రాజకీయాల్లో బాహుబలి వైయస్ఆర్ - 10

వైయస్ఆర్  అమలు చేసిన భూపంపిణీ కార్యక్రమం కధనం చూసిన  ఆంధ్రా మిత్రుడు
ఒకరు నాకు మెసేజ్ పెట్టారు. అతని కోరిక మీద పేరు రాయడం లేదు. "మా నాన్న నాకు
ఎకరంన్నర పొలం ఇచ్చారు. వైయస్ఆర్ నాకు రెండున్నర ఎకరాల భూమిని ఇచ్చారు."...

విశేషం
ఏమిటంటే... ఆ మిత్రుడు స్వచ్ఛమైన కమ్మ సామాజికవర్గం వారు. ఆయన గతంలో నాకు చెప్పిన
మరో మాట ఏమిటంటే..."చంద్రబాబుకు కులాభిమానం ఎక్కువ. ఎన్టీఆర్ కంటే చాలా
ఎక్కువ. కానీ, ఆయన
కమ్మవారిలో ధనికులైన కమ్మవారినే అభిమానిస్తారు. మధ్యతరగతి, పేదవారు అంటే
చంద్రబాబుకు చాలా అసహ్యం. ఒక్క కమ్మవారే కాదు. ఏ కులంలో అయినా పేదవారంటే ఆయనకు
గిట్టదు. కుబేరులు అయితేనే ఆయనకు ఇష్టం."

ఎన్టీఆర్
అధికారంలో ఉన్నప్పుడు బస్ కండక్టర్లు సైతం ఎమ్మెల్యేలు అయ్యారు. చంద్రబాబు
తెలుగుదేశం అధిపతి అయ్యాకే సి ఎం రమేష్, సుజనాచౌదరి, కంభంపాటి రామ్మోహన రావు
లాంటి కోట్లాధిపతులకు చోటు ఇచ్చి పేదవారిని పార్టీనుంచి తరిమేశారు...వాస్తవమే
కదా!)

ఇక
అసలు విషయం లోకి వద్దాము. ఒకప్పుడు... అనగా.. 1978 - 2004 సంవత్సరాల మధ్య. దాదాపు
ఇరవై ఆరేళ్ళ కాలం లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం పది సంవత్సరాలు. ఆ పదేళ్లలో
మర్రి చెన్నారెడ్డి, కోట్ల
విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి
జనార్దన్ రెడ్డి లాంటి యోధాగ్రేసరులు, భీష్మపితామహులు
ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే ఏమి లాభం? అధిష్ఠానదేవతల ముందుకు
వెళ్ళినపుడు వీరంతా కేవలం సేవకులు. వారిముందు చేతులు కట్టుకుని నిలబడాలి. కూర్చో
అంటే కూర్చోవడం, లేవమంటే
లేవడం. ఒక్క మాట మాట్లాడటానికి వీలు లేదు.

టంగుటూరి
అంజయ్య తరువాత ఎవరిని ముఖ్యమంత్రిని చెయ్యాలా అని ఆలోచిస్తుండగా అక్కడ దేనికో భవనం
వెంకట్రామ్ రెడ్డి కనిపించారు. అసలు అతడు ఎవరో కూడా ఇందిరాగాంధీకి తెలియదు.
"ఇతడిని ముఖ్యమంత్రిగా చేస్తున్నాను" అన్నారు ఇందిరాగాంధీ. అందరూ
అవాక్కయ్యారు. ఎందుకంటే భవనం కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. అతను కేవలం ఎమ్మెల్సీ.
ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రులుగా చేసే సంప్రదాయం అప్పటివరకూ లేదు. భవనం ఎమ్మెల్యే
కాదు మేడం అని చెప్పే సాహసం కూడా నాటి వీరులకు లేకపోయింది అంటే కాంగ్రెస్ లో
బానిసత్వం ఎంత ఉచ్ఛస్థితిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

రాష్ట్ర
ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ అధిష్ఠానదేవత దృష్టిలో ఒక బొమ్మ. ఐదేళ్లలో నలుగురు
ముఖ్యమంత్రులను మార్చిన భ్రష్టచరిత కాంగ్రెస్. అయితే వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక
పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాదయాత్ర చేసి, ప్రజలలో తిరుగులేని
ఇమేజ్ సొంతం చేసుకోవడం, ప్రజానేతగా
వైయస్ఆర్ గుర్తింపు పొందటం తో సోనియా కూడా వైయస్ఆర్ ను ప్రోత్సహించే పరిస్థితి
వచ్చింది. దానికి తోడు సోనియా మనస్తత్వం కూడా అప్పట్లో బలమైన నాయకులను
ప్రోత్సహించే రీతిలో ఉన్నది. ఇక వైయస్ఆర్ మధ్యందినమార్తాండుడిలా తేజరిల్లడంలో
వింత ఏముంది?

ఒక
రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరిలో వైయస్ఆర్ ఎవరూ అందుకోనంత
ఎత్తుకు ఎదిగారు. వైయస్ఆర్ చాణక్యం ఏమిటంటే, గతంలో అందరు కాంగ్రెస్
ముఖ్యమంత్రులతో అసమ్మతి పోరాటం చేసిన వైయస్ఆర్ తన హయాంలో మాత్రం ఎలాంటి అసమ్మతి
తలెత్తని చాకచక్యం ప్రదర్శించారు. హనుమంతరావు, ఉప్పునూతల, వెంకటస్వామి లాంటి కురువృద్ధులు
ఎంత గింజుకున్నా, వైయస్ఆర్  ను ఏమీ చేయలేకపోయారు.

అందుకు
కారణం ఆయనకు గల మాస్ ఇమేజ్. పాదయాత్రతో ఆయన జనహృదయనేత అయ్యారు. పాదయాత్రతో తనకు
కోపం అనే నరం తెగిపోయింది అని అనేకమార్లు చెప్పారు. వైయస్ఆర్ లో మరొక విశిష్ట
లక్షణం ఏమిటంటే తనను నమ్మినవారికోసం, తాను నమ్మినవారికోసం
ఎంతకైనా తెగించే లక్షణం వైయస్ఆర్ సొంతం. అందువలన తాను నష్టపోయినా చలించేవారు కారు
. వైయస్ఆర్ , చంద్రబాబు
ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. నలభై ఏళ్ళనుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎంతటి ఉన్నత స్థానానికి
ఎగబాకినా, చంద్రబాబుకు
ఒక్కడంటే ఒక్క స్నేహితుడు లేడు. ఒక్క నమ్మకస్తుడు లేడు. కనీసం సొంత తమ్ముడు కూడా
ఆయనను నమ్మడు. కానీ, వైయస్ఆర్
కు ఎంతోమంది స్నేహితులు. ప్రతి గ్రామంలోనూ వైయస్ఆర్ నలుగురినో, అయిదుగురునో పేర్లతో
పిలవగలిగేవారంటే స్నేహానికి వైయస్ఆర్ ఎంత విలువ ఇస్తారో చెప్పాలా?

అధిష్టానం
తో మంతనాలు వెళ్ళినపుడు ప్రతిసారీ వైఎస్ మాటే నెగ్గేది. సోనియా గాంధీకి సమాచారం
ఇవ్వడమే తప్ప ఆమె అనుమతికోసం ఎదురుచూసే భృత్యలక్షణం వైయస్ఆర్ ఏనాడూ
ప్రదర్శించలేదు. ఆయన చిత్తస్థైర్యం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక అద్భుతం.
అధిష్టానాన్ని శాసించిన ఏకైక నేత డాక్టర్ వైఎస్సార్!

బుద్ధి
ఉన్నవాడికి బలం ఉంటుంది. అనగా వాడు తన బుద్ధి బలాన్ని ఉపయోగించుకుని ఎన్ని
కార్యాలైనా సాధించుకుని వస్తాడు. బుద్ధిహీనుడికి ఎంత శరీరబలం ఉన్నా, అది పనిచేయదు.
చెవులపిల్లి చిన్నదే.. కానీ, ఉపాయంతో తనకంటే ఎంతో
బలశాలి అయిన సింహాన్ని చంపగలిగింది అని పంచతంత్రంలో ఒక కథ ఉన్నది. రాష్ట్రనాయకులు
కుందేళ్లు కావచ్చు. అధిష్టానం సింగం కావచ్చు. కానీ, బుద్ధిబలం ఉన్న
వైఎస్సార్ లాంటి నేతలు సింహం లాంటి అధిష్టానాన్ని నేలకరిపించగలరు...

(సశేషం)

రచన : ఇలపావులూరి మురళిమోహనరావు 


Back to Top