పుల్లూరులో ప్రవాహంలా జనం

అలంపూర్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు అలంపూర్ నియోజకవర్గంలోని పుల్లూరు గ్రామానికి జనం ప్రవాహంలా విచ్చేశారు. ఉదయం నుంచే ప్రజలు తండోపతండాలుగా తరలిరావడంతో రహదారులు జనసంద్రంగా మారాయి. జాతీయ రహదారిపై ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు బారులుదీరారు. ఈ సందర్భంగా తెలంగాణలోకి ప్రవేశించిన షర్మిలకు వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా పరిశీలకులు బండారు మోహన్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, పార్టీ సీజీసీ సభ్యురాలు బాలమణెమ్మ, మహిళా విభాగం జిల్లా కన్వీర్ శారదమ్మ ఘనస్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పూల్లురులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను విస్మరించిందన్నారు. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఆయన కూడా ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాశ్రేయస్సును మరిచిన పార్టీలకు బుద్ధిచెప్పడానికి వైయస్‌ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల సాహోసోపేతంగా మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు.

     అందులో భాగంగానే పూల్లురుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ..‘షర్మిల పాదయాత్రకు లక్షమందితో స్వాగతం పలుకుతామని చెప్పాం. కానీ కట్టలు తెంచుకున్న అభిమానంతో అంతకంటే ఎక్కువ మందితో స్వాగతం పలికాం’ అని అన్నారు. యాత్రను దిగ్విజయంగా పూర్తిచేసేందుకు జిల్లాలోని 64 మండలాల నుంచి ప్రజలు, అభిమానులు తరలొచ్చారని చెప్పారు. యాత్ర ప్రారంభానికి తరలొచ్చిన ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్ఫూర్తితో జిల్లాలో యాత్రను జయప్రదం చేసేందుకు కృషిచేస్తామన్నారు.

Back to Top