
ప్రభుత్వ మార్గదర్శకాలతో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 168 జగనన్న లేఅవుట్‌లలో 24,643 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పేదలకు నివాసయోగ్యం కింద ఇల్లు మంజూరు చేశారు. జిల్లాకు సంబంధించి మొత్తం 62,716 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తి కాగా.. మిగిలిన వాటి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 

ఇబ్బందుల్లేకుండా చర్యలు.. 
ఒక్కో ఇంటికి ఇచ్చే రూ.1.80 లక్షలకు తోడు డీఆర్‌డీఏ ద్వారా డ్వాక్రా సంఘ సభ్యులకు ఇంటి నిర్మాణానికి రూ.35 వేల రుణం బ్యాంకుల ద్వారా అందేలా చర్యలు చేపట్టారు. ఈ రుణంతో లబి్ధదారులు బయటి వ్యక్తుల ద్వారా అప్పులు చేయకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికితోడు ఇబ్బందిలేకుండా ఇసుక, మెటీరియల్‌ అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 

మౌలిక వసతుల కల్పన.. 
జిల్లా వ్యాప్తంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 168 లేఅవుట్‌లు ఏర్పాటు చేశారు. ఆయా లేఅవుట్‌లలో విద్యుత్‌ లైన్లు, రహదారులు, కరెంటు మీటర్లు, తాగునీటి వసతుల కల్పన వంటి పనులు చేపట్టారు. ఫలితంగా కాలనీలు కొత్తరూపు సంతరించుకున్నాయి.   

చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు షహీనా. హిందూపురం పట్టణ సమీపంలోని మణేసముద్రం. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు అయింది. మెటీరియల్‌ దగ్గరి నుంచి బిల్లుల దాకా అన్ని విధాలా సహకారం లభించడంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేశామని షహీనా హర్షం వ్యక్తం చేశారు. 

 

ఈమె  మల్లీశ్వరి. ధర్మవరం పట్టణం శాంతినగర్‌ వాసి. ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు లేక ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించడంతో ఇంటి నిర్మాణం పూర్తయిందని మల్లీశ్వరి తెలిపారు. జగనన్న ప్రభుత్వంలోనే తమ సొంతింటి కల సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు. 

 

ఇళ్ల నిర్మాణాల పురోగతి ఇలా..  

జిల్లాకు మంజూరైన ఇళ్లు              62,716
జగనన్న లేఅవుట్లు                       168
నిర్మాణాలు పూర్తి చేసుకున్నవి      5,750
పైకప్పు పూర్తయినవి                      3,713
పైకప్పు వరకు                               2,742
పునాది వరకు                               12,403
పునాది పనుల్లో..                            22,230
ప్రారంభం కానివి                           15,878

Back to Top