ఇరిగేషన్ అంటే బాబుకు ఇరిటేషన్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు చాలా ఇరిటేషన్లు ఉన్నాయి. అందులో ఇరిగేషన్ కూడా ఒకటి. వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడుగారు గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో సాగునీటి రంగంపై శీతకన్ను వేశారు. వ్యవసాయాధారిత దేశమైన భారత్‌లో వ్యవసాయం బాగా జరిగి రైతు సుఖ సంతోషాలతో ఉండాలంటే  సాగునీటి ప్రాజెక్టులు ఎంత ముఖ్యమో వేరే చెప్పనక్కరలేదు. కానీ ప్రాజెక్టులంటే ఎందుకో చంద్రబాబుకు గిట్టేది కాదు. తొమ్మిదేళ్ల పాలనా కాలంలో సాగునీటి ప్రాజెక్టులకు ఆయన కేటాయించిన అరకొర నిధులు ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తాయి. ఇపుడు తాను మారాను అని ఆయన చెబుతున్నా తాజా బడ్జెట్‌లోనూ ప్రాధాన్యతా ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపులు చూస్తే వ్యవసాయాన్ని ఆయన ఎంత చిన్నచూపు చూస్తున్నారో అర్ధమౌతుంది. వివిధ ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ఆయన చేసిన కేటాయింపులను ఓ మారు పరికిద్దాం...
  • విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1.84 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటికి ఉపకరించే తోటపల్లి బ్యారేజ్‌కి బాబు తొమ్మిదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రు.3 కోట్లు. సవరించిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు మరో రు.774.9 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ బాబు గారు దీనికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రు.162 కోట్లు మాత్రమే కేటాయించారు.
  • దేశంలోనే అత్యంత కరువుపీడిత ప్రాంతమైన అనంతపురంతో పాటు రాయలసీమ అభివృద్ధికీ దోహదపడే హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అంచనా వ్యయం రు.6,850 కోట్లు. గత తొమ్మిదేళ్లలో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు కేటాయించింది రు.13 కోట్లు మాత్రమే. హంద్రీనీవా ప్రాజెక్టు పనులన్నీ పూర్తి కావడానికి రు.1,100 కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో బాబుగారు కేటాయించింది రు.200 కోట్లు. అవి పాతబకాయిలకు సరిపోతాయట. మరి ప్రాజెక్టు పనుల మాటేమిటి?
  • రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఉపకరించే మరో ముఖ్యమైన ప్రాజెక్టు గాలేరు-నగరి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రు.7,216 కోట్లు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే రాయలసీమ జిల్లాల్లో దాదాపు 3 లక్షల ఎకరాలకు నీరివ్వవచ్చు. బాబు తొమ్మిదేళ్ళ హయాంలో ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసింది రూ 17 కోట్లే. ఈ ఏడాది బడ్జెట్‌లో బాబుగారు కేటాయించింది రు.169.58 కోట్లు. మరి ప్రాజెక్టు పనులు సాగేదెలా?
  • ఉత్తరకోస్తాకు ఉపయోగపడే వంశధార ప్రాజెక్టు రెండు దశలకు కలిపి అంచనా వ్యయం దాదాపు రు.1,150 కోట్లు. తొమ్మిదేళ్లలో బాబు ఖర్చు చేసింది రు.44.26 కోట్లు. ఈ ఏడాది బడ్జెట్‌లో బాబు కేటాయించింది రు.63 కోట్లు.
  • ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి ఉపకరించే వెలిగొండ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రు.4,785 కోట్లు. తొమ్మిదేళ్లలో చంద్రబాబు కేటాయించింది రు.13 కోట్లు. కానీ శిలాఫలకం వేయడానికి రు.10 లక్షలు మాత్రం ఖర్చు చేసి ఊరుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో చంద్రబాబు కేటాయించింది రు. 153.89 కోట్లు. ఇంకా 6,200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.

తాజా వీడియోలు

Back to Top