గుంతకల్లు పట్టణం కిక్కిరిసిపోయింది. అన్ని వర్గాల ప్రజలూ వెల్లువెత్తారు. చంటిబిడ్డను చంకనెత్తుకుని బాలింతలు.. చేతికర్ర ఊతంతో వృద్ధులు.. ఉరకలెత్తుతోన్న ఉడుకు రక్తంతో యువతీ యువకులు.. షర్మిల పాదంతో పాదం కలిపి కదంతొక్కారు. ఉవ్వెత్తున ఎగిసిన జనకెరటం.. ఇదీ జిల్లాలో షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 16వ రోజు వచ్చిన జనస్పందన.మహానేత వైఎస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల బుధవారం ఉదయం 10.15 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. భారీ జనసందోహం మధ్య.. మిన్నంటిన జగన్నినాదాల మధ్య పాదయాత్రను మొదలుపెట్టారు.ఉపకార వేతనాలూ హుళక్కుకొనకొండ్ల-గుంతకల్లు మధ్య ఉన్న పెద్ద రోడ్డు జనప్రవాహానికి సరిపోలేదు. దాంతో.. రోడ్డు పక్కన చేలు, వాగులు, వంకలు, గట్ల వెంట జనం పరుగులు తీస్తూ కదంతొక్కారు. గుంతకల్లు హనుమాన్ సర్కిల్‌కు సమీపంలోని ఓ ప్రైవేటు ఎంసీఏ, ఎంబీఏ కళాశాలను షర్మిల సందర్శించారు. ఆ కళాశాలలో చదువుతోన్న విద్యార్థులతో మమైకమయ్యారు. విద్యార్థుల సమస్యలు ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. ఓ ఎంసీఏ విద్యార్థిని మాట్లాడుతూ ‘అక్కా.. గతేడాదికి సంబంధించిన ఉపకార వేతనాలు ఇంతవరకూ రాలేదు. ఫీజు రీయింబర్సుమెంట్‌దీ అదే కథ. వైయస్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సక్రమంగా అందేవి. మాది పేద కుటుంబం. ఫీజులు కట్టలేక చదువు మానుకోవాల్సిన దుస్థితి ఉత్పన్నమైంది’ అంటూ షర్మిలకు వివరించింది.దీనిపై షర్మిల స్పందిస్తూ.. ‘చెల్లీ.. ప్రతి ఇంట్లోనూ ఒకరు ఇంజనీరో, డాక్టరో, కలెక్టర్ అయ్యే చదువు చదివితే ఆ కుటుంబం పేదరికం నుంచి విముక్తి పొందుతుందని వైయస్ భావించారు. ఆ క్రమంలోనే ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైయస్ హయాంలో 40 లక్షల మంది విద్యార్థులు ఆ పథకంతో లబ్ధి పొందారు. ఈ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులపై కక్ష కట్టి.. వారి జీవితాలతో ఆడుకుంటోంది’ అని ధ్వజమెత్తారు. ఆ తర్వాత ఎంబీఏ చదువుతోన్న మరో విద్యార్థిని మాట్లాడుతూ ‘అక్కా మా ఊర్లో రోజుకు ఆరు గంటలు కూడా విద్యుత్తు ఉండటం లేదు.. ఫలితంగా పరీక్షల సమయంలో చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది’ అంటూ వివరించింది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘విద్యుత్తు సంక్షోభానికి ఈ ప్రభుత్వ వైఖరే కారణం. వైయస్ హయాంలో సేద్యానికి ఏడు గంటల విద్యుత్తు ఇస్తూనే ఇళ్లకూ కోతలు లేకుండా చేశారు. అవసరమున్నప్పుడు ఎంత ఖరీదైనా చేసి బయటి నుంచి కరెంట్ కొన్నారు. ఈ ప్రభుత్వం విద్యుత్తు కోతలతో సరిపెడుతోంది. కొద్ది రోజులు ఓపికపట్టండి. రాజన్న రాజ్యం వస్తుంది.. జగనన్న సీఎం అవుతారు.. సేద్యానికి తొమ్మిది గంటల విద్యుత్తు ఇవ్వడంతోపాటూ కరెంట్ కోతలు లేకుండా చూస్తారు’ అని హామీ ఇచ్చారు.