షర్మిల వెంట జనవాహిని...

ఆదోని

15 నవంబర్ 2012 : 'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా కర్నూలు జిల్లాలో సాగుతున్న షర్మిల పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. షర్మిల యాత్రకు సంఘీభావంగా వేలాదిగా జనం ఆమెతో పాటు కలిసి సాగుతున్నారు. బుధవారంనాటికి కర్నూలు జిల్లాలో 84 కి.మీల మేర షర్మిల పాదయాత్ర సాగింది. మంగళ, బుధవారాల్లో ఆదోని, పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన షర్మిల పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. ప్రజాస్పందనను చూసి నిర్వాహకులు ఆదోని పరిసర ప్రాంతాలలో పాదయాత్ర షెడ్యూలును పెంచారు కూడా. వలస కూలీలు, గొర్రెల కాపరులు...ఇలా పలు వర్గాలవారు
షర్మిలను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మహిళలతో షర్మిల ప్రత్యేకంగా సంభాషిస్తున్నారు. రచ్చబండ సమావేశాలతో ఆమె జనంతో మమైక్యమౌతున్నారు. ప్రధానంగా గ్యాస్, కరెంటు సంక్షోభం, విద్యుత్తు సర్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీల పెంపు, నీటి కష్టాల వంటివాటిపై షర్మిల మాట్లాడుతున్నారు. రాష్ట్రస్థాయి అంశాలతో పాటు స్థానిక సమస్యలకూ ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారు. కాగా, ఆదోనిలో మంగళవారం జరిగిన బహిరంగసభకు జనం పోటెత్తారు. వైయస్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభకు కిలోమీటరు దూరం వరకు జనం నిలిచిపోగా, సర్కిల్‌లోని మూడు కూడళ్ల రోడ్డు ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయింది. బుధవారం ఆదోని పట్టణం నుంచి బయలు దేరి మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్ద కడుమూరు మండల కేంద్రంలోకి షర్మిల పాదయాత్ర ప్రవేశించింది. మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించే పాదయాత్రకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. రెండు రోజుల్లో షర్మిల 22 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కిరణ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినందుకు గాను ఎంఐఎంను ఆదోని సభలో అభినందించినప్పుడు జనం హర్షధ్వానాలతో స్పందించారు. ఇప్పుడు కిరణ్ సర్కారును దించడం మరింత సులభమనీ, అందుకే వెంటనే అవిశ్వాసం పెట్టి నిజాయితీ రుజువు చేసుకోవాలని షర్మిల ఈ సభలో టిడిపికి నేరుగా సవాలు విసిరారు. ప్రభుత్వ విధానాలను పదునైన మాటల్లో షర్మిల విమర్శించినప్పుడల్లా జనం చప్పట్లు కొట్టి ఈలలు వేసి తమ ఆమోదాన్ని తెలిపారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందనీ, వైయస్ పథకాలన్నీ మళ్లీ సజావుగా అమలు అవుతాయనీ షర్మిల వాగ్దానం చేయడం ప్రజలలో కొత్త ఆశలను చిగురింపజేసింది. కోటి ఎకరాలకు నీరు అందించే వైయస్ కలను జగన్ నెరవేరుస్తాడని చెప్పినప్పుడు రైతన్నలలో భరోసా కలిగింది. వైయస్ లాగే జగనన్న చెప్పినవీ చేస్తాడు, చెప్పనివి కూడా చాలా చేస్తాడని ప్రకటించి షర్మిల జనంలో విశ్వాసం పాదకొల్పారు.
వైయస్ఆర్ సీపీ ఆదోని పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ఈ బహిరంగసభ జరిగింది.
కాగా పాదయాత్రలో పార్టీ శాసనసభ్యులు శోభా నాగిరెడ్డి, ఆళ్లనాని, కాపు రాంచంద్రారెడ్డి, చెన్నకేశవ రెడ్డి, వై. బాలనాగిరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, అమరనాథ్ రెడ్డి, శ్రీనివాసులు, పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి పద్మ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాపు భారతి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఏవీ సుబ్బారెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బుగ్గన రాజారెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డి, ఇతర నాయకులు డాక్టర్ హరికృష్ణ, నిడ్జూరు రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, ఎం.ఎల్. కాంతారెడ్డి, రమాదేవి, అత్తిరి గౌడ్, విరుపాక్షప్ప, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మంగళవారంనాడు ఆదోని వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. ఆమె సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్ రెడ్డి  వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
 .

Back to Top