ఎన్నికలకు ఇంకా మూడు నెలల గడువు ఉంది. చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి చేయడానికి ఈ మాత్రం సమయం చాలు. రోజుకో శంకుస్థాపన, పూటకో పునాది రాయి వేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఎన్నికల రోజు లోపు ఏపీ మరో అమెరికానో సింగపూరో అయిపోతుంది. అనుమానం లేదు. కావాలంటే గత రెండు నెలలుగా చూడండి బాబు గారు ఏదో ఒక శంకుస్థాపన, ఆవిష్కరణ, గేట్లు ఎత్తడం, కొబ్బరికాయ కొట్టడం చేస్తూనే ఉన్నారు. పూర్తి అవ్వని పోలవరం లో 40 గేట్లకు ఒక్క గేటు నిర్మాణం మొదలు పెట్టినందుకు పూజా కార్యక్రమం జరిగింది.ఆరోగ్యశ్రీకి 500 కోట్ల బకాయిలు చెల్లించిన బాబు చేతుల మీదుగా 8000 కోట్ల కడప స్టీలు ఫ్యాక్టరీకి పునాది రాయి పడింది. చిల్లుల తాత్కాలిక సచివాలయం తర్వాత అమరావతిలో మరో సచివాలయ భవనాల నిర్మాణానికి ర్యాఫ్ట్ ఫౌండిగ్ జరిగింది.కేంద్రం అనుమతి, చేతిలో పరపతి లేకుండానే రేపో మాపో మెట్రో రైలుకు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. జిల్లాకో విమానాశ్రయానికి కూడా పునాదిరాళ్లేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.మండలానికో మెగా సీడ్ పార్కుకు శంకుస్థాపనలు జరిగితే జడుసుకోవద్దు.సుజల స్రవంతి మళ్లీ సింగారించుకుని వచ్చి ఊరూరా వాటర్ ట్యాంకులు కట్టేందుకు ఇటుకలు పెడితే ఇసుక్కోవద్దు. లక్షల ఉద్యోగాలిచ్చే కంపెనీలు, వేలమందికి వైద్యం అందించే ఆసుపత్రులు, కోట్ల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టులు ఇలా చాలానే ఉన్నాయి ఈ పునాదిరాళ్లు, శంకుస్థాపనల జాబితాలో. ఎన్నికల వరకూ తెలుగు ప్రజలకు పూటకో బ్రేకింగ్ బాదుడే.బాబు ప్రత్యేక విమానంలో రాష్ట్రం అంతా తూనిగలా తిరిగేస్తూ జానెడు జాగా దొరికిన చోటల్లా ఏదో పనికోసం పునాదులేసేస్తాడు. కాకుంటే బాబుగారి ఒకప్పటి తొమ్మిదేళ్ల పాలనలో లాగే ఆ పునాదిరాళ్లన్నీ సమాధిరాళ్లుగా, శంకుస్థాపనలన్నీ మరుగున పడ్డ మూలరాళ్లుగా మారుతాయి....<br/><br/><br/>