భూములు మింగేసి ఘీం కారాలా..?

– అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొన్నట్టు ఒప్పుకున్న ప్రత్తిపాటి 
– కాదని నిరూపించుకోలేక ప్రతిపక్షంపై విసుర్లు
– రాజ్యాంగంలో లేని వ్యవహారాలతో కాలక్షేపం
– అసహనంతో సాక్షి మీడియాపై ఆంక్షలకు వ్యూహం

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునే సమస్య కన్నా ప్రతిపక్ష నాయకుడిని ఎలా ఇరికించాలి.. ఎలా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప చంద్రబాబుకు మరో ఇతర వ్యాపకం ఉన్నట్టు లేదు. ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలకు నిద్ర లేస్తే వైయస్‌ జగన్‌ పేరు జపించకుండా రోజు గడవదు. అసెంబ్లీలో, బయటా అవే ఆరోపణలు. అధికారంలో ఉండి కూడా ఒక్కదాన్నీ నిరూపించరు. ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై విచారణ జరిపించుకోలేరు. నోరెత్తితే ప్రతిపక్ష నేత మీద, సాక్షి టీవీ .. సాక్షి పేపర్‌ మీద పడి ఏడవడం తప్ప ఈ మూడేళ్లలో ప్రజల మెప్పు పొందే ఏ ఒక్క పనీ చేయలేదు. 

కొన్నామని మంత్రి అంగీకరించాడు
ఈ రెండు రోజుల శాసనసభ తీరుతెన్నులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సభ ముగిసిన తర్వాత గమనిస్తే సమస్య కన్నా సవాళ్లు ప్రతిసవాళ్లే ముందుకొచ్చాయి. భూములు కొన్న మాట నిజమేనని, అమ్మిన దినకరన్‌ అగ్రిగోల్డ్‌లో డైరెక్టరేనని ప్రత్తిపాటి అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ సమస్య మొదలైందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెబుతున్నారు. హాయ్ లాండ్‌ భూములు వేలం వేయాలని మొదట కోరింది చంద్రబాబేనని ఆయనే చెబుతున్నారు. ఇవన్నీ నిజమైతే తన భార్య ఆ వివాదాస్పద సంస్థ డైరెక్టర్‌ దగ్గర భూములు కొంటుంటే వద్దని వారించాల్సిన  అవసరం లేదా? అలాటివి మంచిది కాదని చెప్పవలసిన బాధ్యత ప్రత్తిపాటి లేదా? ఇప్పటికైనా మందలించవలసిన ధర్మం చంద్రబాబుకు లేవా? వివిధ రకాలుగా మళ్లించబడిన భూమి వేల కోట్లు చేస్తుందనీ, 14 లక్షల మంది బాధితులకు కేవలం 1152 కోట్లు చెల్లిస్తే బతికిపోతారని ప్రతిపక్షనేత చేస్తున్న వాదనను ఎందుకు అంగీకరించడం లేదు? 

నిరూపించుకోవాల్సింది చంద్రబాబే..
ఆరోపణలు వస్తే తీవ్రంగా తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి. తప్పు జరగలేదని నిరూపించుకోవాల్సింది సంబంధిత మంత్రి. అది వదలిపెట్టి ప్రతిపక్ష నేతనూ మంత్రినీ ఒకే గాటిన కట్టి సవాలు చేయడం అర్థరహితం. అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో పత్తిపాటి పాత్ర ఉందా లేదా.. తప్పును తేల్చాస్సిన ముఖ్యమంత్రి ఇలా ఒక్కో కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి తన అధికారాన్ని అనుభవాన్ని ఉపయోగిస్తూ సభా సమయాన్ని పనికిమాలిన ఆరోపణలతో పక్కదారి పట్టిస్తున్నాడు. అగ్రిగోల్డ్‌తో మొదలు పెట్టి అమాత్యులు పత్తిపాటి పుల్లారావుపై ఆరోపణల చుట్టూ తిరిగి చివరకు సాక్షిలో వచ్చిన కథనాలపై చర్య వరకూ నడిచిన ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ వ్యవహారాలు చాలా జుగుబ్సాకరంగా వున్నాయి. ప్రతిపక్ష నేత జగన్‌ లేవనెత్తిన ఆరోపణలపై చిత్తశుద్ధి ఉంటే నిజం నిరూపించాలి. విచారణకు ఆదేశించి తాను, మంత్రి వర్గ సహచరులు నిప్పులమని నిరూపించుకోవాలి. అంతేతప్ప ఇలా మండిపోతుంటే చివరికి బూడిదయ్యేది వారే. 

నిజం నిరూపించలేక సాక్షి మీదకా..
ఆరోపణలు, ప్రత్యారోపణలతో పరస్పర రాజీనామాలను షరతులుగా పెట్టి చర్చ జరపడం శోచనీయం. న్యాయ విచారణకు సిద్ధమంటూనే నిజమని తేలకపోతే ప్రతిపక్ష నేత వైదొలగాలని షరతు పెట్టడం గతంలో ఎన్నడూ విన్నది కాదు. గతంలో రాజధాని భూములపై చర్చ సందర్భంలోనూ ఇదే ప్రహసనం నడిచింది. తర్వాత దాన్ని ఎప్పుడో స్పీకర్‌ వ్యాఖ్యలకు సంబంధించి సాక్షిలో వచ్చిన ప్రచురణలపైకి మళ్లించి చర్య తీసుకోవాలనడం, ఆ సమయంలో సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అసలు రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్చనే లేదని ఏవో భాష్యాలు చెప్పడం అంతా విచిత్రమే. 

ఆఖరుకి లోకేష్‌ కూడా చెప్పేవాడయ్యాడా..?
జనాల్లోకి వస్తే ఏం మాట్లాడతాడో తనకే అర్థం కాదు. విద్యార్థులు ప్రశ్నలేస్తే ఒక్కదానికీ సూటిగా సమాధానం చెప్పే ధైర్యం లేదు. ముఖ్యమంత్రి కొడుకునని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శినని దోచుకున్న పదవుల గురించి చెప్పడమే కానీ కనీసం ఎమ్మెల్యేగా గెలిచే సత్తా లేదు. అలాంటోడు ప్రతిపక్ష నాయకుడిని విమర్శిస్తున్నాడు. వైయస్‌ జగన్, కడప ఎంపీగా పనిచేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో గెలిచి నాయకుడన్పించుకున్నారు. మరి, నారా లోకేష్‌ చేసిందేమిటి.? ఎమ్మెల్యేగా గెలిచే ధైర్యం లేక, ఎమ్మెల్సీగా ఎంపికైన అసమర్థుడు.  

మూడేళ్లుగా వైయస్‌ జగన్‌ను విమర్శిస్తూనే ఉన్నారు..
అధికార తెలుగుదేశం పార్టీ, చట్ట సభల్లో గడచిన మూడేళ్లలో మాట్లాడిన మొత్తం రికార్డుల్ని తీస్తే, అందులో జగన్‌ మీద ఆరోపణల కోసం వెచ్చించిన సమయమే ఎక్కువగా కన్పిస్తుంటుంది. టీడీపీ శాసనసభ్యులంతా కలిసి, తమ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినదానికన్నా, చంద్రబాబు భజన చేసినదానికన్నా.. వైయస్‌ జగన్‌ని విమర్శించడానికే ఎక్కువ టైమ్‌ కేటాయించిన వైనం సుస్పష్టమవుతుంది. ఆ లెక్కన, చట్ట సభల్లో సమయం ఎలా దుర్వినియోగమవుతున్నట్టు.? ఎవరు దుర్వినియోగం చేస్తున్నట్టు.? వైయస్‌ జగన్‌ మీద నారా లోకేష్‌ చాలా సందర్భాల్లో చాలా చాలా ఆరోపణలు చేసేశారు. ఏదీ, ఎక్కడన్నా ఒక్క ఆరోపణకు సంబంధించి వాస్తవాల్ని వెల్లడించగలిగారా.? రాష్ట్రంలో ఏం జరిగినా అది వైయస్ జగన్ వల్లేనంటూ బాబుకు, మంత్రులకు బాగా అలవాటైపోయింది. ప్రజాసమస్యలపై చర్చను పక్కదారిపట్టిస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కుతూ సభా సంప్రదాయాలను మంటగల్పుతున్న  టీడీపీకి తగిన గుణపాఠం తప్పదని ప్రజలు హెచ్చరిస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top