రంగస్థలాన్ని కదిలిస్తున్న ప్రజాసంకల్పం


ప్రజా సంకల్ప పాదయాత్రకు సామాన్య పౌరులే కాదు, సెలబ్రెటీలు, సినీ ప్రముఖులు కూడా  ఫిదా అవుతున్నారు. 200 రోజులను దాటి శరవేగంగా సాగుతున్న ప్రజా సంకల్పానికి మద్దతిచ్చేందుకు తమంతట తాముగా వచ్చి యువనేతను కలుస్తున్నారు. పాదయాత్రలో తమ అడుగులు కలుపుతున్నారు. ప్రతిపక్ష నేతకు తమ మద్దతు పలుకుతున్నారు. ఇది కుల ప్రాధాన్యతతో వస్తున్న అభిమానం కాదు. ఓ గొప్ప నాయకుడిని చూస్తున్నామని గర్వంతో తమంతట తాముగా ప్రకటిస్తున్న అభిమానం.
ప్రజా సంకల్ప యాత్రపై స్పందిస్తున్న తెలుగు సినీ ప్రపంచం
చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు రాజకీయాల విషయంలో కాస్త మితజోక్యంతో వ్యవహరిస్తారనిపిస్తుంటుంది. అయితే ప్రభుత్వాధినేతలతో సత్సంబంధాలున్న సినీ ప్రముఖులు కొందరు, రాజకీయ భవిష్యత్తు కోసం, కుల ప్రాతిపదికన తమ మద్దతును ప్రభుత్వానికి తెలుపుతున్నారు. తప్పితే మిగితా సినీ ప్రపంచం అంతా రాజకీయ వాతావరణానికి వీలైనంత దూరంగా ఉంటోంది. అయితే అలా తటస్థంగా ఉన్న సినీ ప్రముఖులను కూడా ఆకర్షిస్తోంది ప్రజా సంకల్ప యాత్ర. ఎండా, వానను లెక్క చేయకుండా, ప్రజల కోసమే నిస్వార్థంగా సాగుతున్న ఆ యువనాయకుని సంకల్పానికి సలాం చేస్తోంది. గతంలో పోసాని, ఆ తర్వాత పృథ్వీ, నేడు ఛోటాకె నాయుడు మొదలైన వారంతా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలిసి తమ మద్దతు తెలుపుతున్నారు. ఆ నాయకుడంటే మాకు గౌరవం కలుగుతోందంటున్నారు. రాజకీయ రంగులకు దూరంగా ఉండే రంగస్థల ప్రముఖులను సైతం కదిలించిన వైఎస్ జగన్ ఏ ఒక్క సినీ ప్రముఖునీ తమకు మద్దతిమ్మని అడిగింది లేదు. 
చిత్ర సీమపై టిడిపి చౌకబారు వాఖ్యలు
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ఉధృతంగా ఉద్యమం చేస్తున్న సమయంలో మనుగడ కోసం టిడిపి హోదా బాట పట్టక తప్పలేదు. కేంద్రంతో ప్రతిపక్ష పార్టీ హోరాహోరీగా పోరాడుతుంటే, ప్రధాని లేని సమయంలో కుప్పుగంతులేసింది టిడిపి. ఆ సమయంలో టిడిపి ఛోటా మోటా నేతలు తెలుగు సినీ పరిశ్రమపై, హీరోలపై విమర్శలు గుప్పించారు. టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చౌకబారు వాఖ్యలతో చిత్ర పరిశ్రమను గేలి చేసాడు కూడా. అయినా కూడా కళాకారులెవ్వరూ దీనిపై స్పందించలేదు. కారణం హోదాపై చిత్తశుద్ధిలేని టిడిపి పార్టీకి మద్దతివ్వడం వల్లో, వారి మాట పై హోదా కోసం అడుగు ముందుకు వేయడంలో ప్రయోజనం ఉండదని వారికీ తెలుసు. ప్రజలే నమ్మని ఆ అధికార పార్టీ నేతల ప్రత్యేక హోదా నాటకాలను చిత్ర పరిశ్రమ సైతం నమ్మలేదు. కానీ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అహరహం శ్రమిస్తున్న ఓ నిఖార్సైన నాయకుని చూసిన తర్వాత చిత్ర సీమలోని వారుకూడా రాజకీయాల్లో తమ గొంతుక వినిపించడానికి ముందుకొస్తున్నారు. 
జగన్ కు సినీ ప్రముఖుల మద్దతు
ముఖ్యమంత్రి అవ్వాల్సిన వ్యక్తి ఎలా ఉండాలో జగన్ ని చూసాక అర్థం అయ్యింది అన్నారు ఛోటాకెనాయుడు. వైఎస్ జగన్ సంకల్పం మా అందరినీ కదిలించింది అన్నారు ప్రముఖ హాస్య నటుడు పృథ్వీ. సినీ పరిశ్రమలో వైఎస్ జగన్ పాదయాత్ర, ఆయన వ్యక్తిత్వం గురించి చర్చ జరుగుతోందని, మరింత మంది మద్దతు పలికేందుకు రానున్నారని చెప్పారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అనుకున్నది చేయగల సమర్థుడు వైఎస్ జగన్ అని నేను నమ్ముతున్నా అన్నారు పోసాని కృష్ణ మురళీ. తన నడకతో, నడవడితో, నవ చైతన్యంతో వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్నారు వైఎస్ జగన్. ఆయన సంకల్పం వజ్రసంకల్పమై అన్ని రంగాల వారినీ స్పందించేలా చేస్తోంది. నిబద్ధతతో, విలువలతో నడిచే ఆ నాయకుడిపై నమ్మకాన్ని పెంచుతోంది. 

 
Back to Top