విజయనగరం: ఉత్తరాంధ్రలోని భోగాపురం మండలంలో పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు కలసి తమ సమస్యలు విన్నవించుకొన్నారు. ముఖ్యమంత్రి వారి సమస్యలను, బాధలను సావధానంగా ఆలకించి వారికి ప్రభుత్వపరంగా సాధ్యమైనంత సహాయం అందిస్తామని భరోసా ఇచ్చి వారికి స్వాంతన చేకూర్చారు. జిల్లాలోని మండలాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి కూడా బాధితులు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. ఆయా సమస్యలపై అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.
చీపురుపల్లి మండలం పేరిపి గ్రామానికి చెందిన యలకల అనసూయ(38) అనే మహిళ సోదరుడు భోగాపురం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని కలసి తన సోదరి గత ఆరేళ్లుగా పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతుందని, హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్‌ను సంప్రదించగా అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని సూచించారని, తమకు శస్త్రచికిత్స చేయించుకొనే ఆర్ధిక స్థోమత లేదని, ఆమెకి ఇద్దరు చిన్న పిల్లలు వున్నారని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై తక్షణం స్పందించిన సి.ఎం. శ్రీ వై.ఎస్.జగన్ ఆమె వైద్యానికి రూ.లక్ష సహాయం తక్షణమే అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మిని అదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనసూయ అనే మహిళకు సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు రూపొందించారు.

రేగిడి మండలం కందిశ గ్రామానికి చెందిన పొన్నగంటి లక్ష్మి లావణ్య అనే మహిళ తన కుమార్తె అయిన హేమలత ఏడాది కాలంగా కంటి క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఈ వ్యాధి చికిత్స నిమిత్తం ఇప్పటి వరకు రూ.2.00 లక్షలు ఖర్చు చేశానని వివరించారు. అయినప్పటికీ వ్యాధి నయంకాలేదని తన పాపకు సహాయం చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి విన్నవించారు. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి పాప చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని పాప తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సూరంపేట గ్రామానికి చెందిన నాజాన సురేష్ అనే దివ్యాంగ యువకుడు ముఖ్యమంత్రిని కలసి తన సమస్యను విన్నవించారు. తాను పుట్టుకతో వ్యాధిగ్రస్తుడినని, తాను బిఎస్సీ డిగ్రీ పూర్తిచేశానని, తనతో పాటు ముగ్గురు చెల్లెళ్లు వున్నారని, కుటుంబ పోషణ కష్టంగా వుందని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ అంశాన్ని తగిన చర్యలకోసం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు పంపించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు.
భోగాపురం మండలం దల్లిపేటకు చెందిన రెడ్డి తోటయ్య అనే వ్యక్తి గ్రామంలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ విద్యుత్ స్థంభంపై వున్నపుడు షాక్‌కు గురై రెండు చేతులు కోల్పోయాడు. తనకు ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.4 లక్షలు ఖర్చయ్యిందని, తనకు ఎలాంటి సహాయం అందలేదని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన సి.ఎం. మీ కుటుంబాన్ని ఆదుకుంటామని అవసరమైన ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై నివేదిక తెప్పించుకొని వెంటనే సహాయం అందేలా చర్యలు చేపడతామన్నారు.