తండ్రి లేని ఇంటిలా రాజన్న లేని పాలన

యడ్లపాడు(గుంటూరు):

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల మంగళవారం యడ్లపాడు మండలంలోని సొలసలో పంచాయతీ కార్యాలయం వద్ద రచ్చబండ నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై గళం విప్పారు. షర్మిల సైతం వారి సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేశారు. పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి? తాగునీరు సరిగ్గా అందుతోందా? రోడ్లు ఎలా ఉన్నాయి? కరెంటు రోజు మొత్తంలో ఎన్ని గంటలు ఉంటుంది? కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి? అనే విషయాలను ప్రస్తావించి వారి నుంచి సమాధానాలు రాబట్టారు.

ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు విన్నవించారిలా..
తాగునీరందటం లేదని బాపతు రమాదేవి తెలిపింది. విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగి సాగు చేయటం కష్టంగా ఉందని షర్మిలకు వివరించింది.  కరెంటు కోతలతో చదవడం చాలా కష్టంగా ఉందని ఇంటర్ చదువుతున్న సీహెచ్ దుర్గ చెప్పింది. పరీక్షల సమయంలో విద్యుత్తు కోతలు ఏమిటని వాపోయింది.

తమ గ్రామంలో మురుగు కాల్వలు లేవనీ.. పల్లెల్లో కరెంటు అసలు ఉండడం లేదనీ గ్రామానికి చెందిన సుంగిరెడ్డి వెంకాయమ్మ తెలిపింది. వంద రూపాయల కూలీతో బతుకు దుర్భరంగా మారిందని గుండ్లకుంట స్వప్న వివరించింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో తాము బాగా బతికామనీ.. కానీ నేటి పాలన రాక్షస పాలనలా ఉందనీ బి. శ్రావణి తెలిపింది. శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ఆకాంక్షించింది.

మహానేత లేని పాలన తండ్రి లేని ఇల్లులా ఉందని గ్రామానికి చెందిన సామ్రాజ్యం వాపోయింది. కుటుంబ పెద్ద లేకపోతే ఎంతగా అల్లాడిపోతామో అలాగే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ఈ సందర్భంగా మహానేత తనయ శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. ప్రతి పల్లె సమస్యలతో నిండిపోయిందన్నారు. మహిళలు చెప్పినట్లు కుటుంబ పెద్ద లేని ఇల్లులా రాష్ట్రం అతలాకుతలం అవుతోందని ఆవేదన చెందారు. రూ.100 కూలీతో పెరిగిన ఖర్చుతో ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో సామాన్యులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలకు కారణం సీఎం నిర్లక్ష్య వైఖరే కారణమని తెలిపారు. ఒక్క రూపాయి పన్ను పెంచకుండానే వైఎస్ అనేక పథకాలు అమలు చేశారని తెలిపారు. చంద్రబాబునాయడు పరిపాలన కాలంలో రాష్ట్రం కరువు కాటకాలతో నిండిపోయిందన్నారు.

ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వం కుమ్మకై జగనన్నను జైలులో పెట్టారని తెలిపారు. అధర్మానికి ఆయుష్షు తక్కువన్నారు. త్వరలోనే జగన్ జైలునుంచి బయటకు వస్తాడన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, గుంటూరు, కృష్ణా జిల్లా పార్టీ సమన్వయకర్త ఆర్కే, పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, మహిళా విభాగ కన్వీనర్ డి.వెంకటలక్ష్మీరాజ్యం, బీసీ విభాగం కన్వీనర్ రేవళ్ల రేవతి, మండల కన్వీనర్ చల్లా యజ్ఞేశ్వరరెడ్డి,తేళ్ల సుబ్బారావు, మాజీ జెడ్పీటీసీ బాస్కరసురేష్, మాజీ ఎంపీపీ వీరారెడ్డి, మాజీ సొసైటీ డెరైక్టర్ కల్లూరి విజయ్‌కుమార్, మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

Back to Top