రాజన్న అడుగులో షర్మిలమ్మ నడక

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి కుమార్తె శ్రీమతి వైయస్ షర్మిల అత్యంత ఉద్వగ్నభరిత క్షణాలలో ప్రారంభించిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర లక్ష్యం దిశగా పరుగులు తీసింది. రాజన్న నడిచిన మార్గంలోనే ఇంచుమించుగా ఆమె యాత్ర సాగింది. వైయస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలు మినహా ఆమె యాత్ర ఆసాంతం మహానేత అడుగుజాడలను అనుసరించింది. రంగారెడ్డి జిల్లాలో మోకాలి గాయంతో ఆరు వారాల విశ్రాంతి తీసుకోవలసి రావడం మినహా ప్రజల ఆదరాభిమానాలు.. ప్రకృతి పులకింతల నడుమ అప్రతిహతంగా అడుగులు వేసింది. ఇడుపులపాయలో మొదలైనప్పటి నుంచి ఇచ్చాపురంలో ముగిసే దాకా పాదయాత్ర సాగిన తీరుపై ఓ విశ్లేషణ...
వైయస్‌ఆర్ కడప జిల్లా అక్టోబరు 18న ఇడుపులపాయలో ప్రారంభైమైన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఐదున్నర రోజుల పాటు వైఎస్‌ఆర్ జిల్లాలో సాగింది. శ్రీమతి షర్మిల ఈ సమయంలో 82.5 కి.మి మేర నడిచారు.వేంపల్లి, వేముల,పులివెందులలో బహిరంగ సభలు నిర్వహించారు.రచ్చబండ కార్యక్రమాల్లో మహిళలతో  చర్చించారు. ట్రిపుల్ ఐటి విద్యార్థులతో ముఖాముఖి చర్చలో పాల్గొని వారి సమస్యలను తెలుసుకున్నారు.
 
 అనంతపురం జిల్లాలో అక్టోబరు 24న శ్రీమతి షర్మిల యాత్ర ప్రవేశించింది. 16రోజులపాటు సాగిన ఈ యాత్రలో ఆమె 194.5 కిలోమీటర్లు నడిచారు.తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామం వద్ద వంద కిమీ యాత్ర పూర్తయ్యింది. ఈ జిల్లాలో ఆమె పది బహిరంగ సభలో పాల్గొన్నారు. 8 రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొని మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధర్మవరం లో చేనేత కార్మికులకు ఎదురవుతున్న సమస్యలను షర్మిలకు వివరించారు.
 
 కర్నూలు జిల్లాలో దాడితోట వద్ద నవంబరు 8న పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి అడుగు పెట్టింది. పద్నాలుగున్నర రోజులు  సాగింది. జిల్లాలో 7 బహిరంగ సభలు, 6 రచ్చబండ కార్యక్రమాలలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. జిల్లాలో 178.3కి.మీ పాదయాత్ర చేశారు.
 
 మహబూబ్‌నగర్ జిల్లా: నవంబరు 23న తుంగభద్ర వంతెన మీదుగా  మహబూబ్‌నగర్ జిల్లాలోకి  పుల్లూరు వద్ద శ్రీమతి షర్మిల ప్రవేశించారు. ఆ సమయంలో వీడ్కోలు పలికేందుకు వచ్చిన రాయలసీమ ప్రజలు, స్వాగతం పలికేందుకు వచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు వంతెన మీదకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఇసకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 20 రోజులు.. 290.7కి.మీ. 94గ్రామాలలో పర్యటన. కొత్తూరు మండలం కోడిచర్ల గ్రామం వద్ద బతుకమ్మలు పేర్చి ఆడి పాడి శ్రీమతి షర్మిలకు పాలమూరు జిల్లా నుంచి వీడ్కోలు పలికారు.
 
 
 రంగారెడ్డి జిల్లాలో శ్రీమతి షర్మిల వారం రోజులు పాదయాత్ర చేశారు. 5 సభలలో ప్రసంగించారు. నాలుగు రచ్చబండలు నిర్వహించారు. 178.3 కిమీ మేర ఆమె పాదయాత్ర చేశారు. రెండు చోట్ల ముఖాముఖి ప్రజలతో సంభాషించారు. డిసెంబరు 14న బీఎన్‌రెడ్డి నగర్‌లో సభలో ప్రసంగించిన అనంతరం తూలిపడడంతో ఆమె మోకాలికి గాయమైంది. అయినప్పటికీ బాధను భరిస్తూ నాలుగు కిలోమీటర్లు నడిచి తుర్కయాంజాల్ చేరారు. నొప్పి తీవ్ర ం కావడంతో పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ కారణంగా ఆరు వారాలపాటు ఆమె విశ్రాంతి తీసుకున్నారు.
 తల్లి, వదిన తోడు రాగా.. ఫిబ్రవరి 6న శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్రను పునఃప్రారంభించారు. మోకాలి నొప్పి బాధ పెడుతున్నా ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేశారు. ఉదయం 10.30 గంటలకు తుర్కయంజిల్ లోని ఎస్‌ఎస్‌ఆర్ గార్డెన్స్‌కు చేరుకున్నారు. ఫిబ్రవరి 8న మాల్ గ్రామం వద్ద ఆమె నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించారు.
 
నల్లగొండ జిల్లాలో శ్రీమతి షర్మిల 13 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఫిబ్రవరి 8న మాల్ గ్రామం వద్ద జిల్లాలో ప్రవేశించిన యాత్ర వాడపల్లిలో రచ్చబండతో ముగిసింది. జిల్లాలో అడుగుపెట్టిన ప్రతి చోట ఆమెకు విశేష స్పందన లభించింది. ఆమెను తమ ఇంటి ఆడపడుచులా ఆదరించారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రధానంగా ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల పూర్తి, నక్కలగండి(డిండి)ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడమే దీనికి పరిష్కారమని శ్రీమతి షర్మిల అభిప్రాయపడ్డారు. దివంగత మహానేత ఇచ్చిన ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పూర్తికి నిధులివ్వని ప్రభుత్వ తీరును ఆమె తప్పుపట్టారు. వెయ్యికిలోమీటర్ల యాత్ర పూర్తయిన సందర్భంగా ఆమె తుంగపాడు గ్రామంలో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ జిల్లాలో మొత్తం 5 సభల్లో ప్రసంగించారు. మూడు రచ్చబండలు, నాలుగు ముఖాముఖిలు నిర్వహించారు.
గుంటూరు జిల్లా: వాడపల్లి వంతెన మీదుగా గుంటూరు జిల్లాలో ప్రవేశించిన శ్రీమతి షర్మిలకు కత్తి డాలు బహుకరించి స్వాగతించారు. పొందుగుల గ్రామంలో ఆమె తొలి సభలో ప్రసంగించారు. శ్రీమతి షర్మిల 31 రోజుల పాటు 371.5 కిలోమీటర్లు  జిల్లాలో పాదయాత్ర చేశారు. 14 నియోజకవర్గాలు, ఐదు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌తో పాటు 225 గ్రామాలలో ఆమె నడిచారు.
కృష్ణా జ్లిలాలో శ్రీమతి షర్మిల 27రోజుల పాటు పాదయాత్ర చేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో 340 కిమీ నడిచారు. రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఈ జిల్లాలో ప్రజలు శ్రీమతి షర్మిలకు అడుగడుగునా హారతులు పట్టారు. పోటెత్తిన జనవాహిని కృష్ణమ్మ పరవళ్ళను జ్ఞప్తికి తెచ్చింది.

 ఖమ్మం జిల్లాలో శ్రీమతి షర్మిల 19 రోజుల పాటు 222 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఏప్రిల్ 22న జిల్లాలో ప్రవేశించింది. మధిర, పాలేరు, ఖమ్మం, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలలో యాత్ర సాగింది. దాదాపు 90 గ్రామాలలో ఆమె ప్రజలతో మాట్లాడారు. వైయస్‌ఆర్‌విగ్రహాలు 20 ఆవిష్కరించారు.
 కాలు బెణకడంతో ఖమ్మం జిల్లాలో రెండు రోజులు విరామం తీసుకున్నారు. 2003 మే 12న వైయస్‌ఆర్ మండుటెండల్లో ఈ జిల్లాలోకి ప్రవేశించినంతనే చిరుజల్లులు కురిశాయి. సరిగ్గా పదేళ్ళ తర్వాత షర్మిల ప్రవేశించినపుడు కూడా అప్పటిదాకా నిప్పులు కురిపించిన భానుడు మబ్బుల చాటుకు తప్పుకున్నాడు. చిరుజల్లులూ కురిశాయి. రాబోయే రాజన్న రాజ్యానికి ఇది సంకేతమని స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 29న 134వ రోజు పాదయాత్రలో శ్రీమతి షర్మిల ఎడమ కాలి మడమకు గాయమైంది. ఆమెను చూడాలనే ఆత్రంలో ప్రజలు చొచ్చుకురావడంతో కొందరు ఆమె కాళ్ళపై పడ్డారు. షర్మిల కాలు గోతిలో పడడంతో ఆమెకు కొంత నొప్పి చేసింది. అలాగే కొంతదూరం నడిచి భోజన విరామ కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సలహా మేరకు రెండు రోజులు  పాదయాత్రకు విరామం ప్రకటించారు.

 పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర 22 రోజులు సాగింది. 13 నియోజకవర్గాలలో 278.4 కి.మీ.లు సాగింది. ఆమె మొత్తం పద్నాలుగు సభల్లో ప్రసంగించారు. వేలాదిమందితో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యంగా రైతులను కలుసుకుని వారి సమస్యలను ఓపికగా విన్నారు.  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీవైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి ఏడాదయిన సందర్భంగా శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 161వ రోజున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిరసన దీక్ష చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో శ్రీమతి షర్మిల 20 రోజుల పాటు 13 నియోజకవర్గాలలో పాదయాత్ర చేశారు. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు, తుని నియోజకవర్గాలలోని ప్రజలు ఆమె కలిశారు. 14 సభలలో ప్రసంగించారు. అక్కడక్కడ రచ్చబండలు నిర్వహించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతమైన  అడ్డతీగల గ్రామాలలలో ఏర్పాటు చేసిన  గిరిజన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. గిరిజన సంప్రదాయాన్ని, వారి అలవాట్లనూ ఆకళింపు చేసుకున్నారు.
 విశాఖపట్నం జిల్లాలోకి: జూన్ 24న  నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించింది. చోడవరం, మాడుగుల, పెందుర్తి, గాజువాక, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర, విశాఖ దక్షిణ, విశాఖ, తూర్పు, భీమిలి నియోజకవర్గాల్లో 13 రోజుల పాటు సాగింది. 180 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. విశాఖ ఆర్కే బీచ్‌కు చేరుకునే సమయానికి ఆమె 200 రోజులు, వంద నియోజకవర్గాలలో పాదయాత్ర పూర్తి చేసిన ఘనత సాధించారు. విశాఖ జిల్లాలో ఆమె చేసిన కాంగ్రెస్ పార్టీది బ్రాందేయ వాదం అన్న వ్యాఖ్య సంచలనం సృష్టించింది. మరుగుదొడ్లు కావాలంటే మద్యం గదులు కట్టారు అనే వ్యాఖ్య కూడా విశేష స్పందనను అందుకుంది. గోవాడ చక్కెర ఫ్యాక్టరీని శ్రీమతి షర్మిల సందర్శించినప్పుడు కార్మికులు.. తమ పరిశ్రమను మహానేత ఎలా నిలబెట్టిందీ వివరించారు. సబ్బవరం సభలో శ్రీమతి షర్మిల చేసిన ‘విశ్వసనీయతే జగనన్న డీఎన్‌ఏ’ అనే వ్యాఖ్యను ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతించారు.
 
 విజయనగరం జిల్లా 203వ రోజున శ్రీమతి షర్మిల పాదయాత్ర విశాఖ జిల్లానుంచి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. అదే రోజు జూలై 8 అంటే దివంగత మహానేత జయంతి కూడా కావటం విశేషం. జయంతి రోజున ఏర్పాటైన సభలో ఆమె వైయస్ అన్న పదం ఈ రాష్ట్ర గతినే మార్చేసిందని వ్యాఖ్యానించారు. శ్రీమతి షర్మిల దంపతులు రక్తదానం కూడా చేశారు. ఎస్. కోట నియోజకవర్గంలోని చింతలపాలెంలో యాత్ర జిల్లాలోకి అడుగుపెట్టింది. ఎస్. కోట, గజపతినగరం, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో 13 రోజుల పాటు 180 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. బొబ్బిలి వీణ తయారీదారులు, ఫెర్రో అల్లాయిస్, జ్యూట్ మిల్ కార్మికులు, రైతులు, కూలీలు అందరూ ఆమెను కలిసి కష్టాలను పంచుకున్నారు.
 
 శ్రీకాకుళం జిల్లా జూలై 21న వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామం వద్ద శ్రీమతి షర్మిల శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టారు. ఏడు నియోజకవర్గాలు, నాలుగు మున్సిపాలిటీలు, 16 మండలాలమీదుగా శ్రీమతి షర్మిల ఇచ్చాపురం చేరుకుంటారు.

Back to Top