పశుక్రాంతికి మంగళం

-పాలకులకు పట్టని పథకం
-మూడేళ్లుగా నిధులు కేటాయించని టీడీపీ ప్రభుత్వం
-జీవనాధారం కోల్పోతున్న పశుపోషకులు 
-కరువు కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో పాడి రైతులు 

అమరావతి: రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు, వ్యవసాయంలో నష్టపోయిన రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రవేశపెట్టిన పశుక్రాంతి పథకానికి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మంగళం పాడింది. పథకానికి నిధులు కేటాయించడం లేదు. పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి పశుసంవర్ధకశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఈ పథకం గురించి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పశుక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టారు. తక్కువ పాడి ఉత్పత్తిని ఇచ్చే దేశవాళీ పశువులకు బదులుగా అధిక దిగుబడిని ఇచ్చే మేలు జాతి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా గుజరాత్, పంజాబ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ము్రరా జాతి గేదెలను కొనుగోలు చేసి రైతులకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ పథకాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కింది.

పథకం ప్రయోజనాలు : పశుక్రాంతి పథకం కింద 33 శాతం రాయితీపై వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాకు వెయ్యి యూనిట్లను కేటాయించారు. వీటిని మండలాలకు 20 యూనిట్ల చొప్పున కేటాయించే వారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ.75 వేలు కాగా అందులో రైతు వాటా రూ.25 వేలు, మరో రూ.25 వేలు బ్యాంకు రుణం ఇచ్చేది. రూ.25 వేలను ప్రభుత్వం రాయితీగా అందించేవారు. ఎవరైనా రైతులు తమ వాటా చెల్లించకపోతే బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కూడా కల్పించారు. అనంతరం రైతులు పాడి ఉత్పత్తి ద్వారా వచ్చిన ఆదాయంతో బ్యాంకులో రుణాలు చెల్లిస్తూ కుటుంబ జీవనానికి ఇబ్బంది లేకుండా ముందుకు సాగేవారు. 

కరువులో ఆదుకుంటుందనుకుంటే :
కరువు ప్రాంతంలో పాడి రైతులకు ఆసరాగా ఉంటుందనుకున్న పశుక్రాంతి పథకాన్ని నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పథకాన్ని ప్రభుత్వం పక్కన పెట్టడంపై పశుసంవర్ధకశాఖ అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలకు, మంత్రివర్గ సమావేశాలకు, నీరు–చెట్టుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులకు ఉపయోగపడుతున్న ఈ పథకాన్ని ఎత్తివేయడం దారుణమని పలువురు పాడి రైతులు మండిపడుతున్నారు. 
Back to Top