అన్నదాతకు అండగా..పల్లెల్లో పండుగ

నేటి నుంచి రైతు భరోసా తుది విడత చెల్లింపులు 

రూ.1,082 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

సచివాలయాల్లో రేపటి నుంచి లబ్ధిదారుల జాబితా

తోడుగా ఉన్నానంటూ అన్నదాతలకు సీఎం లేఖ

అమరావతి: గత ఐదేళ్లు అన్నదాతలు కరువు కాటకాలతో అల్లాడిపోయారు. ఇలాంటి తరుణంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రకృతి కూడా ఆయన పాలనకు సహకరించింది. విస్తారంగా వర్షాలు కురవడం, వరదల కారణంగా రాష్ట్రంలోని జలాశయాలకు జల కళ వచ్చింది. దీనికి తోడు అన్నదాతలకు వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకంతో అండగా నిలిచారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం పేరుతో ప్రతి రైతుకు ఎన్నికల ముందు ఇస్తామన్న రూ.12,500 కంటే అదనంగా మరో వెయ్యి కలిపి రూ.13,500 చొప్పున అందజేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన సీఎం వైయస్‌ జగన్‌ ఏడాది ముందుగానే రైతుకు పెట్టుబడి సాయం అందించారు.   రైతు భరోసాలో భాగంగా అన్నదాతలకు సంక్రాంతి కానుకగా ప్రకటించిన రూ.2 వేలను గురువారం నుంచి వారి ఖాతాలకు నేరుగా బదిలీ చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. సుమారు 46,50,629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేస్తున్నారు.  డాక్టర్‌ వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం కింద గత నెల 15 వరకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులైన వారి ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేస్తున్నారు.  వీరిలో వాస్తవ సాగుదారులు, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, దేవాదాయ, ధర్మాదాయ భూముల్ని సాగు చేసుకుంటున్న వారు, ఇతర వర్గాల సాగుదార్లు ఉన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఇస్తామని ప్రకటించి ఇప్పటికే రూ.11,500ను జమ చేసిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రాసిన లేఖను గ్రామ వలంటీర్లు రైతులకు అందజేసి, రసీదుపై సంతకం తీసుకుంటారు. సంక్రాంతి పండుగకు ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమా అవుతుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది.
 
అన్నదాతలకు సీఎం వైయస్‌ జగన్‌ లేఖ ..
రైతన్నలకు, రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్వయంగా లేఖలు రాస్తున్నారు. ఆ లేఖలో ఏముందంటే..

మీ కుటుంబ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నాని  సీఎం పేర్కొన్నారు.  కష్టాల కడగండ్లలో గత ఐదేళ్లుగా సర్వం నష్టపోయిన రైతన్నకు సహాయం అందించే విషయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కంటే మిన్నగా, 8 నెలల ముందే 2019 అక్టోబర్‌ 15న రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించాం. రైతులకు అందించే ఈ పెట్టుబడి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అందజేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం భూ యజమాని అయిన రైతులకు ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఇచ్చే రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.7,500 కలిపి, మొత్తంగా ఏడాదికి రూ.13,500 ప్రతి రైతు కుటుంబానికి అందిస్తున్నాం.
ఈ సొమ్మును అర్హులైన భూ యజమాని కుటుంబాలకు ఏటా మొదటి విడతగా మే నెలలో రూ.7,500.. రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4,000.. మూడో విడతగా జనవరిలో రూ.2,000 అందజేస్తున్నాం. రాష్ట్రంలో భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం చేస్తున్నాం. మే, అక్టోబర్‌ నెలల్లో ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఇప్పటి వరకు రాష్ట్రంలోని 44,92,513 మంది భూ యజమానులకు రూ.11,500 చొప్పున మొత్తం రూ.5,166.37 కోట్లు అందజేశాం. రాష్ట్రంలో 1,58,116 మంది భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ సాగుదార్లకు, దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారికి ఇప్పటి వరకు రూ.11,500 చొప్పున ప్రభుత్వం మొత్తం రూ.181.83 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. వీరందరికీ మిగతా రూ.2 వేలను ఈ జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా అందజేస్తున్నాం.

డాక్టర్‌ వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా రైతులకు అందించే ఈ ఆర్థిక సాయం, వ్యవసాయ పెట్టుబడికి ఉపకరిస్తుందని భావిస్తున్నాను. ఈ సందర్భంలో వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యతను పరిశీలించేందుకు, తద్వారా నాణ్యమైన ఉత్పాదకాలను మాత్రమే రైతన్నలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో 147 డాక్టర్‌ వైయస్‌ఆర్‌ సమీకృత ప్రయోగశాలలను, 13 జిల్లా కేంద్రాలలో నోడల్‌ ప్రయోగశాలలను ఏర్పాటు చేయబోతున్నాం. ఫిబ్రవరి నుంచి ప్రతి గ్రామ పంచాయతీ సచివాలయం పరిధిలో రైతు కోరిన, నాణ్యత ధృవీకరించిన ఉత్పాదకాలను అందించడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. భూసార పరీక్షలు, ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వినియోగించే కషాయాల తయారీ, పెట్టుబడి ఖర్చును తగ్గిస్తూ దిగుబడిని పెంచగలిగే సాంకేతిక సలహాలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ ధరలు, వాతావరణ సలహాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల సేవలు రైతు భరోసా కేంద్రం పరిధిలో అందించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 

Back to Top