ప్రతి మహిళను లక్షాధికారిగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో..

నేడు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ నగదు

ఠంచన్‌గా వరుసగా రెండో ఏడాది కూడా  

ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ 

కోటి మందికిపైగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు లబ్ధి  

బ్యాంకు రుణం తీసుకొని సకాలంలో కిస్తీలు చెల్లించిన సంఘాలు 9.34 లక్షలు 

ఆ సంఘాల అప్పుపై ఏడాది వడ్డీ రూ.1,109 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం 

 అమరావతి: పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా ఠంచన్‌గా శుక్రవారం బ్యాంకుల్లో వడ్డీ డబ్బులను జమ చేయనుంది. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 8.71 లక్షల పొదుపు సంఘాలకు 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు బ్యాంకు రుణాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని గతేడాది ఏప్రిల్‌ 24న చెల్లించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు సంఘాల రుణాలపై ఉన్న వడ్డీ మొత్తం రూ.1,109 కోట్లను సరిగ్గా ఏడాదికి.. శుక్రవారం చెల్లించనున్నారు.

బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో కిస్తీలు చెల్లించిన అక్కచెల్లెమ్మలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని ‘వైయ‌స్సార్‌ సున్నా వడ్డీ’ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. సంఘాల వారీగా వడ్డీ డబ్బులను సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆన్‌లైన్‌ విధానంలోశుక్రవారం ఆయా సంఘాల రుణ ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.  

9.34 లక్షల సంఘాలు..  
రాష్ట్రవ్యాప్తంగా 9,34,852 పొదుపు సంఘాలకు సంబంధించి 1.02 కోట్ల మంది మహిళలు బ్యాంకుల నుంచి రూ.19,989 కోట్ల రుణాలు తీసుకుని నిబంధనల ప్రకారం కిస్తీలు చెల్లించారు. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆయా సంఘాలు సకాలంలో బ్యాంకులకు చెల్లించిన రుణాలపై రూ.1,109 కోట్ల మేర వడ్డీ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పారదర్శకత కోసం ప్రతి ఊరిలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించింది.

మహిళలకు లేఖ రాసిన సీఎం.. 
పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ డబ్బులను చెల్లిస్తున్న సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌ లేఖలు రాశారు. ప్రతి మహిళను లక్షాధికారిగా, వ్యాపార రంగంలో తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను లేఖలో వివరించారు. లబ్ధిదారులకు శుక్రవారం నుంచి వీటిని పంపిణీ చేస్తారు. 

Back to Top