– తెలుగు తమ్ముళ్ల నుంచి అడ్డగోలు విద్యుత్ కొనుగోలు– రూ. 23,280 కోట్లు దోచిపెట్టేందుకు చంద్రబాబు ఆదేశాలు– అవసరం లేకున్నా 600 యూనిట్లకు 12 ఏళ్లపాటు ఒప్పందం– మార్కెట్లో యూనిట్ రూ.2 కే లభిస్తున్నా.. రూ.4.43లకు కొనుగోలు – అవసరమే లేదని ఎస్‌ఎల్‌డీసీ వారించినా పట్టించుకోని సీఎం ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు డబ్బిచ్చిన వారికి అయాచితంగా ప్రయోజనం చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది. తెలంగాణకు చెందిన టీడీపీ నేత, చంద్రబాబుకు బినామీగా ప్రసిద్ధిగాంచిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరావుకు చెందిన రెండు విద్యుత్ ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. నెల్లూరులో ఉన్న సింహపురి, మీనాక్షి సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 12 ఏళ్లపాటు 600 మెగావాట్లు విద్యుత్ కొనేందుకు పీపీఏ(విద్యుత్ కొనుగోలు ఒప్పందం) చేసుకున్నారు. వాస్తవానికి ఈ తతంగం గత నెల రోజులుగా నడుస్తోంది. అయితే, సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) దీనిపై తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏపీలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, కొత్తగా ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇదే విషయాన్ని ఏపీ ట్రాన్స్‌కో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబే తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీనివల్ల డిస్కమ్‌లపై రూ. వేల కోట్ల భారం పడనుంది. ఎక్కువ ధర... దీర్ఘకాలంఇప్పుడు జరిగిన పీపీఏలు రూ. వేల కోట్లు శాతం ఖరీదైనవి. 600 మెగావాట్ల విద్యుత్‌ను 85శాతం పీఎల్‌ఎఫ్‌తో తీసుకోవాలనేది ఒప్పందం. అంటే రోజుకు 12 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొనుగోలు చేస్తారు. దీనికి యూనిట్‌కు రూ.4.43 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ. 5.31 కోట్లు. ఏడాదికి రూ. 1940 కోట్లు. పన్నెండేళ్ల పాటు తీసుకునే ఈ విద్యుత్‌కు రూ. 23,380 కోట్లు ప్రజల సొమ్ము నామా సంస్థలకు దోచిపెడుతున్నారు. ఈ రెండు విద్యుత్ ప్లాంట్లు కూడా విదేశీ బొగ్గుతో నడిచేవి కావడం మరో విశేషం. విదేశీ బొగ్గు దిగుమతిలో తేడాలొస్తే చర వ్యయం పెరిగే వీలు కూడా లేకపోలేదు. ఇప్పటికే ఏపీ డిస్కమ్‌లు రూ. 4వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. వీటిని పూడ్చుకోవడానికి కొత్తగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు నిలివేయాలని కేంద్ర ఇంధనశాఖ స్పష్టం చేసింది. జెన్‌కో ఉత్పత్తి నిలిపేసి మరీ..డిమాండ్ లేదంటూ ఒక పక్క జెన్‌కో ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. 1600 మెగా వాట్ల సామర్థ్యం గల కృష్ణపట్నం థర్మల్‌ప్లాంట్‌లో గత రెండు నెలలుగా ఒక యూనిట్‌లో తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. కడపలోని ఆర్టీపీలో ప్రతిరోజూ మూడు యూనిట్లను బ్యాకింగ్ డౌన్ చేస్తున్నారు. డిమాండే లేని పరిస్థితి ఒకపక్క, మిగులు విద్యుత్‌ను అమ్మలేని పరిస్థితి మరోపక్క ఉంటే.. నామా సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక దోచిపెట్టడం తప్ప మరోటి లేదని అధికారులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.2కే లభిస్తుంది. అవసరమైతే జెన్‌కో థర్మల్ ప్లాంట్లను కూడా తగ్గించి ఈ విద్యుత్‌ను తీసుకోవాలని అధికారులు సర్కారును ప్రతిపాదించారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తనవారి ప్రయోజనం కోసం విద్యుత్ సంస్థలను నిండా ముంచేస్తుంది.