కొమ్మాలపాటి కుచ్చుటోపీ!

• కొనుగోలు 42 ఎకరాలు
• చెల్లించినది రూ. 1.26 కోట్లు
• ప్రస్తుత విలువ: రూ. 210 కోట్లు
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి.. టీడీపీ ప్రజా ప్రతినిధుల రౌడీయిజానికి ఇదో తార్కాణం. ఏడేళ్ల కిందట మంగళగిరికి సమీపంలో నెలసరి కంతులపై మూడువేల మందికి విక్రయించిన భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నిరాకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆయన వినియోగదారులకు టోపీ పెట్టారు. ప్లాట్లు ఇచ్చేది లేదంటూ బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అధినేతపై ఒత్తిడి తెచ్చి రూ.210 కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని భూసమీకరణ నుంచి తప్పించారు. ప్రతిఫలంగా చినబాబుకు భారీ ఎత్తున వాటాలు ముట్టజెప్పారు.
 
సభ్యులకు కుచ్చుటోపీ
గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లను వేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లను విక్రయిస్తూ వస్తున్నారు. అదే సంస్థ యర్రబాలెంలో అమరావతి టౌన్‌షిప్‌ను ఆనుకుని సర్వే నంబర్ 485 నుంచి 500 వరకు 42 ఎకరాలు కొనుగోలు చేసింది.  సభ్యుడిగా చేరేందుకే రూ.25 వేల వంతున చెల్లించి, తదుపరి వాయిదాలు చెల్లించారు. 2009లో ప్లాట్ల విక్రయాలు ప్రారంభించిన సంస్థ 2012 నాటికే సభ్యుల నుంచి పూర్తి వాయిదాలను వసూలు చేసింది. ఒక్కనెల వాయిదా కట్టకపోయినా డిఫాల్టరుగా మార్చి మెజారిటీ సభ్యులకు శఠగోపం పెట్టారు. పూర్తిగా డబ్బు కట్టిన వారికి కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇంతలో యర్రబాలెం గ్రామం సైతం భూ సమీకరణలోకి చేరడంతో వెంచర్‌కు అనుమతులు నిలిచిపోయాయి. దీంతో పూర్తిగా నగదు చెల్లించిన సభ్యులు సంస్థను సంప్రదించగా అధికార పార్టీ అండ ఉండడంతో సభ్యులకు నయానోభయానో విషయం బయటకు పొక్కకుండా కొంతమందికి వేరే వెంచర్‌లో ప్లాట్లను కేటాయిస్తామంటూ నమ్మబలికి.. ఆ తర్వాత మొండిచేయి చూపారు. ఈ విధంగా ఒక్క యర్రబాలెం వెంచర్‌లోనే సంస్థ సుమారు రూ.15 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిందని తెలిసింది.
 
సమీకరణ నుంచి తప్పించేశారు..
యర్రబాలెం గ్రామంలో అధిక శాతం మంది రైతులను బెదిరించి భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కానీ..    అభినందన రియల్ ఎస్టేట్ వెంచర్‌కు చెందిన 42 ఎకరాల భూములను భూ సమీకరణకు ఇవ్వకపోగా.. డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌లో సైతం వదిలేసింది.  చంద్రబాబునాయుడు ఒత్తిడే ఇందుకు కారణమని  అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ భూములకు అన్ని మినహాయింపులు ఇచ్చి.. రాజధానిలో మెగా సిటీ రూపొందించడానికి ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. తుది మాస్టర్ ప్లాన్ విడుదలైన  వెంటనే రాజధానిలో తొలి ప్రైవేటు రియల్ మెగా సిటీని ప్రకటించేందుకు సంస్థ సిద్ధమవుతుండగా, అందుకు సీఆర్‌డీఏ నుంచి అనుమతులు ఇప్పించేందుకు చినబాబు చక్రం తిప్పుతున్నారు. ఆ మేరకు ఆ వెంచర్‌లో చినబాబు వాటాలు పొందినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇదే అంశంపై సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ లలితకుమారి వివరణ కోరగా... 485 నుంచి 500 సర్వే నంబర్ల వరకు 42 ఎకరాలు భూసమీకరణలోనే ఉన్నాయన్నారు. అయితే ఇప్పటివరకు ఆ భూములను సమీకరణకు ఇవ్వలేదన్న అంశాన్ని ఉన్నతాధికారులకు తెలిపామంటూ దాటవేశారు. ఇదే విషయంపై సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు.

తాజా వీడియోలు

Back to Top