పట్టిసీమలో అధికారనేతల హంగామా..!


అనుసంధానం పేరుతో హైడ్రామా..!
పంపులు బిగించకుండానే నీళ్లు ఇస్తున్నామంటూ బురిడీ..!

కర్ర విరగకూడదు-పాము చావకూడదు అన్నరీతిలో టీడీపీ ప్రభుత్వం పట్టిసీమలో పెద్ద హైడ్రామానే నడుపుతోంది. నధుల అనుసంధానం చేస్తున్నాం..రాయలసీమకు నీళ్లిస్తున్నామంటూ హడావుడి చేస్తూ రాష్ట్రంలో గందరగోళం వాతావరణం సృష్టిస్తున్నారు. పంపులు బిగించకుండానే, నీళ్లు వదలకుండానే నీళ్లు ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. పట్టిసీమలో పైపుల ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం మరోసారి రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టించారు. ముందు నదుల అనుసంధానం ఆ తర్వాత ప్రారంభోత్సమంటూ ప్రభుత్వం వింతకార్యక్రమానికి తెరలేపింది. నీళ్లు ఎక్కడ ప్రవహించాయో అర్థంకాక ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
అంత మాయే..నీళ్లు రాకపోయే..!
వాగులు, వంకల ద్వారా వచ్చిన వర్షపు నీరు, గోదావరి వాటర్ ను తాడిపూడి వద్ద తోడి...పోలవరం కుడికాలువ ద్వారా బుడమేరులోకి పంపించి సరిగ్గా వారం క్రితం టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కొద్దిపాటి క్యూసెక్కుల నీళ్లు మళ్లించి అదిగో నధుల అనుసంధానం జరిగిపోయిందంటూ చంకలు గుద్దుకున్నారు. కానీ అవి ప్రకాశం బ్యారేజీకి చేరకుండానే మధ్యలోనే ఆగిపోయాయి. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా బ్యారేజీ వద్దకు గోదావరి నీరు చేరాలంటే 174 కి.మీ. మేర ప్రయాణించాల్సి ఉంటుంది. వారం నుంచి తాడిపూడి ద్వారా వదిలిన నీళ్లు బ్యారేజీకీ ఆమడదూరంలో నిలిచిపోయాయి. కృష్ణారివర్ కు నీరు రాకుండానే పట్టిసీమకు నీళ్లిచ్చామని చెప్పుకోవడం అధికారపార్టీకే చెల్లింది.

కాలువల్ని కలిపిస్తే అయిపోయినట్టేనా..!
గతంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి తవ్వించిన కాలువను ఇప్పుడు పట్టిసీమకు ఉపయోగిస్తూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది. కానీ, చంద్రబాబు కాలువల్ని కలిపేస్తూ నధుల అనుసంఘానం జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారు.కమీషన్ల కోసం పట్టిసీమను తెరపైకి తెచ్చిన చంద్రబాబు... రాయలసీమ ప్రజలను మభ్యపెడుతూ, గోదావరి డెల్టా ఆయకట్టు రైతుల నోట్లో మట్టికొడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.   
Back to Top