తిరుగుబాటుతో మొదలై.. పోరుబాటలో పయనం


– వైయస్‌ఆర్‌సీపీ ఏడేళ్ల అలుపెరుగని పోరాటం 
– అన్ని పక్షాల తరఫున, అన్ని వర్గాలతో ప్రజా పోరు
– వైయస్‌ఆర్‌ సంక్షేమ పథకాల అమలు కోసం పట్టు 
– ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా నిలిపిన అనితర సాధ్యుడు 

ఢిల్లీ పెద్దల అహంకారాన్ని సవాల్‌ చేస్తూ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, విలువలు, విశ్వసనీయత నినాదాలతో పుట్టిన పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. మార్చి 12, 2011న పురుడుపోసుకుని జననేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ఏడేళ్లు అవిశ్రాంత పోరాటం సాగిస్తూనే ఉంది. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచే ఎన్నో ఆటుపోట్లు, ఒడిదొడుకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో వైయస్‌ జగన్‌ ముందుకుసాగుతున్నారు. కేసులతో బెదిరిస్తారని తెలిసినా వెనకడుగు వేయలేదు.. అధికారం కోసం పార్టీలన్నీ కుమ్మక్కు అవుతున్నారని తెలిసినా ఒంటరిగానే 2014 ఎన్నిలకను ధైర్యంగా ఎదుర్కొన్నారు. కుయుక్తులతో టీడీపీ అధికారంలోకి వచ్చినా  భారీ ఓటింగ్‌తో ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకి వెన్నంటి నిలిచారు. అధికారానికి దూరమయ్యారేకానీ.. ప్రజలకు దూరం కాలేదు. 
మాటల్లో స్పష్టత, నిర్ణయాల్లో ధృఢత్వం
పార్టీ ఏర్పాటైన నాటి నుంచి ప్రజా సమస్యలపై వైయస్‌ జగన్‌ చూపించిన తెగువ అసామాన్యం. నిర్ణయాల్లో ధృఢత్వం, మాటల్లో స్పష్టత ఉన్న నాయకుడికి.. మాటిచ్చిన తర్వాత కట్టుబడి నిజాయతీపరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా.. రాజకీయ అవసరాలను పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలో దూకుడుగానే వ్యవహరిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ద్వంద్వ వైఖరి ప్రదర్శించినా.. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం సమైక్యాంధ్ర నినాదాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. చివరి వరకు దానికోసమే పోరాడారు. ప్రత్యేక పరిస్థితుల్లో అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోయినా ఏమాత్రం అసహనం ప్రదర్శించలేదు సరికదా.. మునుపటి మరింత పరిణతి సాధించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీకి మద్ధతు ఇస్తున్నానని స్పష్టంగా చెప్పారు. ఒకవైపు ప్రధాని వస్తున్నాడని తెలిసినా అమరావతి రాజధాని నిర్మాణానికి దూరంగా ఉన్నారు.. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న అవినీతి సేద్యానికి హాజరుకాబోనంటూ ధైర్యంగా ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతిని అనంత  కాలంలో బట్టబయలు చేశారు. స్విస్‌ ఛాలెంజ్, సచివాలయం, అసెంబ్లీ తాత్కాలిక నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా ప్రజల దృష్టికి తెచ్చారు. 
నిరంతరం పోరాటాలు
పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు నిత్యం పోరాటాలతో ప్రజల్లో ఉన్న పార్టీ వైయస్‌ఆర్‌సీపీ. ఢిల్లీ పెద్దల అహంకారాన్ని సవాల్‌ చేస్తూ పార్టీ ఏర్పాటు చేసుకున్న వైయస్‌ జగన్‌ అడుగడుగునా ప్రజల మద్ధతుతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధన కోసం, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు నిర్వీర్యం కావడంపై ప్రభుత్వాలపై సమైక్య రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా పోరాడుతూనే ఉన్నారు. రైతుల ఆత్మహత్యలపై, మద్ధతు ధర కల్పించాలని నిరాహార దీక్షలు, రైతు భరోసా యాత్రలు చేశారు. డ్వాక్రా మహిళల కోసం దీక్షలు, విద్యార్థుల కోసం ఫీజు పోరు.. సాగుతాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం పోరాటాలు చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పించాలని, ఉపాధి కరువై పక్క రాష్ట్రాలకు వలసపోతున్న రైతుల బాధలను తీర్చాలని.. 2013 చట్టం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వంపై దండెత్తారు. పోలవరం ముంపు గ్రామాలు, వంశధార నిర్వాసిత రైతుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. 

ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా ఉంచారు..
ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజేపీని.. కిమ్మనకుండా అధికారం చెలాయిస్తున్న టీడీపీని కలిపి మొహమాటం లేకుండా నిలదీస్తూనే ఉన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని చట్ట సభల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. ప్రత్యేక హోదా నినాదం సజీవంగా ఉందంటే ముమ్మాటికీ అది వైయస్‌ జగన్‌ పోరాట ఫలితమే అన్నది తెలుగు ప్రజలు ఎవరడిగినా చెబుతారు.  ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్త బంద్‌లు నిర్వహించారు. యువభేరిల పేరుతో ప్రత్యేక హోదాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఆమోదం తెలిపినా.. కేంద్రం ఇవ్వడం కుదరదని సాంకేతిక అంశాలను కారణంగా చెబుతున్నా.. ఎందుకు కుదరదంటూ అదే సాంకేతిక అంశాలను ప్రస్తావించి నోరెత్తనీయకుండా చేశారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా..? ప్రత్యేక హోదాతో ఏమొస్తుందని మాట్లాడిన చంద్రబాబుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అనిపించిన పోరాటయోధుడు  వైయస్‌ జగన్‌. ప్రజల్లో ప్రత్యేక హోదాపై వస్తున్న తిరుగుబాటు చూసి కేంద్రం నుంచి టీడీపీ నాయకులు బయటకొచ్చి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించారు. 

తాజా ఫోటోలు

Back to Top