ప్రభుత్వంపై అదనపు భారం ప‌డినా..ఉద్యోగుల సంక్షేమ‌మే ల‌క్ష్యం

 సీఎం వైయ‌స్ జగన్‌కి పీఆర్‌సీ నివేదిక అందజేసిన సీఎస్‌

 ఉద్యోగులకు మేలు.. సెలవు సిఫారసులు

 ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం  వివిధ రకాల చర్యలు 

అమరావతి:  కార్య‌ద‌ర్శుల క‌మిటీ రూపొందించిన పీఆర్‌సీ నివేదిక సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అందింది. ప్ర‌భుత్వంపై భారం ప‌డినా..ఉద్యోగుల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా పీఆర్‌సీని రూపొందించారు. పదకొండో వేతన సంఘం ఉద్యోగుల సెలవులు, వైద్య సౌకర్యాలపై కొన్ని సిఫారసులు చేసింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాల్లో అందిస్తున్న వైద్య సేవలను ఈహెచ్‌ఎస్‌ పథకానికి కూడా వర్తింపజేయాలని సూచించింది. పిల్లలను దత్తత తీసుకున్న వారికి సైతం దత్తత సెలవులు 180 రోజులు ఉండాలని, చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ కూడా ఇదే స్థాయిలో ఉండాలని, ఇది ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా అమలు చేయాలని సిఫారసు చేసింది. అంతేగాక ఈ విభాగంలో పితృత్వ సెలవులను సైతం సూచించింది. వికలాంగ ఉద్యోగులకు సైతం మేలు జరిగేలా మరికొన్ని సిఫారసులను నివేదికలో పొందుపరిచింది. ఈ సూచనలు మహిళా, వికలాంగ ఉద్యోగులకు మేలు చేసేవిగా ఉండడంతో కార్యదర్శుల కమిటీ ఓకే చెప్పింది.  

 లీవ్‌ బెనిఫిట్స్‌:11వ పీఆర్‌సీ సిఫారసు
► బోధన రంగంలో ఉన్న బోధనేతర మహిళా ఉద్యోగులకు సైతం అదనంగా ఐదు సాధారణ సెలవులు ఉండాలి 
► ఇద్దరు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగి ఏడాది లోపు వయసున్న పిల్లలను దత్తత తీసుకుంటే 180 రోజుల దత్తత సెలవులు ఇవ్వాలి, అలాగే ఒంటరి లేదా అవివాహిత పురుష ఉద్యోగులకు సైతం 15 రోజుల పితృత్వ సెలవులు కూడా ఉండాలి 
► చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ 180 రోజులకు పెంచాలి, ఇదే నిబంధన ఒంటరి లేదా అవివాహిత పురుష ఉద్యోగులకు వర్తించాలి 
► కృత్రిమ అవయవాల అవసరం ఉన్న ఆర్థోపెడిక్‌ వికలాంగ ఉద్యోగులకు ఏడాదికి ఏడు ప్రత్యేక సాధారణ సెలవులు. హైరిస్క్‌ వార్డులో పనిచేసే నర్సింగ్‌ ఉద్యోగులకు సైతం ఈ వర్తింపు ఉండాలి కార్యదర్శుల కమిటీ ప్రతిపాదనలు: మహిళలు, వికలాంగుల లీవ్‌ బెనిఫిట్స్‌కు కమిటీ ఆమోదం తెలిపింది 
 
మెడికల్‌ బెనిఫిట్స్‌: పీఆర్‌సీ సిఫారసు  
► ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌లో ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వ సహకారం పెరగాలి, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు ఆదనపు నిధులను విడుదల చేయాలి 
► పెన్షన్‌ తీసుకునేవారు, వారి సహచరుల వార్షిక ఆరోగ్య పరీక్షల స్కీమ్‌ను పెంచాలి 
► డా. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ ద్వారా వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ సేవలు కూడా అందించేందుకు ఆయా ఆస్పత్రులతో చర్చించాలి 
► సర్వీస్‌ పెన్షనర్‌ / ఫ్యామిలీ పెన్షనర్స్‌కు నెలకు రూ.500 మెడికల్‌ భృతి చెల్లించాలి 
కార్యదర్శుల కమిటీ: మెడికల్‌ బెనిఫిట్స్‌ సిఫారసులన్నింటినీ అంగీకరించింది 
 ప్రత్యేక చెల్లింపులు: 11వ పే కమిషన్‌ సిఫారసు 
► ప్రస్తుతమున్న ఉద్యోగుల్లో కొన్ని కేటగిరీలకు ప్రత్యేక చెల్లింపుల క్వాంటం/రేటు పెంపు, కొన్ని వర్గాల ఉద్యోగుల చెల్లింపులను నిలిపి వేయాలి 
కార్యదర్శుల కమిటీ సిఫారసు: ఉద్యోగులకు ప్రత్యేక వేతనాల మంజూరును సమీక్షించడానికి సీనియర్‌ సెక్రటరీలు, హెచ్‌ఆర్‌ నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉంది. నిర్దిష్టమైన ప్రత్యేక వేతనాల రేట్ల పెంపునకు సిఫార్సు, ప్రత్యేక చెల్లింపుల సమస్యను, దీనిపై ప్రస్తుత మార్గదర్శకాల పరిశీలనకు అంగీకారం 
 ఇతర భత్యాలు: 
పే కమిషన్‌ సిఫారసులు 
► పెట్రోల్‌ అలవెన్సులను కిలోమీటర్‌కు రూ.15.50కి పెంచాలి. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలకు కి.మీకి రూ.11.50, డీజిల్‌ వాహనానికి రూ.6.50 ఇవ్వాలి 
► రోజువారీ భత్యం, వసతి చార్జీలు 33 శాతం పెంపు. రాష్ట్రం లోపల పర్యటనలకు రోజుకు రూ. 300 నుంచి రూ. 600 వరకు, రాష్ట్రం వెలుపల పర్యటనలకు రూ.400 నుంచి రూ.800కు పెంచవచ్చు. రాష్ట్రం వెలుపల బస చేసినప్పుడు రోజువారీ లాడ్జింగ్‌ భత్యం రూ.1,700 చెల్లించాలి 
► కోర్టు మాస్టర్స్, హైకోర్టు న్యాయమూర్తుల వ్యక్తిగత కార్యదర్శుల రవాణా చార్జీలు రూ.5 వేలకు పెంచాలి, ప్రయాణ భత్యాన్ని నెలకు రూ.1,700 కు పెంచాలి 
► పిల్లల ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏడాదికి రూ.2,500 పెంచాలి 
► మరణించిన ఉద్యోగి అంత్యక్రియల చార్జీలను రూ.20 వేలకు పెంచాలి 
► గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి నెలకు చెల్లించే ప్రత్యేక పరిహార భత్యాన్ని ప్రస్తుతమున్న రూ.500 నుంచి రూ.1,275కు,  రూ.700 నుంచి రూ.1800కు పెంచాలి 
► యూనిఫారం అలవెన్సులు, రిస్క్‌ అలవెన్సులు గణనీయంగా పెంచాలి 
► మెడికల్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు ఎమర్జెన్సీ హెల్త్‌ అలవెన్సు, రూరల్‌ మెడికల్‌ అలవెన్సులు, పీజీ డిగ్రీ అలవెన్సులు పెంచాలి 
► విజువల్లీ చాలెంజ్డ్‌ ఉపాధ్యాయులు, లెక్చరర్ల రీడర్స్‌ అలవెన్సును 33 శాతం పెంచాలి 
► ఏపీ భవన్‌లో పనిచేసే వారికి ఢిల్లీ అలవెన్సు కింద బేసిక్‌ పేలో 15 శాతం లేదా నెలకు రూ.5 వేలు చెల్లించాలి. ఏపీ భవన్‌లో పనిచేసే డ్రైవర్లకు స్పెషల్‌ అలవెన్సు కింద గంటకు రూ.30 చొప్పున గరిష్టంగా నెలకు 100 గంటలకు చెల్లించాలి 
► ఫిజికల్లీ చాలెంజ్డ్‌ ఉద్యోగుల కన్వీనియన్స్‌ చెల్లింపుల కింద వారి బేసిక్‌ పేలో 10 శాతం పెంచాలి. ఇది రూ.2 వేలకు మించరాదు 
కార్యదర్శుల కమిటీ: పే కమిషన్‌ సిఫారసులు పూర్తిగా మహిళలు, వికలాంగ ఉద్యోగులకు మేలు జరిగేదిగా ఉంది కాబట్టి ఈ సిఫారసులను ఆమోదించవచ్చు  

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి 11వ వేతన సవరణ కమిషన్‌ (పీఆర్‌సీ) నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. 

కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌  ఉద్యోగులకు భరోసా
   ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం 2019 నుంచి రాష్ట్రప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకున్నట్టు కార్యదర్శుల కమిటీ తన నివేదికలో తెలిపింది. 27 శాతం ఐఆర్‌ అమలు, అంగన్‌వాడీ, ఆశ, ఇతర ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల కారణంగా ప్రభుత్వంపై అదనపు భారం పడినట్టు పేర్కొంది. 

► ప్రభుత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్‌లకు రాష్ట్రప్రభుత్వం 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్‌ అమలు చేస్తోంది. 
► 2019 జూలై 1 నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఐఆర్‌ కింద ఉద్యోగులు, పెన్షనర్‌లకు రూ.15,839.99 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.11,270.21 కోట్లు, ఉద్యోగుల కోసం, రూ.4,568.78 కోట్లు పెన్షనర్‌ల కోసం వెచ్చించింది. 
► అంగన్‌వాడీలు, ఆశావర్కర్‌లు, హోమ్‌గార్డులు సహా 3,01,021 మంది ఉద్యోగులకు జీతాలు, రోజువారీ వేతనాలు పెంపొందించింది. వీరి వేతనాలు, జీతాల కోసం సంవత్సరానికి చేస్తున్న ఖర్చు రూ.1,198  కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది.

కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌
► కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీరికి మినిమం టైమ్‌ స్కేల్‌ను అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూన్‌ 18న టైమ్‌ స్కేల్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మొదటి రెండు ప్రసవాలకు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులను వర్తింపచేసింది. 
► కాంట్రాక్టు ఉద్యోగి యాక్సిడెంటల్‌గా మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను వర్తింప జేసింది. 
► అదనంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కల్పించిన వసతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.360 కోట్ల మేర ఖర్చు చేస్తోంది.  

‘సచివాలయ’ ఉద్యోగులకు బొనాంజా..
 
 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సైతం కొత్త పీఆర్సీ అమలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ ప్రకటించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమలులో లేదని..  ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈ పీఆర్సీ ‘సచివాలయా’ల ఉద్యోగులకు వర్తించే అవకాశం లేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ సమయంలో వారిని వదిలి వేయడం సబబు కాదన్న ఉద్దేశంతో తుదకు ఆయా ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ సిఫార్సులను వర్తింపజేయాలన్న ప్రతిపాదన చేస్తున్నట్టు కమిటీ తన నివేదికలో పేర్కొంది. ప్రొబేషనరీ ప్రకటన అనంతరం ‘సచివాలయ’ ఉద్యోగులకు  కొత్త పీఆర్సీ అమలు చేసిన పక్షంలో ప్రభుత్వంపై ఏడాదికి  రూ. 1,800 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉందని కమిటీ తన నివేదికలో వివరించింది. 

19 రకాల క్యాడర్‌ ఉద్యోగులకు రెండు రకాల పే స్కేల్‌ నిర్ణయం...
► గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులకు రూ. 15,030 కనిష్టంగా పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. 
► గ్రామ సచివాలయాల్లో పనిచేసే మిగిలిన డిజిటల్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, గ్రేడ్‌–2 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, హార్టికల్చర్‌ అసిస్టెంట్, సెరికల్చర్‌ అసిస్టెంట్, విలేజ్‌ సర్వేయర్, వీఆర్వో, వేల్ఫ్‌ర్‌ అసిస్టెంట్లకు రూ. 14,600 కనిష్ట పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పేర్కొంది. 
► వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీకి రూ. 15,030 కనిష్ట పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. మిగిలిన వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్‌–డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులరైజేషన్‌ సెక్రటరీ, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, వెల్ఫ్‌ర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలకు రూ. 14,600 కనిష్టంగా పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పేర్కొంది. 

సలాం సీఎం సర్‌
11వ పీఆర్సీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్థానం కల్పించడం అత్యంత గొప్ప విషయం. రూ.1,800 కోట్ల ఆర్థిక భారాన్ని సైతం ఖాతరు చేయకుండా ఉద్యోగులకు మేలు చేయాలన్న ఆలోచన చరిత్రాత్మకం. సీఎం జగన్‌ 15,004 సచివాలయాల ద్వారా 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించి జీవితంలో మరువలేని మేలు చేశారు. సచివాలయ ఉద్యోగులపై చిన్నచూపు చూసిన రాజకీయ పక్షాలకు ప్రభుత్వ ప్రకటన చెంపపెట్టు. ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని సచివాలయ ఉద్యోగులు నిలబెట్టుకుంటారు.
– ఎండీ జానీపాషా, అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ 

Back to Top