కడప: బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికల పోరుకు అధికార పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు కార్యాచరణను వేగవంతం చేసింది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా, అక్టోబరు 1న శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అక్టోబరు 30న పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయవాడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బద్వేలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితోపాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికను ఎదుర్కొనే విషయంలో నేతలకు దిశా నిర్దేశం చేశారు.
బద్వేలు ఉప ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. ఈయనతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిలు కూడా ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు. బద్వేలు మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నేతలను సమన్వయం చేసుకుని ఎన్నికల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు. ఇక ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలను నియోజకవర్గంలోని మండలాలకు ఇన్‌చార్జిలుగా నియమించనున్నారు. బద్వేలు మున్సిపాలిటీతోపాటు మేజర్ పంచాయతీ అయిన పోరుమామిళ్లకు ఇద్దరేసి చొప్పున ఎమ్మెల్యేలను ఇన్‌చార్జిలుగా నియమించనున్నారు.
బద్వేలు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా మండలానికి ఒకరు చొప్పున ఇన్‌చార్జిలను నియమించాలని నిర్ణయించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు ఇతర జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను మండలాలకు ఇన్‌చార్జిలుగా నియమించనున్నారు. శుక్రవారం నాటికి ఇన్‌చార్జిల జాబితా ఖరారు కానుంది. వీరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా మండల ఇన్‌చార్జిలు ఆయా మండలాల పరిధిలోని మండల, గ్రామస్థాయి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.