పతాక స్థాయికి రామోజీరావు పిచ్చి

రామోజీరావుకు తన పిచ్చి తనకు ఆనందమని ఈనాడులో రెండు నెలలుగా రాస్తున్న రాతలు చూస్తుంటే అర్థమవుతోంది. చంద్రబాబు కోసం ఆయన పదేళ్లుగా బూర ఊదుతూనే ఉన్నా జనం వినటం లేదు. రామోజీరావు ఇస్తున్న పిలుపుతో చంద్రబాబును జనం ఓడిస్తూనే ఉన్నారు. దాంతో ఉన్మాదిలా మారిపోయి రామోజీ పిచ్చి రాతలు రాస్తున్నారు. రామోజీ.. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. మే 16 తరవాత మీ మొహానికి ఏం అడ్డుపెట్టుకుంటారు?

రామోజీరావుగారూ... మీ పరిస్థితి చూస్తే జాలి వేస్తోంది. చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాల్లో గెలవడు. కనీసం ప్రతిపక్ష హోదా దక్కుతుందా అంటే అనుమానమే. మీరు నమ్ముకున్న బాబు నట్టేట మునగటంతో పాటుగా, మీ జీవితం అంతా ద్వేషించిన వైయస్‌గారి తనయుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ప్రజాదరణ వీసమెత్తు కూడా తగ్గకపోవటం మిమ్మల్ని ఎంతగా పిచ్చివాడిని చేసిందో గత రెండు నెలలుగా ఏ రోజున మీ పత్రిక చూసినా పాఠకులకు అర్థం అవుతుంది. తెలుగు జర్నలిజాన్ని వ్యాపారంగా మార్చి పాతాళానికి దిగజార్చటంతో పాటుగా, ఆ పాతాళంలో కూడా ఇంకా లోతులేమైనా ఉన్నాయా అన్నట్టు మీ వ్యాసంగం సాగుతోంది. నాలుగున్నరేళ్ళుగా శ్రీ జగన్ అధికారంలో‌ గానీ, అధికార పక్షంలో గానీ లేడు. చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర ఈ నాలుగున్నరేళ్ళలో ఏనాడూ పోషించలేదు. అధికార కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలు పరాకాష్టకు చేరింది ఈ నాలుగున్నరేళ్ళలోనే. ఏ ఎన్నికలు అయినా ఇప్పటి పాలకుల పనితీరు‌ మీద తీర్పుగా జరుగుతాయి. ఈ మౌలిక వాస్తవాలతో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. వైయస్‌ఆర్ అయిదేళ్ళ మూడు నెలలూ ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగిన సువర్ణ యుగం. కాదని రంకెలేయదలచుకుంటే అది మీ ఇష్టం. కానీ 2009 నుంచి మీరు, మీ పత్రిక ఎందుకు బయటపడలేకపోతున్నారు? ప్రజలంతా వై‌యస్‌ఆర్‌ను అభివృద్ధికి మారు పేరు అంటుంటే మీరెందుకు గంగవెర్రులెత్తుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసినవే. చంద్రబాబు ఇక జీవితంలో రాజకీయంగా పైకి లేవడు. శ్రీ జగన్‌కు జనాదరణ మీరెన్ని కుట్రలు చేసినా, కథనాలు రాసినా తగ్గదు. ప్రజల తీర్పు, ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని గుర్తించలేని మీ స్వభావాన్ని చూసి మీ పాఠకులు కూడా జాలి పడక తప్పదు రామోజీరావుగారూ.

అప్పటి ప్రజలు అదృష్టవంతులు :
రామోజీరావు గారూ!! 1947 కన్నా ముందు మీ పత్రిక లేకపోవటం ఈ దేశ ప్రజల అదృష్టం అని మాకు అనిపిస్తోంది. కానీ ఇప్పుడు మీ పత్రిక ఉండటం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. పెన్ను పెన్నునా విషం నింపుకున్న మీ ‘ఈనాడు’ అనే తెలుగుదేశం పార్టీ  కరపత్రం కనక స్వాతంత్య్ర సమరం జరుగుతున్నప్పుడు ఉండి ఉంటే చివరికి ఆ మహాత్మా గాంధీకి కూడా అవినీతినో.. మరో ఆరోపణలనో అంటగట్టేవారు. ఏం? అడ్డగోలుగా ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విభజిస్తుంటే మీ పత్రిక దానిపై ఒక్క ముక్క కూడా రాయలేదెందుకు? అది మీ ఎజెండా కాదా? ఇలాంటివన్నీ దాటవేసి... కేవలం శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డినే ఎజెండా చేసుకుని మీరు ఈ రోజున మీ పత్రికను నడుపుతున్న తీరు చూస్తుంటే రోత పుడుతోంది. మీ నైరాశ్యాన్ని, నిస్పృహను, ఉన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని చూసి మీ మీద సానుభూతి వ్యక్తం చేయాలనిపిస్తోంది. ఎందుకంటే పిచ్చి ముదిరిన ఉన్మాదుల్ని చూసి సమాజం జాలి చూపిస్తుంది తప్ప ఆగ్రహాన్ని ప్రదర్శించదు.

ఈ ‘టీడీపీ’ కరపత్రంలో టన్నుల కొద్దీ విషమే :
మీరు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఇలా పాంచజన్యం ఊదుతారు. ‘జగన్ ఉండాల్సింది జైల్లో’ అంటూ శుక్రవారం రాసిన సంపాదకీయాల్లాంటివి ఇంతకు ముందు కూడా వందలకొద్దీ రాశారు. వై‌యస్‌ఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా టన్నుల కొద్దీ విషాన్ని నింపి మీ పాఠకుల ఇళ్ళలో మీ టీడీపీ కరపత్రాన్ని విసురుతారు. మీరు ఊదిన పాంచజన్యం స్ఫూర్తితో ప్రజలు ఎన్నికల సమరానికి సిద్ధమై చంద్రబాబును కసితీరా ఓడగొడుతున్నారు. ఇదేం విచిత్రం రామోజీగారూ! మీరు గెలిపించాలంటుంది చంద్రబాబుని.. ఓడించాలంటోంది మమ్మల్ని!! కానీ, ప్రజలు ఓడిస్తున్నది మీ చంద్రబాబుని. ఎందుకిలా జరుగుతోందో ఒక్కసారైనా ఆలోచించగల విజ్ఞత మీ మెదడులో ఏ ఒక్క నరానికీ లేదెందుకు? వయసు ముదిరి అవన్నీ తెగిపోయాయా?

చంద్రబాబుకు మీకు సంబంధమేమిటి? :
అయినా రామోజీరావు గారూ.. చంద్రబాబుని గెలిపించాలని ఎందుకు మీకింత ఆరాటం? అసలు మీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? చంద్రబాబు ఓడితే మీకు వచ్చిన నష్టం ఏమిటి? చంద్రబాబు గెలిచినప్పుడు ప్రజలకు వచ్చిన లాభం ఏమిటి? తన 9 ఏళ్ళ పరిపాలనను తెస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అప్పట్లో చంద్రబాబుని నడిపింది మీరే కదా. సబ్సిడీలు వద్దని ప్రజలకు బియ్యం 2 రూపాయలకు ఇస్తే.. భారం రాష్ట్ర ఖజానా మీద తడిసిమోపెడు అవుతుందని రీముల కొద్దీ పేపర్ల మీద మీ సంపాదకీయాల్లోనే రాశారు కదా. అలాగే విద్యుత్ సంస్థను చంద్రబాబు‌ నాయుడు ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ప్రైవేటైజ్ చేస్తుంటే, ప్రభుత్వ సంస్థలను పప్పుబెల్లాల్లా తన బినామీలకు, మీ అనుయాయులకు కట్టబెట్టేస్తుంటే వాటికి సంస్కరణలు అనే ముసుగు తొడిగింది కూడా మీరేగా? పోలవరం కంటే ఇంకుడుగుంతే మంచిదని చంద్రబాబును వెనకేసుకొచ్చింది మీరే కదా. ఆసుపత్రుల్లో చిన్న చిన్న పరీక్షలకు కూడా యూజ‌ర్ చార్జీలు ప్రవేశపెడితే.. మీరేం అన్నారు రామోజీరావు గారూ..?

మీరు పెన్ను పట్టుకున్న ఉగ్రవాది కాదా?
వేల మంది రైతులు ఉచిత విద్యుత్ లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు తీసుకున్న స్టాండ్ ఏమిటి? ఉచిత విద్యు‌త్‌కు వ్యతిరేకంగా మీరు ఎన్ని సంపాదకీయాలు రాశారు? అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 9 గంటలు, 12 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానంటుంటే.. అవి వై‌యస్‌ఆర్ అడుగు జాడలేనని, మీ బాబు వాటికి సలాం చేస్తున్నాడని విమర్శిస్తూ.. సంపాదకీయాలు రాసే సత్తా మీలో లేదెందుకు? ప్రజలకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించే రోజులు పోయాయని చెప్పటమే కాకుండా శ్రమదానం, జన్మభూమి.. అంటూ పేజీలకు పేజీలు వేశారే? మరి ఆ శ్రమదానాలు గత పదేళ్ళుగా చేయించాలనే కోరిక మీలో ఎందుకు నశించింది? అదీ గాక, మద్య నిషేధం మొదటి ఉద్యమకురుడైన మీరు వ్యక్తిగత జీవితంలో మీ హొటళ్ళలో మద్య అమ్మకూడదనే నిర్ణయాన్ని కూడా ఎందుకు తీసుకోలేకపోయారు? మీ హొటళ్ళు పూర్తి కాగానే.. మద్య నిషేధాన్ని చంద్రబాబు ద్వారా ఎత్తించేశారు? 'ఉదయం' పత్రికను హత్య చేయించడానికేగా... మీ మద్య నిషేధ ఉద్యమం పుట్టింది! ఇన్ని దురాగతాలు చేసిన మీరు పెన్ను పట్టుకున్న ఉగ్రవాది కాక మరేంటి?

‌నగరం నడిబొడ్డున ఐఎంజీ అనే బినామీ కంపెనీకి 850 ఎకరాల్ని బాబు కట్టబెట్టేసి తన జేబులో వేసుకుంటే మీరు ఎన్నడైనా ప్రశ్నించారా? ఎకరా రూ.50 వేలకు ఇవ్వటమేంటని అడిగారా? ఎమ్మార్‌కు 530 ఎకరాలు ధారాదత్తం చేస్తే ఒక్క ముక్కయినా బాబుకు వ్యతిరేకంగా రాశారా? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, బంధుమిత్రుల్ని ఎన్నడో మీరు మోసం చేశారు. మరి మీ పాఠకులను కూడా ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు రామోజీ?

మీ చేతులకంటిన ‘మురికి’ మాటేమిటి?
2009 సెప్టెంబర్ 2న వైయస్‌ఆర్ గారు మరణించే వరకు ఆయన మీద కానీ,‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి గారి మీద కానీ ఏ క్రిమినల్ కేసులూ లేవు. ఒక్కసారంటూ సోనియా గాంధీని ఎదిరించాకే సీబీఐ కేసులు, దర్యాప్తులు, వేధింపులు ఆరంభమై నేటికీ కొనసాగుతున్నాయి. కానీ, రామోజీరావు గారూ.. మాకు ఈ దేశంలో చట్టాలు వర్తించవు అని మేమెన్నడూ వాదించలేదు. అదే తమరు ఆ‌ర్‌బీఐ సెక్షన్ 45 ఎస్ మీకు వర్తించదని వాదించారు. మార్గదర్శి ఫైనా‌న్సు ద్వారా వేల కోట్లు వసూలు చేసి మీకు మీరే ప్రభువు అన్నట్టు, ఈ దేశంలో చట్టం, రాజ్యాంగం వంటివి మీకు వర్తించవు అన్నట్టు ప్రవర్తించారు. మనదికాని మంది సొమ్ముని అంత పెద్ద మూట కట్టిన వాడిని ఆర్థిక నేరగాడు అనాలా? ఆర్థిక ఉగ్రవాది అనాలా? లేక పత్రికాధిపతి అనాలా? పాలమాకులలో ఏకంగా 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. హైదరాబాద్‌లో 3,000 ఎకరాల భూమిని కార్పొరేట్ చట్టాలను అడ్డం పెట్టుకుని భూం ఫ‌ట్ అనో.. హాం ఫ‌ట్ అనో అనిపించారు. కొండల్ని, కోనల్ని కబళించి, తొలచి ఆక్రమించారు. పాపం! పేదలకిచ్చిన అసైన్డు భూముల్ని సైతం మింగేశారు. ఆ బక్క ప్రాణులకు వాటిని తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం చెబితే... మీకు అలవాటైన రీతిలో కోర్టుకెళ్లి ఆపించుకున్నారు.

మీ జీవితంలో నిజాయితీకి స్థానం ఉందా? :
అయినా మీ చరిత్ర ఎంత గలీజో మీకు తెలియదా రామోజీ? లీజు పేరిట విశాఖలో స్థలాన్ని ఆక్రమించుకుని, గడువు తీరిపోయినా కూడా ఏడెనిమిదేళ్లు న్యాయపోరాటం చేసి కాలం వెళ్లదీసిన దరిద్రపు చరిత్ర మీది. జిల్లా కోర్టు నుంచి మొదలెట్టి సుప్రీంకోర్టు దాకా మీకు వ్యతిరేకంగా తీర్పులిస్తేనే కదా మీరు ఆ స్థలాన్ని వదిలింది! మీ మనసుకు తెలియదా మీరే వేరే వ్యక్తి స్థలాన్ని ఆక్రమించారని? కింది కోర్టు మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చాకైనా దాన్ని ఖాళీ చేయాలని ఎందుకు అనిపించలేదు? 80 ఏళ్లు వస్తున్నా ఆ బుద్ధి లేకపోయిందేం? లీజుకు తీసుకుని ‘డాల్ఫిన్ హోటల్’ స్థలాన్ని కబ్జా చేసినట్లే దీన్నీ చేయొచ్చనుకున్నారేమో! మీ తోడల్లుడి స్థలాన్ని విజయవాడలో లీజు పేర మింగేసినట్టే దీన్నీ భోంచేయొచ్చనుకున్నారేమో!! అసలు ఇక్కడి నుంచి మొదలుపెడితే మీ మొత్తం జీవితంలో ఏ అణువులోనైనా నిజాయితీ కనిపిస్తుందా? అసలు మీ మీద ఉన్నన్ని కేసులు, నేరారోపణలు మరే పత్రికాధిపతి మీద అయినా ఉన్నాయా? మీరు ఈ రోజున ప్రింట్ చేస్తున్న ఈనాడుని చూస్తే ఎవరికైనా ఒక్క అనుమానం మాత్రం వచ్చి తీరుతుంది. ఇది పత్రికా కార్యాలయంలో ప్రింట్ చేస్తున్నారా? లేక పిచ్చాసుపత్రిలో ప్రింట్ చేస్తున్నారా? అని!!

ఆ ‘పసుపు’ రాతలేమిటి రామోజీ?‌ :
లేకపోతే మీరు రాస్తున్న రాతలేంటి రామోజీరావు గారూ..! రాజశేఖరరెడ్డి రైతులకు అన్యాయం చేశాడా? చంద్రబాబు రైతులకు న్యాయం చేశాడా? మీరు మోహించి వలచిన చంద్రబాబు మీకు రంభలా కనపడతాడేమో గానీ, ప్రజలకు మాత్రం 65 ఏళ్ళ చరిత్ర హీనుడైన ఒక గుంటనక్కే అక్కడ కనపడుతున్నాడు. ఆయనకు మీరు ఎన్ని మేకప్పులు వేసినా, ఎంత గాలికొట్టినా ఏం ప్రయోజనం? వైయస్‌ఆర్ హయాంలో పన్నులు వేశారని, వ్యా‌ట్ ప్రవేశపెట్టారని.. ఆ రాతలేంటి? ఎవరిని మోసం చేయాలని? రామోజీరావు గారూ.. వైయస్‌ఆర్ గారి హయాంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందే తప్ప, పన్నులు పెంచటం వల్ల కాదు. బీఏ ఎకనమి‌క్సు స్టూడెంట్‌కు కూడా అర్థమయ్యే ఈ అంశం తమరికి అర్థం కాలేదంటే అందుకు కారణం తమ కళ్ళని పసుపు పొరలు కమ్మేయటమే. క్యాటరాక్టుకు అయితే ఆపరేషన్ ఉంటుంది! మీ కామెర్లకు మందు లేదు... రాదు కూడా!!

మెంటల్ పేషెంట్ అని అర్థమవుతోంది‌ :
రామోజీరావు గారూ.. వైయస్‌ఆర్ చనిపోయి ఏకంగా నాలుగున్నరేళ్ళు దాటిపోయింది. అయినా, మీకు ఆ రెండక్షరాలు వింటే కాళ్ళు చల్లబడిపోతున్నాయి ఎందుకని? నాలుగున్నరేళ్ళుగా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగింది. సోనియా‌ గాంధీ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసింది. అందుకు చంద్రబాబు లేఖే కత్తిలా ఉపయోగపడింది. అయినా సోనియా గురించి నాలుగున్నరేళ్ళుగా మీ విమర్శల ప్రవాహం ఎందుకు ఆగిపోయింది? ఆ కత్తితోనే మీ నాలుక చీరేస్తారని భయపడ్డారా? మీ మీద ఉండి, మీరు స్టే తెచ్చుకున్న కేసుల్లో ఏ ఒక్కటి విచారణకు వచ్చినా భారతీయ చట్టాల ప్రకారమే భయానక శిక్షలకు గురి కావాల్సి వస్తుందని వణికిపోయారా? బతికి ఉంటే బలుసాకు  అయినా తినవచ్చునని భావించిన మీరు... ఇన్నాళ్లూ మొహం చాటేసి ఇపుడు సంపాదకీయాలు, ప్రత్యేక పేజీలు పెట్టుకుని చేసే పంచనామాల ద్వారా డాక్టర్ అనిపించుకోలేరు. డాక్ట‌ర్ వేషంలో ఉన్న మెంట‌ల్ పేషెంట్ అని మాత్రమే అందరికీ అర్థం అవుతుంది.

మీ పిచ్చే మీకు ఆనందం :
ప్రజాస్వామ్యం అంటే మీరు చెప్పినట్టు, మీ ప్రయోజనాల కోసం ఓటర్లు చంద్రబాబుకు ఓటు వేయటం కాదు రామోజీరావుగారూ. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమకు నచ్చిన నాయకుడ్ని ఎన్నుకోవటం. 2004లోనూ, 2009లోనూ 2009 తర్వాత ప్రతి ఉప ఎన్నికలోనూ మీ రాతలకు వెంట్రుకముక్క పాటి విలువ కూడా దక్కలేదన్న సంగతి మీకు తెలుసు. టీడీపీని మీరు మీ స్వార్థం కోసం గెలిపించటానికి చేసిన ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి కుట్రపూరితమైన రాతల్లోనూ అంతిమంగా వచ్చిన ఫలితం ఏమిటంటే.. మీరు, టీడీపీ జాయింట్‌గా ఓడటం. ఇప్పుడు తెలుగుదేశం, ఈనాడు కాంబినేషన్‌లో నడుస్తున్న డ్రామాను చూస్తుంటే ఈత రాని ఇద్దరు బడాయిలకు పోయి లోతైన గుంటలో దూకి ఒకరిని రక్షించేందుకు మరొకరు చేస్తున్న ప్రయత్నంలా ఉంది.  రామోజీరావు గారూ.. మా మీద ఇంకా ఎక్కువ విషాన్ని కక్కండి. మీ పత్రిక నిండా మా పార్టీ మీద బురద చల్లండి. అవాస్తవాలు, అబద్ధాలకు అందమైన రంగులు అద్దుకోండి. మీరు ఊదే తాటాకు బూరకు పాంచజన్యం అని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకోండి. మే 16 ఎంతో దూరంలో లేదు. ఆ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీ మొహానికి అడ్డుపెట్టుకోవటానికి మీ పేపరు ఏమన్నా ఉపయోగపడుతుందేమో ఆలోచించుకోండి. మీ పిచ్చే మీకు ఆనందం కాబట్టి ఆ ఆనందాన్ని మీకు దూరం చేసే ఉద్దేశం మాకు లేదు.

Back to Top