వైయస్ఆర్­సీపీ వైపు తెలంగాణ నేతల చూపు

నీడనిచ్చే చెట్టు పంచకే ఎవరైనా చేరతారు. సేదతీరుతారు.

ఫలాలను రుచిచూస్తారు. తాజాగా చోటుచేసుకుంటున్నరాజకీయ పరిణామాలు దీనినే ఆవిష్కరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ అల్లుకుంటున్నాయి. అందరి దృష్టీ ముఖ్యంగా యువతరం అటువైపు పరుగులు తీస్తోంది. తెలంగాణ జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా దృగ్గోచరమవుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి తరువాత ఎవరు? అని ప్రశ్నించుకుంటే వారికి వైయస్ఆర్­సీపీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. వరంగల్ జిల్లా పరకాల ఉప ఎన్నికలో ఓటింగ్ సరళి వారిని ఈ దిశగా ఆలోచింపచేస్తోందని విశ్లేషకుల అంచనా. తెలంగాణ ప్రాంతానికి చెందిన దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి తనయుడు సందీప్­రెడ్డి వైయస్ఆర్­సీపీలో చేరాలని నిర్ణయించుకోవడం దీనికి తాజా ఉదాహరణ. నల్గొండ, మహబూబ్­నగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులు జగన్మోహనరెడ్డి నాయకత్వంలోని పార్టీ వైపు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, చల్లా వెంకట్రామ్ రెడ్డి, డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పనూతల పురుషోత్తమరెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన సి. జగదీశ్వరరావు, కాంగ్రెసుకు చెందిన ఎస్. హరివర్ధన్ రెడ్డి వీరిలో ఉన్నారు. వీరిలో హరివర్ధన్ రెడ్డి 1999లో మేడ్చల్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్­పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆలోచింపజేసిన ఉప్పునూతల వ్యాఖ్య

ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ వైయస్ఆర్ పార్టీలో నేను చేరితే తప్పేంటి అని ప్రశ్నించడం పలువురిని ఆలోచింపజేస్తోంది. వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతోంది. సీనియర్ల పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ఆయన తూర్పారపట్టడం వారి భవిష్య ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతోంది. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డిని తానెన్నడూ రాజధానిలో చూడలేదని కూడా పురుషోత్తమరెడ్డి చెప్పారు. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషించి చూస్తే వైయస్ఆర్సీపీ తెలంగాణ ప్రాంతంలో టీఆర్­ఎస్­కు ప్రత్యామ్నాయంగా ఎదిగిందనే అంశం స్పష్టమవుతోంది. పరకాలలో తెరాస అభ్యర్థి బిక్షపతి అతితక్కువ మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై అతి కష్టంమీద నెగ్గడం దీనిని బలపరుస్తోంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ధరావతు కోల్పోవడం దిగజారిన ఆ పార్టీ పరిస్థితికి దర్పణం పడుతోంది. తెలుగుదేశం అభ్యర్థి 30వేల ఓట్లు సాధించారు. తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీల తరుగుతున్న ప్రాభవాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయనేది ఓ విశ్లేషణ.

ఎన్నికలంటే భయం

రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచిన 18మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించి ఆ స్థానాలలో ఉప ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. వీటితో కలిపి ఈ ఏడాది రెండు విడతలుగా 20 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికలలో వైయస్ఆర్సీపీ పదిహేడింటిలో అత్యధిక మెజారిటీతో విజయబావుటా ఎగురవేయటం, ప్రజలకు ఆ పార్టీపై ఉన్న తిరుగులేని అభిమానానికి నిదర్శమని స్పష్టమవుతోంది. మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలన్న యోచన ఓ మూల మెదులుతున్నప్పటికీ ఈ ఫలితాలు అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టించాయి. తెలంగాణ రాష్ట్రంపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల శుష్క వాగ్దానాలతో విసిగిపోయిన ఓటర్లకు తమ పార్టీ కొత్త ఆసరాగా కనిపిస్తోందనీ, టీఆర్ఎస్ వైఖరితో నిరాశచెందిన ఆ పార్టీ కార్యకర్తలు సైతం తమవైపు చూస్తున్నారనీ వైయస్ఆర్సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పడం కూడా దీనికి నిదర్శనం. పైపెచ్చు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరెడ్డి అన్ని కార్యక్రమాలనూ తెలంగాణ ప్రాంతంనుంచే ప్రారంభించిన అంశం స్థానికుల మస్తిష్కంలో చెదరని జ్ఞాపకంలా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. 

 

Back to Top