నడుస్తున్న చరిత్ర

 

వై.ఎస్‌.జగన్‌ ప్రజా సంకల్పయాత్రకు ఏడాది

జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర

అరుదైన ఘటనలకు వేదికైన విజయనగరం జిల్లా

3000 కి.మీ., 3100 కి.మీ., 3200 కి.మీ., పాదయాత్ర జిల్లాలోనే పూర్తి

ఇప్పటి వరకూ జిల్లాలో 213.3 కిలోమీటర్లు పూర్తి

26 రోజుల పాటు సాగిన మహాయజ్ఞం

ఆ సంకల్పానికి ఏడాది పూర్తవుతోంది. ఆ అడుగు వెంట వేలాది అడుగులు అనుసరించాయి. లక్షలాది మంది ఆశీస్సులు లభించాయి. ప్రజాకంటక పాలనను అంతమొందించేందుకు... బడుగుల సంక్షేమానికి... భవిష్యత్తులో చేపట్టాల్సిన సంస్కరణలకు... అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జననీరాజనం లభించింది. అభిమానుల ఆశీస్సులే ఆలంబనగా... జనం ఇచ్చిన ఉత్సాహమే ఊపిరిగా ఇప్పటికే 3,200 కిలోమీటర్లు దాటింది. ఈ సుదూర ప్రయాణంలో పలు చారిత్రక ఘటనలకు విజయనగరం జిల్లా వేదికగా నిలిచింది. జిల్లాలో అడుగుపెడుతూనే 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఇంతలోనే కుట్రలు ఊపిరి పోసుకున్నాయి. జననేతను అంతమొందించేందుకు పథక రచన సాగింది. కానీ అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కోలుకుంటున్న ఆయన మళ్లీ జిల్లాలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.

 విజయనగరం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడవడానికి, ప్రజాక్షేత్రంలోనే ఉండి జనం సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి మంగళవారానికి ఏడాది పూర్తవుతోంది. నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి దివ్య ఆశీస్సులు అందుకుని తొలి అడుగువేసిన జగన్‌ 11 జిల్లాల్లో 168 రోజులపాటు పాదయాత్ర చేసి 12వ జిల్లా అయిన విజయనగరంలో 169వ రోజు అడుగుపెట్టారు. సెప్టెంబర్‌ 24వ తేదీ ఉదయం 10 గంటలకుఎస్‌ కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం, చింతలపాలెంలో ప్రవేశించిన జననేతకు విజయనగరం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్న విరామ సమయానికి దేశపాత్రునిపాలెం చేరుకున్న జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఆ చారిత్రక ఘట్టానికి చిహ్నంగా ఆ రోజు దేశపాత్రునిపాలెంలో స్తూపాన్ని జగన్‌ ఆవిష్కరించారు.అదే రోజు కొత్తవలసలో భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించి తొలిరోజే జిల్లాలో పెను ప్రభంజనాన్ని సృష్టించారు. ఇంకా గుర్ల మండలం ఆనందపురం వద్ద 3,100 కిలోమీటర్లు, సాలూరు మండలం బాగుపేటవద్ద 3,200 కిలోమీటర్ల దూరాన్ని సైతం జిల్లాలోనే అధిగమించారు.

ప్రతిసభా ప్రభంజనమే...
జిల్లాలో నిర్వహించిన ప్రతిసభా ప్రభంజనమే అయింది. అక్టోబర్‌ 1వ తేదీన విజయనగరం మూడు లాంతర్ల వద్ద బహిరంగలో విజయనగరం శాసన సభ నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామిని ప్రకటించారు. అక్కడి నుంచి నెల్లిమర్ల నియోజకవర్గానికి చేరుకుని అక్టోబర్‌ 3వ తేదీన అక్కడి మొయిద జంక్షన్‌లో బహిరంగ సభ నిర్వహించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో అడుగిడిన జననేత అక్కడి గుర్ల జంక్షన్‌లో అక్టోబర్‌ 7వ తేదీన జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గజపతినగరంలో అక్టోబర్‌ 10వ తేదీన అన్నదాతలకు వైఎస్‌ జగన్‌ వరాల జల్లు కురిపించారు. బొబ్బిలిలో అడుగుపెట్టిన జగన్‌ అక్కడ అక్టోబర్‌ 17వ తేదీన జరిగిన బహిరంగ సభలో బొబ్బిలి రాజులను చీల్చి చండాడారు. తాండ్రపాపారాయుడి పౌరుషాన్ని గుర్తుచేసి పదవుల కోసం పార్టీమారిన బొబ్బిలి రాజు, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావుపై నిప్పులు చెరిగారు. అక్కడి నుంచి సాలూరు నియోజకవర్గం చేరుకున్న జగన్‌కు అక్టోబర్‌ 22వ తేదీన అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 

అడుగడుగునా నీరాజనం
జిల్లాలో జననేతకు అడుగడుగునా జననీరాజనం లభించిం ది. ఆయన పాదయాత్ర ఎస్‌ కోట నియోజకవర్గం లో మొదలై సాలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టి 213.3 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పార్వతీపు రం, కురుపాం నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి చేసుకుని శ్రీకా కుళం జిల్లాకు వెళ్లాల్సి ఉంది. పాదయాత్రలో అనేక వర్గాల ప్రజలను నేరుగా కలుస్తున్నారు. కార్మికులు, కర్షకులు, కాం ట్రాక్టు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు, కళాకారులు, చేనేత కార్మికులు, వృత్తికళాకారులు ఇలా లక్షలాది మంది సమస్యలు తెలుసుకున్నారు. వారి కన్నీళ్లను తుడుస్తున్నారు. పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, మరో సీనియర్‌నేత పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జిశ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంట్‌ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు జగన్‌ పాదయాత్రను జిల్లాలో విజయవంతం చేయడానికి శ్రేణులను సమాయత్తం చేస్తూ జగన్‌ వెంట నడుస్తున్నారు.

జననేతపై దూసిన కత్తి
అన్నా అన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు సాగుతున్న జగన్‌ అక్టోబర్‌ 25వ తేదీన 294వ రోజు మక్కు వ మండలంలో ఉదయం పాదయాత్ర చేసి విశాఖ విమానాశ్రయానికి బయలుదేరారు. ఎయిర్‌పోర్టు, వీఐపీ లాంజ్‌లో వేచి ఉన్న జననేతపై శ్రీనివాసరావు అనే దుర్మార్గుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ జగన్‌కు హైదరాబాద్‌ వెళ్లిన వెంటనే వైద్యులు తొమ్మిది కుట్లు వేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొద్ది రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించారు. త్వరలో జిల్లాలో పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆయన సంకల్పం గొప్ప ది. అలుపెరని పాదయాత్ర చేస్తున్న జగనన్న దీపావళి అనంతరం కారు చీకట్లను చీల్చుకుంటూ వేకువ సూరీడై  మన ముందుకు వస్తున్నారు. జనం కన్నీళ్లు తుడిచే వెళతారు.

రాజన్నబిడ్డపై హత్యాయత్నమా..
జననేత జగన్‌పై దాడి జరిగిందని తెలిసి చాలా బాధపడ్డాం. ఈ మధ్యనే ఆయన్ను కలిసాం. చిన్నవాడైనా సమస్యలను చాలా విపులంగా ఓపిగ్గా అ డిగి తెలుసుకుని మన ప్రభుత్వం వస్తే పరిష్కరిద్దాం అన్నారు. ఆయన మాటలే మాకు గుర్తుకు వచ్చాయి. అది చాలా దారుణమైన సంఘటన. మానవత్వం ఉన్నవారంతా దీనిని ఖండించాలి. దీనిపై సమగ్ర విచారణ జరపాలి.
– అడబాల కృష్ణారావు, మెట్టవలస, బొబ్బిలి మండలం

ఆయన అండగా జనం
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న జననేతపై హత్యాయత్నం జరిగిందని తెలిసి తల్లడిల్లిపోయాం. పెద్దలహస్తం లేకుండా ఓ సాధారణ వ్యక్తి అంతటి సాహసం చేయలేదు. ఆ వెనకనున్నవారెవరో బయటకు రావాలి. బొబ్బిలిలో నిర్వహించిన యాత్రలో ఎన్‌సీఎస్‌ పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు, చెరకు రైతుల సమస్యలు తీర్చాలని వినతి పత్రాన్ని సమర్పించాం. మాతో ఆయన ఎంతో చక్కగా మాట్లాడారు. ఓపికగా మా సమస్యలు విన్నారు. వెంటనే ఆయన కోలుకుని మా ప్రాంతానికి రావాలని కోరుకుంటున్నాం.– ఆర్‌.వి.కిశోర్, ఎన్‌సీఎస్‌ కార్మిక సంఘం నాయకుడు

జగనన్నపై అఘాయిత్యంపై తట్టుకోలేకపోయా
జగనన్నపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిందని తెలిసి ఎంతో బాధపడ్డాను. గతనెల 25వ తేదీ అన్నను కలిసి, మన ప్రభుత్వం వచ్చినవెంటనే మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కోరాను. అందుకు అలాగే చెల్లమ్మా అంటూ ఎంతో ఆత్మీయంగా హామీ ఇచ్చారు. అలాంటి మంచి వ్యక్తిపై ఇలాంటి అఘాయిత్యమా...– నిర్మల, మక్కువ

Back to Top