పితాని చాణక్యం ఫలిస్తుందా?

‘డివైడ్ ఎట్ ఇంపెరా’ అనేది పాశ్చాత్య సైనిక -ఆర్థిక- రాజకీయ వ్యూహం. ‘ఓడించలేని ప్రత్యర్థి పక్షాన్ని ముందు విభజించు- తర్వాత సునాయాసంగా పాలించు!’ అన్నదే, ఈ వ్యూహం సారాంశం. లాటిన్ పెద్దగా రాని మన పాలకులకు ఈ విషయం బాగా అర్థమయ్యేలా చేసిన ఘనత ‘రవి అస్తమించని బ్రిటిష్ మహాసామ్రాజ్యానికే’ దక్కాలి. ఊరికే ఎవరినో ఆడిపోసుకోవడం ఎందుకూ? శకునీ, చాణక్యుడూ పుట్టిన ఈ గడ్డమీద ఇలాంటి వ్యూహాలు బయటినుంచి వచ్చినవాళ్లు నేర్పించాలా? అక్కర్లేదని నేటికాలపు చాణక్యుడు పితాని సత్యనారాయణ రుజువు చేస్తున్నారు. పేద విద్యార్థులు కూడా ప్రొఫెషనల్ కోర్సులు చదివి, ఇంటింటా దీపం పెట్టాలన్న ఆకాంక్షతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకం ‘ఫీజు వాపసు’. ఈ పథకానికి ఏదోలా గండికొట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి అధికారం చేపట్టిన క్షణం నుంచీ చెయ్యని ప్రయత్నం లేదు. ఈ పథకం వల్ల డబ్బు ఖర్చవడమే తప్ప అధికార వర్గానికి గానీ, రాజకీయులకుగానీ ఏమీ రాబడి లేకుండా పోవడమే కిరణ్ కుమార్ రెడ్డి ఫీజు వాపసుపై కత్తికట్టడానికి ముఖ్యకారణం అయివుంటుంది. దానికి తోడు మరో కారణాన్ని కూడా మనం ఊహించవచ్చు. డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సమాజ సంక్షేమ పథకాలన్నింట్లోకీ ఇది విశిష్టమయిందని పరిశీలకులు ఆనాడే అన్నారు. దాదాపు ‘ఆరోగ్య శ్రీ’ పథకానికి దక్కినంత ఆదరణ ఈ పథకానికీ దక్కింది. మహానేత కన్నుమూసినా ఆయన జనహృదయాల్లో పీఠం వేసుకుని కూర్చోడానికి ఈ పథకం దారితీసింది. రాజశేఖరరెడ్డి ముద్రను చెరిపెయ్యాలనే చేటపెయ్యలకు ఈ పథకం కంటిమంటగా మారడం సహజం. కిరణ్ కుమార్ రెడ్డి కంటగింపునకు ఇదీ ఓ ముఖ్యకారణమయి ఉండొచ్చు. పితాని చాణక్యుడు ఈ కంటిమంటను చక్కగా అర్థంచేసుకున్నారు. దాన్ని లోపలినుంచి డొల్లచెయ్యడానికి నడుంకట్టారు. ప్రస్తుతం ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీల మధ్య రగులుతన్న నిప్పు పితాని రగిలించినదే!ముందుగా ఇంజినియరింగ్ కాలేజీల యాజమాన్యాలను చీల్చారు పితాని. అందులో ఒక వర్గాన్ని -రకరకాలుగా- మంచిచేసుకున్నారు. ఫీజు వాపసు మొత్తాన్ని నిర్ణయించే సందర్భంగా కాలేజీల యాజమాన్యాల మధ్య చీలిక చిచ్చు తెచ్చిపెట్టారు. ఆయా వర్గాలు బాహాబాహీ తలపడితే చూసి ఆనందించడానికి తాను సిద్ధపడి, ముఖ్యమంత్రిని కూడా సిద్ధం చేశారు. అంతా చేసి, ‘ఫీజు వాపసు పథకం కొనసాగిస్తాం. పాత కౌన్సెలింగ్ పద్ధతినే కొనసాగిస్తాం. కామన్ ఫీజు విషయంలో సర్కారీ ప్రతిపాదనను 98శాతం యాజమాన్యాలు అంగీకరించాయి. ఒకవేళ ఎవరైనా కోర్టుకెక్కితే అప్పుడు చూస్తాం!’ అని అచ్చం రాజకీయ నాయకుడి ఫక్కీలో సెలవిచ్చారు మన పితాని కౌటిల్యుడు. అయితే, యాజమాన్యాల కన్సార్షియం అధ్యక్షుడు రమేష్ మాత్రం మంత్రి ప్రకటనను ఖండించారు. ‘చర్చలు విఫలమయ్యాయి. ఫీజు మొత్తం 40 వేలుగా ఉండాల్సిందే. 75 శాతం యాజమాన్యాల అభిప్రాయం ఇది. 25 శాతం యాజమాన్యాలను ప్రభుత్వం నయాన్నో భయాన్నో లొంగదీసుకుంది. ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం’ అన్నా రమేష్. ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించిన యాజమాన్యాల ప్రతినిధులు లౌక్యంగా మాట్లాడుతూ, ‘ఒకే ఫీజు పద్ధతిలో ప్రతి విద్యార్థికీ 40 వేల రూపాయలు చెల్లిస్తే ఎవరూ కోర్టుకు వెళ్లరు. అందుకు మిగతావారిని ఒప్పించాల’న్నారు.ఇక్కడ విషయం డబ్బు ఒక్కటే కాదు. ఈ పథకం ప్రవేశపెట్టడం వెనక మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తి ఏమటో గ్రహించడం, అందుకు అనుగుణంగా వ్యవహరించడం ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కిట్టని విషయమిదే. అందుకే, ఈ పథకాన్ని లోపలినుంచి తొలిచే ప్రయత్నం చేస్తోంది. కిరణ్ సర్కారు ప్రదర్శిస్తున్న ఈ వైఖరిని నిరసిస్తూనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఏలూరులో దీక్షకు దిగారు. ఏచాణక్యం, ఏ కౌటిల్యం ప్రజా ఉద్యమాలను ప్రభావితం చెయ్యలేదు!

తాజా వీడియోలు

Back to Top