హామీ.. విస్మరామి!

 
 అమరావతి: చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు 600కు పైగా హామీలిచ్చారు. ఈ హామీలలో ముఖ్యమైన వాటిని సైతం అటకెక్కించడంతో రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని ప్రధాన హామీలు ఏ మేరకు అమలు చేశారో..  రియాలిటీ చెక్‌..

రైతులకు  ఇచ్చిన హామీలు 
రైతులకు రుణ మాఫీ. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌.

వాస్తవానికి  చేసిందేమిటి?!
- 2014లో ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం– రాష్ట్రంలో సుమారు రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. కాని ఇప్పటివరకూ ఇచ్చింది కేవలం రూ.15,038 కోట్లు మాత్రమే. ఇది రైతులు చెల్లిం చాల్సిన వడ్డీలకు కూడా సరిపోదు. పైగా 4,5 విడతలను పూర్తిగా ఎగ్గొట్టేశారు.
- వాస్తవానికి రాష్ట్రంలో 17 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న విద్యుత్‌ రోజుకు 29.67 మిలియన్‌ యూనిట్లు. ఇది రోజుకు 3.5 గంటలకు మాత్రమే సరిపోయే విద్యుత్‌. వాస్తవానికి రోజుకు 9గంటల విద్యుత్‌ కావాలంటే.. రోజుకు 76 మిలియన్‌ యూనిట్లు ఇవ్వాలి. 

మహిళలకు  ఇచ్చిన హామీలు 
బెల్టుషాపులు లేకుండా  చేయడం. డ్వాక్రా రుణాలు రద్దు.

వాస్తవానికి  చేసిందేమిటి?!
​​​​​​​- 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే వీధివీధినా బెల్టుషాపులు తెరిచేలా మద్యం సిండికేట్లకు ఊతమిచ్చిన మాట వాస్తవం. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే.. వాటికి అనుబంధంగా 40వేలకు పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. 
​​​​​​​- రాష్ట్రంలో... 9.37లక్షల డ్వాక్రా సంఘాల పేరిట రూ.21,479 కోట్ల అప్పులున్నాయి. చంద్రబాబు డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో అప్పట్లో చాలా సంఘాలు అప్పులు చెల్లించడం ఆపేశాయి. కాని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి.. లక్షల మంది డ్వాక్రా మహిళలు ప్రయివేట్‌ వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి డబ్బులు తెచ్చి వడ్డీ చెల్లిస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

యువతకు,  నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు
ఏటా క్యాలెండర్‌ ప్రకారం  ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ. ఏటా డీఎస్సీ నోటిఫికేషన్‌. నిరుద్యోగులకు నెలకు రూ.2వేల భృతి. రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అమలు.

వాస్తవానికి  చేసిందేమిటి?!
​​​​​​​- ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ పొరపాటున కూడా అనుసరించలేదు. రాష్ట్రంలో 2.40లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే...2016లో పోలీసు ఉద్యోగాలు పోగా.. నికరంగా భర్తీచేసినవి 2300 పోస్టులు మాత్రమే. 2016లోనే వివిధ పోస్టులకు 15లక్షల మందికిపైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మూడేళ్లలో మరో 15 లక్షల మంది చేరి ఉంటారని అంచనా. అంటే  ప్రభుత్వ ఉద్యోగాల కోసం 30 లక్షల మందికిపైగా నిరీక్షిస్తుంటే.. ఇప్పుడు ఎన్నికలప్పుడు హడావుడిగా 18450 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి... అరకొర ఖాళీలతో నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. 
​​​​​​​- 35వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా... నాలుగేళ్లుగా ఊరించి ఊరించి ఇప్పుడు ఎన్నికలప్పుడు 7902 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 
​​​​​​​- 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి మాటే ఎత్తలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి అంటూ  ప్రకటనలు చేస్తున్నారు. 
​​​​​​​- రాష్ట్రంలో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు 16లక్షల పది వేల మంది ఉంటే... వారికి అరకొరగా ఫీజురీయింబర్స్‌ చేస్తూ... ఏటా విద్యార్థులపై రూ.4,385.22 కోట్లకు పైగా భారం మోపుతున్నారు. 

గృహాలు లేని పేదలకు ఇచ్చిన హామీలు
రూ.లక్షా 50 వేలతో ఉచిత గృహం

వాస్తవానికి  చేసిందేమిటి?!
ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తానని చెప్పి నేటి వరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఇళ్లు మంజూరు కావాలన్నా, బిల్లులు అందాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి.  ప్రస్తుతం రాష్ట్రంలో గుడిసెల్లో నివశిస్తున్న పేదలు 30.31 లక్షల మంది. 

విద్య వైద్య రంగాలకు ఇచ్చిన హామీలు 
ఎన్‌టీఆర్‌ హెల్త్‌కార్డు ద్వారా అన్నిరకాల వ్యాధులకు కార్పొరేట్, ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో 2.5లక్షల వరకూ ఉచిత వైద్యం. కేజీ టు పీజీ వరకూ ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యను అందించడం.

వాస్తవానికి  చేసిందేమిటి?!
వైద్య రంగానికి సంబంధించి 938 జబ్బులు ఆరోగ్య శ్రీలో ఉండగా.. వీటిల్లో 133 వ్యాధులకు ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం నిరాకరించారు. అంతేకుండా సొంతూరిలో రేషన్‌ తీసుకుంటేనే ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో చికిత్సకు అనుమతించకపోవడం, బకాయిలు చెల్లించకపోవడం, సవాలక్ష ఆంక్షలతో ఆరోగ్య శ్రీతో వైద్యం అందని పరిస్థితి. అలా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. 

–విద్యారంగానికి సంబంధించి... కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామని చెప్పి... రేషనలైజేషన్‌ పేరిట దాదాపు 5వేల పాఠశాలలు మూసేయించారు. ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలు, ప్రయివేట్‌ విద్యాసంస్థలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తుండటంతో...ప్రభుత్వ విద్యారంగంలో ప్రమాణాలు దిగజారడం..ప్రయివేట్‌ రంగంలో భారీగా ఫీజులు పెరగడం ఏకకాలంలో జరిగిపోయింది. ఎల్‌కేజీలో చేర్పించాలన్నా వేలకు వేలు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి!!

 

Back to Top