సాటిలేని ‘ఉప’కారం..

ఎస్సీ సబ్‌ప్లాన్‌పై కేంద్ర గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం

మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో సాయం అందలేదు

ఏపీలో 3.28 లక్షల పట్టణ పేద కుటుంబాలకు సాయం

వంద శాతం పని చేస్తున్న అంగన్‌వాడీలు, ఐసీడీఎస్‌లు 

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదికలో వెల్లడి

అమరావతి: అత్యంత సమర్థంగా ఎస్సీ ఉప ప్రణాళికను అమలు చేస్తూ ఆయా కుటుంబాలకు సాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళికను ఈ ఆర్థిక ఏడాది తొలి ఆరు నెలల్లోనే అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.

2022–23 రెండో త్రైమాసికం వరకు (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పథకాల అమలు పురోగతిపై రూపొందించిన నివేదికను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఈ నెల 11వ తేదీన విడుదల చేసింది. ఉపప్రణాళిక ద్వారా చిత్తశుద్ధితో ఎస్సీ కుటుంబాలకు సాయం అందించడం, ఎస్సీ విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల మంజూరు­తో పాటు పట్టణ పేదలకు సాయం, వ్యవ­సాయ పంపు సెట్లకు విద్యుత్‌ కనెక్షన్ల జారీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనపరిచిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రశంసించింది. 

► నిర్దేశిత లక్ష్యాల్లో 90 శాతానికిపైగా అమలు చేసిన రాష్ట్రాలను చాలా మంచి పనితీరు కనపరిచినట్లు పరిగణించారు. 80 నుంచి 90 శాతం మేర అమలు చేసిన రాష్ట్రాలను  మంచి పనితీరు కనపరిచిన జాబితాలో చేర్చారు. 80 శాతం లోపు అమలు చేసిన రాష్ట్రాలను పనితీరు బాగోలేని వాటిగా నివేదిక వర్గీకరించింది. 

► ఎస్సీ ఉప ప్రణాళిక కింద దేశంలోని 22 రాష్ట్రాల్లో మొత్తం 29.84 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం అందించగా అందులో 29.10 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌లో సహాయం అందినట్లు నివేదిక వెల్లడించింది. మిగతా మరే రాష్ట్రం కూడా లక్ష ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయలేదని నివేదిక పేర్కొంది. మిగతా రాష్ట్రాలు కేవలం వేల సంఖ్యలో మాత్రమే సాయానికి పరిమితమయ్యాయి. కర్నాటకలో 22,884 మంది ఎస్సీ కుటుంబాలకు ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా సాయం అందించగా మిగతా రాష్ట్రాలు అంతకంటే తక్కువ సంఖ్యకే పరిమితమయ్యాయి. 

► ఈ ఆర్థిక ఏడాది తొలి ఆర్నెళ్లలో దేశవ్యాప్తంగా పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కింద 11,80,746 మంది ఎస్సీ విద్యార్థులు సాయం పొందగా అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే 6.15 లక్షల మంది ఎస్సీ విద్యార్ధులు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు అందుకోవడం గమనార్హం. 

పేదలకు సాయం.. ఇళ్లు.. లక్ష్యానికి మించి వ్యవసాయ కనెక్షన్లు...
► దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి పట్టణ ప్రాంతాల్లోని 3.47 లక్షల పేద కుటుంబాలకు సహాయం అందించగా ఆంధ్రప్రదేశ్‌లోనే 3.28 లక్షల మంది పట్టణ పేద కుటుంబాలకు సాయం అందినట్లు నివేదిక వెల్లడించింది. 

► పట్టణ ప్రాంతాల్లో 24 రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ కింద 3.29 లక్షల గృహాలను నిర్మించగా ఒక్క ఆంద్రప్రదేశ్‌లోనే 1,38,245 ఇళ్ల నిర్మాణంతో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ తరువాత బిహార్‌ 99,718 గృహాలను నిర్మించింది. మిగతా రాష్ట్రాలు స్వల్ప సంఖ్యకే పరిమితమయ్యాయి. 

► వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడంలో ఏపీ చాలా మంచి పనితీరు కనపరిచినట్లు నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24,852 విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా తొలి ఆర్నెళ్లలోనే లక్ష్యానికి మించి ఏకంగా 46,856 విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడం గమనార్హం. లక్ష్యానికి మించి 754 శాతం నమోదైనట్లు నివేదిక పేర్కొంది.  

► ఏపీలో అంగన్‌వాడీలు, ఐసీడీఎస్‌లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీలతో పాటు 257 ఐసీడీఎస్‌లు నూటికి నూరు శాతం పని చేస్తున్నట్లు పేర్కొంది. 

Back to Top