రైతు మహిళలు.. వేదనల సెలయేరులు

జడ్చర్ల:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు రైతులకు ఢోకా ఉండేది కాదని మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఆయన మరణించిన తరవాత మూడేళ్ల నుంచి పంటలు ఇంటికి రావడం లేదనీ, కరెంటు రెండు గంటలు వస్తే మూడు గంటలు పోతోందనీ ఓ రైతు ఆమెకు చెప్పి బావురుమన్నారు. అన్ని ధరలూ పెరిగి అప్పుల పాలయ్యానన్నారు. ప్రభుత్వం, విపక్ష నేత ప్రజలను గాలికొదిలేశారని శ్రీమతి షర్మిల ఆ రైతుతో అన్నారు. అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు నాటకాలాడుతున్నారని ఆమె మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానం యాబయ్యవ రోజు పాదయాత్రను  గురువారం శ్రీమతి షర్మిల పూర్తిచేసుకున్నారు.
‘చంద్రబాబు ఉన్నప్పుడు మా ఊర్లో సీతారెడ్డి, శంకరయ్య, వెంకటమ్మ అనే ముగ్గురు పత్తి రైతులు పురుగుల మందు తాగి చనిపోయరనీ, ప్రతిపక్ష నేతగా ఉన్న  వైయస్ అప్పుడు మా ఊరికొచ్చి వారి కుటుంబాలకు సాయం చేశారనీ గంగాపురం గ్రామానికి చెందిన రాకేలమ్మ, మాధవి అనే రైతు మహిళలు శ్రీమతి షర్మిలతో చెప్పారు.  మహానేత వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు రైతుకు ఢోకా లేకుండా పోయిందన్నారు.  ఆయనతోనే  తమ సుఖాలూ పోయాయన్నారు. మూడేళ్ల నుంచి పంటలు ఇంటికి రాలేదనీ, కరెంటు రెండు గంటలొస్తే మూడు గంటలు పోతుందనీ చెప్పారు. కరెంటు ఆగిఆగి వస్తే మడి తడుస్తుందా అని ప్రశ్నించారు.  పంట వేసింది వేసినట్లుగా  ఎండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎరువులు, విత్తనాలు అన్ని ధరలు పెరిగి అప్పుల పాలయ్యామన్నారు. ఇటీవల మా పక్క పల్లెలో రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే ఎవ్వరు రాదని వారు చెప్పారు.
శ్రీమతి షర్మిల ముందు గురువారం వీరు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీరే కాదు.. పాలమూరు జిల్లాలో ఏ పల్లెలో ఎవరిని పలకరించినా తమ వెతలు చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్నా ఒక్క నేత కూడా తమవైపు కన్నెత్తి చూడడం లేదని చెబుతున్నారు. జడ్చర్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర గంగాపూర్, గొప్లాపూర్, లింగంపేట, కోడుగల్ మీదుగా కొండేడు గ్రామానికి చేరింది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లింగంపేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళి అర్పించారు. పాదయాత్రలో భాగంగా వెళ్లిన ప్రతిచోటా స్థానికులు తమ సమస్యలను షర్మిలతో చెప్పుకున్నారు.

Back to Top