వైయస్‌ఆర్‌సీపీలో ఉప్పొంగిన ఉత్సాహం

– నంద్యాల ఎన్నికల కోసం సిద్ధమైన కేడర్‌
– జననేత యాక్షన్‌ ప్లాన్‌తో టీడీపీలో మొదలైన వణుకు
– ప్రెస్‌మీట్ లకే పరిమితమైన టీడీపీ నాయకులు 
– వైయస్‌ఆర్‌సీపీ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం 
– టీడీపీ ప్రభుత్వంపై జనాల్లో పీకల్లోతు ఆగ్రహం 

అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. డబ్బులు వెదజల్లి ప్రజలను ప్రభావితం చేయొచ్చని కలలు కంటున్న చంద్రబాబు అహంకారానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నంద్యాల్లో వైయస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడం ద్వారా మొదలైన పార్టీ ఫిరాయింపులు అదే నంద్యాల నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల ద్వారా టీడీపీకి గట్టి షాక్‌ ఇచ్చేందుకు నంద్యాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గడిచిన నెల రోజుల్లో అభివృద్ధి పనుల పేరుతో రూ. 1300 కోట్లు తెచ్చి గుమ్మరించారు. మూడేళ్లలో పట్టించుకోని నంద్యాల అభివృద్ధి గురించి చంద్రబాబుకు ఇప్పుడే గుర్తొచ్చిందా అని జనం కస్సుమంటున్నారు. రోడ్డు వెడల్పు పేరుతో రాత్రికిరాత్రి ఇళ్లను కూలగొట్టడంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల ప్రచారం కోసం హెలికాఫ్టర్‌లో వచ్చిన చంద్రబాబును మహిళలు అడ్డుకుని నినాదాలతో హోరెత్తించారు. ఇదంతా ఎవరో వెనకుండి చేయిస్తున్నది కాదు.. రాజకీయంగా వేసిన ఎత్తుగడ అంతకన్నా కాదు. బాధితులే తమకు తామే కడుపుమండి చంద్రబాబు అరాచకాలకు ఎదురు నిలచిన సంఘటన. 

అణగదొక్కాలని చూసి...
రౌడీయిజం, పోలీసుల బెదిరింపులు, కేసులతో వేధింపులు, కులం పేరుతో కవ్వింపులు, డబ్బు వెదజల్లి లొంగదీసుకోవడం.. ఇలా ఒకటేమిటి చంద్రబాబు ప్రయత్నించని మార్గం లేదు. సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తూనే ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారైతే చాలు కార్యకర్తలు, నాయకులనే తేడాలేదు వేధింపులు ఎదుర్కొనడానికి. పగలూ, అర్ధరాత్రుళ్లు అనే భేదం లేదు ఇంటి మీదికి పోలీసులను పంపించి వేధించడానికి. అధికార పార్టీ నుంచి ఎవరైనా ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీలోకి చేరితే చాలు రౌడీయిజం ప్రదర్శించి.. బంధుమిత్రులను బెదిరించి  సాయంత్రానికి దారికి తెచ్చుకుంటారు. కాళ్లరిగేలా తిరిగినా మంజూరు కాని ఇళ్లు, పింఛన్లు భూమా మరణంతో ఖాళీ అయిన నంద్యాల సీటుతో తమకు వస్తున్నాయని జనమే బహిరంగంగా చెప్పుకుని సంబర పడితున్నారంటే ఈ మూడేళ్లలో బాబు నంద్యాల ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పక తప్పదు. నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేలు చావాలి.. బై ఎలక్షన్లు రావాలి.. అని సాక్షాత్తు భూమా బామ్మర్ది ఎస్సీ మోహన్‌రెడ్డి అందరి సమక్షంలోనే వేదికపై అన్నాడంటే బాబు జనానికి ఏం చేయడం లేదని చెప్పడానికి ఇంతకన్నా ఆధారం మరేం కావాలి. ఏదో చేస్తాడని పార్టీ మారిన ఎమ్మెల్యే కూడా ఇక్కడేం లేదని ఒప్పుకున్నట్టేగా. అయితే ఇవన్నీ కాదని.. మూడేళ్లుగా జరగని అభివృద్ధిని పచ్చ రంగు కుట్టు మిషన్లు, రెడీమేడ్‌ తారు రోడ్లేసి ఓట్లు పొందాలని చూస్తున్నాడు. ఇద్దరు ముస్లింలకు పదవులిస్తేనో.. కాపులకు కల్యాణ మండపం కడతామని హామీ ఇస్తేనో గెలిచేస్తామని పగటి కలలు కంటున్నాడు. 

వైయస్‌ జగన్‌ యాక్షన్‌ ప్లాన్‌తో టీడీపీ ఆశలు ఆవిరి
రాబోయే ఎన్నికల కోసం వైయస్‌ జగన్‌ ఇప్పట్నుంచి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీ ప్లీనరీలో నవ రత్నాలు ప్రకటించిన జననేత, పాదయాత్ర చేస్తానని కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు చేశారు. అయితే కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని చల్లారనీయకుండా మూడు విడతలుగా 60 రోజుల యాక్షన్‌ సిద్ధం చేశారు. కేవలం నంద్యాల ఉప ఎన్నికలను మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో ఎలాగైనా అవినీతి టీడీపీ ప్రభుత్వానికి గట్టి షాకిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆగస్టు 11 నుంచి 29 వరకు నవరత్నాల సభలు, సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 2 వరకు వైయస్‌ఆర్‌ కుటుంబం పేరుతో పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్‌ 2 నుంచి పాదయాత్ర చేయబోయే వరకు విజయశంఖారావం పేరుతో పార్టీ నాయకులు ఆయా పోలింగ్‌ బూత్‌ల పరిధిలో తిరిగి పాదయాత్రపై అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే నవ రత్నాల హామీలతో బాబుకు ముచ్చెమటలు పడుతుండగా.. తాజాగా నిర్ణయించిన యాక్షన్‌ప్లాన్‌తో చంద్రబాబును అష్ట దిగ్బంధం చేసినట్టయింది. దాంతోపాటు వైయస్‌ఆర్‌సీపలోకి రోజురోజుకు చేరికలు కూడా జరుగుతుండటంతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం రెట్టింపయింది. దీంతో అధికార టీడీపీలో ప్రకంపనలకు కారణమైంది. పైగా తనను పట్టించుకోలేదన్న కారణంతో టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కూడా వైయస్‌ఆర్‌సీపీలో చేరనుండటంతో టీడీపీ రోజురోజుకు నీరుగారిపోతుంది. ఈ నేపథ్యంలో ఈనెల 3న పార్టీ అధినేత నంద్యాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభ కూడా టీడీపీని భయాందోళనకు గురిచేస్తోంది. దాదాపు సగం మంత్రివర్గం, వేల కోట్ల డబ్బు, పోలీసుల బలగాలు, పార్టీ ఎమ్మెల్యేలు, రెండుసార్లు చంద్రబాబు పర్యటనలు, నారా లోకేష్‌ పర్యటనలు.. ఇవేవీ తీసుకురాని ఉత్సాహం ఒక్క వైయస్‌ జగన్‌ ఈనెల 3న ఏర్పాటు చేయనున్న బహిరంగ సభతో ఉంటుందన్నది సందేహం లేదని వాస్తవం. ప్రతిపక్ష నాయకుడిని తిట్టడానికే ప్రెస్‌మీట్‌లు పెట్టే టీడీపీ నాయకులను జనం చీదరించుకుంటన్నారు. నీతి నిజాయతీల గురించి లెక్చర్లు దంచేసే టీడీపీ నాయకుల గురించి జనం ఎదురు ప్రశ్నించడానికి కూడా జంకడం లేదంటేనే వారిలో వచ్చిన చైతన్యమే. ఇంకా చెప్పాలంటే వైయస్‌ జగన్‌ గత మూడేళ్లుగా ఆయన చేసిన పోరాటాల ద్వారా ప్రజల పక్షాన ఉంటానని ఇచ్చిన భరోసా. దానికి జనం నుంచి వచ్చిన స్పందన అని చెప్పకతప్పదు. నంద్యాల ఎన్నికల బాధ్యతలు మోస్తున్న మంత్రులు భూమా అఖిల ప్రియ, అమర్నా«ద్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు వైయస్సార్‌సీపీలో గెలిచి టీడీపీలో చేరి మంత్రి పదవులు అనుభవిస్తున్నవారే. వీరంతా నీతి నిజాయితీల గురించి చెప్పుకోవడం చూసి నంద్యాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. నైతికత గురించి వీరి దగ్గర చెప్పించుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడాల్సి వస్తుందని వాపోతున్నారు. అధికారం కోసం పార్టీలు ఫిరాయించే నాయకులకు గట్టి ఝలక్‌ ఇచ్చేందుకు నంద్యాల ప్రజలు కూడా సిద్ధమైనట్టే ఉన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కూడా క్రమశిక్షణతో సామాన్యుల్లా ప్రజల్లో కలిసి పోయి చేస్తున్న ప్రచారానికి జనం నీరాజనాలు పడుతున్నారు.
Back to Top