పండుతున్నపాపం

రాక్షస సంహారానికి కాలం ఎప్పుడు దగ్గరపడుతుందంటే వాళ్ల పాపాలు పెచ్చుమీరిపోయనప్పుడు. అరాచకాలు ఆపలేనంతగా పెరిగిపోయినప్పుడు. పెరుగొట తరగుట కొరకే అన్నది సామెత. జారిపోతున్న కాలంతో పాటు అధికార పీఠం కూడా చేజారిపోతోందని గ్రహించాకే చంద్రబాబు అక్రమాలు మరింత పెరిగిపోతున్నాయి. ఎంతకైనా తెగించి, ఎలాంటి దుశ్చర్యలకైనా పాల్పడాలనుకోవడం చూస్తే ఈ పాలకుల పాపం పండే రోజు దగ్గరకొచ్చేసిందని అనిపిస్తోంది. 
సిబీఐ దర్యాప్తు వద్దు
కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టకుండా జీవో జారి చేసాడు చంద్రబాబు. ఇప్పటికే తెలుగుదేశం నాయకుల ఇళ్లు, కంపెనీలు, వ్యాపార సంస్థల్లో సిబిఐ, ఈడీ, ఐటి శాఖలు సోదాలు జరిపాయి. కీలకమైన ఆధారాలు సేకరించాయి. ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు టిడిపి పన్నిన నాటకం ఆపరేషన్ గరుడ. కోడికత్తి తో హత్యాయత్నం స్వయంగా చేయించుకున్నారనే ప్రచారం ఇందులో ప్రధాన అంకం.  ఈ నాటకం రక్తి కడుతుందనుకున్న నాయకుల అంచనాలు తలకిందులయ్యాయి. పాత్రధారులు, సూత్రధారుల డొంకలు కదలడం మొదలుపెట్టాయి. సొంత అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేసి తమకు నచ్చినట్టు దర్యాప్తు చేయించి, కేసును ముగిద్దామనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయతో దిమ్మతిరిగినట్టైంది. ఈ వ్యవహారాన్ని వైసీపీ మెడకే చుట్టాలన్న ప్రయత్నం బెడిసికొట్టి గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టైంది. ఓ పార్లమెంటేరియన్ పై హత్యాయత్నం, అదీ విమానాశ్రయంలో జరగడాన్ని ప్రభుత్వ వైఫల్యంగా పరిగణించకుండా, దర్యాప్తును తప్పుడు దారుల్లో ఎలా తీసుకుపోతారని హైకోర్టు ముఖ్యమంత్రికి, పోలీసు బాసులకు నోటీసులిచ్చింది. దీనిపై కేంద్ర సంస్థల నుంచి దర్యాప్తు కోరుతూ వైసీపీ నేతలు దిల్లీ తలుపు తట్టారు. చంద్రబాబు ఉలికిపాటుకు, తత్తరపాటుకు, భయభ్రాంతులకు ఇదే కారణం. అసలే ఐటి సోదాల వల్ల తెలుగుదేశం పరువు బజార్నపడింది. అవినీతి నేతల గుట్టు పబ్లిక్ గా రట్టైంది. ఇప్పుడిక చంద్రబాబు వంతు వచ్చింది. గరుడ పురాణం ఎవరి రచనో, అక్రమ ఆస్తులు ఏమూల నుంచి ఎటుకు ప్రయాణించాయో, నానుతున్న కేసులు ఒకదానితో ఒకటి సంబంధం ఏమిటో అన్నీ బయటపడే పరిస్థితి వచ్చేసింది. అసలే ప్రభుత్వంపై వ్యతిరేకత రాష్ట్రం నలుమూలలా ఉంది, చంద్రబాబు ప్రభుత్వం ఎంతటి అవినీతి మయమో కూడా బయటపడిపోయింది. ఎంతోదూరంలో లేని ఎన్నికల వేళ తన చీకటి చరిత్ర మరింత బయట పడకుండా ఉండేందుకుచంద్రబాబు తాపత్రయపడుతున్నాడు. సిబిఐ ఆంధ్రాలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేసాడు. బాబుకు సిబిఐ అంటే అంత వణుకెందుకు కలుగుతోంది. ఒకప్పుడు జగన్ పై కేసులు పెట్టి, విచారణ చేస్తున్నప్పుడు సిబిఐని కీర్తించిన చంద్రబాబు నేడు రాష్ట్రంలోకే రాకూడదని గేట్లు మూయడంలో అర్థం ఏమిటి? 
 ఇక్కడ రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి
ఒకటి చంద్రబాబు అవినీతి పరుడు కనుక, ఆయన ప్రభుత్వం అంతా అవినీతి మయం కనుక కేంద్ర దర్యాప్తు సంస్థలు దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించాయి కనుక చంద్రబాబు ఇంతలా భయపడుతున్నాడు. సిబిఐని రాష్ట్రంలో రానీయకుండా, విచారణలు, దర్యాప్తులు చేయనీయకుండా అడ్డుపడుతున్నాడు. చంద్రబాబు నిజాయితీపరుడైతే, తెలుగుదేశం నాయకులు అవినీతికి పాల్పడకపోతే సిబిఐ అంటే ఇంత భయంతో వణికిపోవాల్సిన అవసరం ఏముంటుంది?
రెండు చంద్రబాబు చెబుతున్నట్టు సిబిఐ బీజేపీ సర్కార్ చెప్పినట్టు టిడిపి ప్రభుత్వంపై కక్ష కట్టి సిబిఐని పావులా వాడుకుంటున్నది నిజమైతే, నాడు జగన్ విషయంలో జరిగింది కూడా అదే కదా. ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర విభజన హామీలకోసం తిరగబడ్డందుకు బీజేపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని గగ్గోలు పెడుతున్నాడు చంద్రబాబు. మరి ఆ నాడు వైఎస్ జగన్ మోహన రెడ్డి తమ మాటను కాదన్నందుకే సోనియా చంద్రబాబు చేతులు కలిపి జగన్ పై అక్రమ కేసులు బనాయించడం కూడా వాస్తవమే కదా! అప్పుడు జరిగిన దర్యాప్తు, అరెస్టులు కూడా సోనియా, చంద్రబాబు చెప్పినట్టు సాగినవి కాదా? జెడీ లక్ష్మీనారాయణ చంద్రబాబుల సాన్నిహిత్యం అందుకు సాక్ష్యం కాదా?
జగన్ పై దర్యాప్తు జరిగితే సిబిఐ గొప్పది, చంద్రబాబుపై ఎంక్వైరీ అంటే అది కక్ష సాధింపా? అధికారం ఉంది కనుక రాష్ట్రంలో పచ్చముఠాల జోలికి రాకుండా సిబిఐ ని నిరోధిస్తారా? ఇది పచ్చి అవకాశవాదం. పలాయనవాదం. పరాకాష్టకు చేరిన అవినీతిని దాచిపెట్టే దగాకోరుల చట్టాలతో చుట్టాలాట. శిశుపాలుడి వందతప్పుల తర్వాత శిరచ్ఛేధం అయినట్టు బాబు నాలుగేళ్లుగా చేస్తున్న వేల తప్పులకు ఇక కాలం దగ్గరపడింది. ఆ తప్పులకు శిక్షలనుభవించేకాలమే ముందుంది. రాష్ట్రప్రజలు చెబుతున్నట్టు చంద్రబాబూ నీ పాపం పండింది. 
 
Back to Top