సొంతింటి సోకుల కోసం ప్రజాధనం దుర్వినియోగం

సొంత పనులకోసం ప్రజాధనం లూటీ
బాబుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఇంటి పనుల కోసం కోట్లాది రూపాయలు దుబారా 
ఆర్థిక సంవత్సరం మొదటి రోజే తొలి ఖర్చుల పద్దు
బాబు ఫాంహౌస్ హంగుల కోసం రూ. 1.36 కోట్లు విడుదల 

హైదరాబాద్: బాబు దుబారా ఖర్చులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఓ పక్క రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని బీద అరుపులు అరుసూనే...బాబు తన సొంత పనుల కోసం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్ లలో దేశాలు తిరగడం మొదలు సొంతింటి సోకుల కోసం అడ్డగోలుగా ప్రజల సొమ్మును వాడేసుకుంటున్నారు. హైదరాబాద్ మదీనాగూడలోని తన సొంత ఫాంహౌస్‌లో అదనపు హంగులకోసం ప్రభుత్వం  రూ.1.36 కోట్లు విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అత్యవసరంగా నామినేషన్‌పై పనులు చేపట్టాలంటూ రోడ్లు, భవనాలశాఖ శుక్రవారం జీవో నంబరు 181 జారీ చేసింది. సీఎం క్యాంప్ నివాసంలో భద్రత, ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు విడుదల చేసినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రోడ్లు, భవనాల శాఖ విడుదల చేసిన తొలి ఖర్చుల పద్దు సీఎం సొంత ఫాంహౌస్‌లో అదనపు హంగులకోసం కావడం గమనార్హం.

సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ మదీనగూడలో  ఫాంహౌస్ ఉంది.  ఫాంహౌస్‌లో హెలిప్యాడ్, అప్రోచ్‌రోడ్డు కోసం రూ.9.80 లక్షలు కేటాయించగా.. నివాసంలో ఇంటర్నల్ సర్వీస్ రోడ్డుకు 9.50 లక్షలు, బోర్‌వెల్, నీటిసరఫరా ఏర్పాట్లకు రూ.8.40 లక్షలు కేటాయించారు. ఇక పోలీస్ పికెట్, సెంట్రీ పోస్టుల ఏర్పాటు, భద్రతా సిబ్బందికి ఈశాన్య, నైరుతి మార్గాల్లోని గేట్ల వద్ద పోలీస్ బ్యారెక్స్ తదితరాలకోసం వేర్వేరుగా నిధులు కేటాయించారు. మొత్తమ్మీద చంద్రబాబు ఫాంహౌస్‌లో అదనపు హంగులకోసం ఆర్థిక సంవత్సరం తొలిరోజే పెద్ద మొత్తంలో పద్దు కేటాయించడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. 

ఇదివరకే జూబ్లీహిల్స్ లోని సీఎం అధికారిక నివాసానికి... అదనపు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్ల పేరుతో అప్పట్లో కోట్లాది రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు మకాం మదీనాగూడలోని ఫాంహౌస్ కు మార్చి మరోసారి బాబు ప్రజధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇటీవలే సెక్రటేరియట్ లో  తన ఛాంబర్ కు మెరుగులు దిద్దేందుకు కోట్లాది రూపాయలను వెచ్చించిన బాబు..ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో ఉన్నపళంగా మకాం విజయవాడకు మార్చారు. అక్కడ ఓ అక్రమ నివాసంలో ఉంటూ రోడ్లు, అదనపు హంగులంటూ కోట్లాది రూపాయల ప్రజధనాన్ని వృథా చేశారు. 

ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు తాజాగా మదీనాగూడలోని ఫాంహౌస్‌ను క్యాంప్ రెసిడెన్స్‌గా పేర్కొంటూ ఇక్కడకూ నిధులు విడుదల చేశారు. పెపైచ్చు అత్యవసరమంటూ నామినేషన్ పద్ధతిలో ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించారు. జూన్ 15వ తేదీ నుంచి కొత్త రాజధాని నుంచే ప్రభుత్వం నడుస్తుందని ఒకవైపు చెబుతూ.... ఇప్పుడు సొంత ఫాంహౌస్‌ను క్యాంప్ రెసిడెన్స్‌గా పేర్కొం టూ ,సౌకర్యాల పేరుతో నిధులు విడుదల చేయడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ప్రజలు, ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు. 
Back to Top