వైయ‌స్ జగన్‌ హత్యకు కుట్ర.. బాబే ఏ– వన్‌!స్వతంత్ర సంస్థలు దర్యాప్తు జరపాలి.. వైయ‌స్ఆర్‌ సీపీ డిమాండ్‌
ఏపీ సీఎం, డీజీపీలపై నమ్మకం లేదు
సూత్రధారులెవరో తేలాలంటే నిష్పాక్షిక విచారణ జరగాల్సిందే..
సీఎం చెప్పినట్లు ఆడుతున్న డీజీపీ ఠాకూర్‌ ఏ2
ఉన్మాదిలా మాట్లాడుతున్న చంద్రబాబు
ప్రతిపక్షనేతను వాడూవీడూ అంటారా..
కేంద్ర దర్యాప్తు సంస్థలచేత విచారణ జరిపించాలి

 

 అమరావతి: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హత్యకు సాక్షాత్తూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే ఒక పక్కా ప్రణాళికతో కుట్ర పన్నిందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కుట్రలో ప్రధాన నిందితుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడైతే... డీజీపీ ఠాకూర్‌ 2వ నిందితుడని ఆ పార్టీ ఆరోపించింది. జగన్‌పై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వల్ల తమ పార్టీ శ్రేణులకు తగిలిన షాక్‌ కన్నా... ఆ ఘటన తరువాత డీజీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘‘జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక అసలు సూత్రధారి చంద్రబాబే అయినపుడు ఆయన ఆదేశించిన విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందని మేమెలా విశ్వసిస్తాం?’’అని వారు ప్రభుత్వం తీరుపై విరుచుకుపడుతున్నారు. సంఘటన జరిగిన గంటలోపే ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీపైకి నెట్టేసి డీజీపీ చేతులు దులిపేసుకోవడం, ఆ తరువాత చంద్రబాబునాయుడు వెకిలిగా మాట్లాడ్డం చూస్తే ఇంకా వీరి విచారణను ఎలా నమ్మాలి? అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాము కేంద్ర దర్యాప్తు సంస్థలచేత నిష్పాక్షిక విచారణను కోరుతున్నామని పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

 అంత ఉన్మాదమా... 
రాష్ట్ర డీజీపీ ఠాకూర్‌ ముఖ్యమంత్రి చెబుతున్నట్లు ఆడుతున్నాడని, ముఖ్యమంత్రి వ్యవహారశైలి ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని, ఆయన ఉన్మాదంతో మాట్లాడుతున్నారని పలువురు పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అసలు ప్రతిపక్ష నేతను ఉద్దేశించి విలేకరుల ముందరే ఆయన వాడిన పదజాలం చూస్తే ముఖ్యమంత్రికి ఎంత అక్కసు ఉందో... కడుపులో జగన్‌పై ఎంతటి విషం దాచుకుని ఉన్నారో అర్థం అవుతోందని వారు ధ్వజమెత్తారు. 

ఈ ఉదంతంలో చంద్రబాబు ఓ ముఖ్యమంత్రి గా ప్రతిపక్ష నేత పట్ల ప్రదర్శించాల్సిన కనీస మర్యాదను గాని, సంప్రదాయాన్ని గాని పాటించలేదని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ‘వాడు, వీడు’అని ప్రతిపక్ష నేతను ఉద్దేశించి మాట్లాడ్డం చూస్తే చంద్రబాబుకు ఏ కోశానా మానవత్వం అనేదే లేదని, ఆయన మొహంలో క్రూరత్వమే కనపడుతోందని దుయ్యబట్టారు. విమానాశ్రయంలోకి అసలు కత్తి ఎలా వచ్చిందనే ప్రశ్నను పక్కకు నెట్టేసి చంద్రబాబు హేళనగా మాట్లాడ్డం చూస్తే ఇక ఈ ప్రభుత్వం నియమించే విచారణ ఎలా సాగుతుందో చెప్పకనే చెబుతోందన్నారు.  
 
పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తారని ఆశించాం.. 
ఈ సంఘటన జరిగినపుడు ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందని, వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని తొలుత ఆశించామని, కానీ ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంపై ఏ మాత్రం సానుభూతి లేకుండా అదేదో డ్రామా కింద అధికారపక్షం కొట్టి పారేయడం తీవ్ర ఆక్షేపణీయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఉదంతంపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం విచారణను ప్రతిపక్ష నేతతో పాటు పార్టీ నేతలు కూడా నిరాకరింనారు.

సిట్‌ బృందాన్ని వెనక్కి పంపారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం అధిపతి అయిన డీజీపీ ఒక వైపు, ముఖ్యమంత్రి మరోవైపు ఈ సంఘటనపై తేలికగా, హేళన పూరితంగా మాట్లాడ్డం చూసిన తరువాత పార్టీ శ్రేణులు టీడీపీ ప్రభుత్వ పాలనలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదనే అభిప్రాయానికి వచ్చాయి. నిందితుడు శ్రీనివాస్‌ను జగన్‌ ఫ్యాన్‌ (అభిమాని)గా చెప్పడం, పబ్లిసిటీ కోసమే ఈ సంఘటనకు పాల్పడ్డాడని నిర్థారించడం, చంద్రబాబు కూడా అదే పనిగా జగన్‌పైనే నిందలు వేస్తూ మాట్లాడ్డం చూస్తుంటే.. ప్రభుత్వమే జగన్‌ హత్యకు కుట్ర పన్నిందన్న అనుమానాలు బలపడుతున్నాయని పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్‌ యజమానిని విచారించాలని తాము ఎంత డిమాండ్‌ చేస్తున్నా పోలీసులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారని వారు ప్రశ్నించారు.   
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top