బడి పిల్లలందరికీ కంటి పరీక్షలు పూర్తి

వైయ‌స్సార్‌ కంటి వెలుగు కింద రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌రీక్ష‌లు

గిరిజన పిల్లల్లో కేవలం 0.29 శాతమే దృష్టిలోపాలు

ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఆధునిక ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండడమే కారణం

అదే ఎస్సీ పిల్లల్లో 1.09 శాతం ఉంటే ఓసీ పిల్లల్లో 1.77 శాతం సమస్యలు

అత్యధికంగా బీసీల పిల్లల్లో 3.46 శాతం ఇబ్బందులు

మొత్తం మీద ప్రతీ 100 మందిలో 6.6 శాతం మందికి దృష్టి లోపం

∙వీరిలో బాలికల్లో అత్యధికంగా 6.81 శాతం మందికి.

బాలురకు 6.46 శాతం మంది

రాష్ట్రంలోని బడి పిల్లలందరికీ కంటి పరీక్షలు పూర్తి

60 వేలకు పైగా స్కూళ్లలో 66.17 లక్షల పిల్లలకు పరీక్షలు

అమరావతి: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు.. అంటే అన్ని ఇంద్రియాల్లోకెల్లా నేత్రాలు చాలా ముఖ్యమైనవని అర్ధం. అలాంటి కంటిచూపుకు రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లల్లో కంటి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారి జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో 2019 అక్టోబర్‌ 10న వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ఉచితంగా కంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పిల్లల్లో కంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 

66.17 లక్షల మంది పిల్లలకు పరీక్షలు
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 60 వేలకు పైగా స్కూళ్లలోని 66.17 లక్షల మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4.38 లక్షల మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించారు. బాలికల్లో 6.81 శాతం మందికి, బాలురుల్లో 6.46 శాతం మందికి చూపులో ఇబ్బందులు ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలింది. మొత్తం మీద రాష్ట్రంలో ప్రతీ 100 మంది పిల్లల్లో 6.6 శాతం మంది పిల్లలకు కంటి సమస్యలున్నట్లు స్పష్టమైంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ పరీక్షల్లో మిగతా పిల్లలతో పోల్చి చూస్తే గిరిజన పిల్లల్లో దృష్టి లోపాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. వారు నివశించే ప్రాంతాలతో పాటు ఆధునిక ఆహారపు అలవాట్లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ప్రభావం తక్కువగా ఉండటంతో వారిలో దృష్టి లోపాలు తక్కువగా ఉన్నాయి. వీరిలో అత్యల్పంగా 0.29 శాతమే సమస్యలున్నట్లు పరీక్షల్లో తేలింది. అలాగే.. ఎస్సీ పిల్లల్లో 1.09 శాతం దృష్టిలోపం ఉండగా ఓసీ పిల్లల్లో 1.77 శాతం ఉంది. అత్యధికంగా బీసీ పిల్లల్లో 3.46 శాతం కంటి సమస్యలు కనిపించాయి. 

రెండు దశల్లో కంటి పరీక్షలు
పిల్లలందరికీ రెండు దశల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. తొలి దశలో ప్రాథమికంగా కంటి స్క్రీనింగ్‌ నిర్వహించారు. వీరి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ స్క్రీనింగ్‌లో కంటి సమస్యలున్నట్లు గుర్తించిన 4.38 లక్షల మంది పిల్లలకు రెండో దశలో నిపుణులతో పరీక్షలు చేయించారు. ఇందులో 2.41 లక్షల మందికి మందులు, వైద్యుల సలహాలు, సూచనలిచ్చారు. 1.58 లక్షల మందికి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. మరో 42,542 మందికి నిపుణుల పరీక్షలకు సూచించారు. ఈ పరీక్షల ద్వారా 24,017 మంది పిల్లలకు కంటి సంరక్షణపై సూచనలు చేశారు. 2,612 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చగా వీరిలో 294 మందికి వాటిని పూర్తిచేశారు. మరో 145 మంది పిల్లలకు శుక్లాల ఆపరేషన్లు చేశారు.

పిల్లలపై ‘ఎలక్ట్రానిక్స్‌’ ప్రభావం తీవ్రంగా ఉంది
చిన్న పిల్లల కంటిచూపుపై ఎలక్ట్రానిక్‌ పరికరాల ప్రభావం తీవ్రంగా ఉంది. సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, ట్యాబ్‌లు వంటివి చిన్నతనం నుంచే అలవాటు చెయ్యొద్దు. టీవీల ప్రభావం కూడా తక్కువేం కాదు. వీటి ప్రభావం పట్టణ పిల్లల్లో ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో ఈ ఉపకరణాలు తక్కువగా వాడుతున్నారు కాబట్టి గిరిజన పిల్లల్లో కంటి సమస్యలు తక్కువగా ఉన్నాయి.
– డా. హైమావతి, నోడల్‌ అధికారి, వైయ‌స్సార్‌ కంటి వెలుగు 

కంటి పరీక్షల వివరాలు

జెండర్‌    పరీక్షలు     దృష్టిలోపం    లోపం శాతం
బాలురు      34,44,818      2,22,676     6.46 శాతం
బాలికలు    31,72,795    2,16,075     6.81 శాతం

సామాజికవర్గాల వారీగా కంటి పరీక్షలు..

సామాజికవర్గం    దృష్టిలోపం     లోపం శాతం
ఎస్సీ     72,771     1.09 శాతం
ఎస్టీ    19,214     0.29 శాతం
బీసీ    2,29,567      3.46 శాతం
ఓసీ    1,17,109     1.77 శాతం

Back to Top