అధికారుల అత్యుత్సాహం

నందిగామ రూరల్‌: గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ రాజకీయాల్లో వింత పోకడలు నెలకొంటున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే కన్పించే రాజకీయ వాతావరణం ప్రస్తుతం నిత్యకృత్యమైపోయింది. ప్రతిపక్ష పార్టీ ఏం చేసినా దానిని అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఫ్లెక్సీల వివాదం నిత్యం రగులుతూనే ఉంది. ప్రచారం, శుభాకాంక్షలు తెలపడం, పార్టీ కార్యాలయ చిరునామాను సూచించేందుకు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను తొలగిస్తుండటం స్థానికంగా వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ నాయకులు కలుగజేసుకోకుండా అధికారులను ఉసిగొల్పుతున్నారు. ఈ పరిణామాల వెనక పచ్చ నేతల హస్తం ఉందని వైయస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారులను ముందు పెట్టి ఆ నాయకులు ఈ తతంగం నడుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని విషయాలను అధికార పార్టీ రాజకీయ కోణంలోనే చూస్తోందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

అంతకంతకు ముదురుతున్న వివాదాలు..
 మునిసిపల్, పోలీసు, ఆర్‌అండ్‌బీ.. ఇలా పలు శాఖల అధికారులతో టీడీపీ నాయకులు వైయస్సార్సీపీని దెబ్బకొట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కొంత కాలంగా ఈ తరహా వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. స్వయంగా ప్రతిపక్ష నేత వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడ పర్యటించిన సమయంలోనూ అధికార పార్టీ నాయకులు నానా యాగీ చేశారు. అంతకు ముందు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అధికార పార్టీ నాయకులు వారి అక్కసు వెళ్లగక్కారు. పట్టణంలో ఫ్లెక్సీల వివాదం ఈనాటిది కాదు. ఇప్పటికే పలుమార్లు అధికారులు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఉద్దేశ పూర్వకంగా కాకపోయినా, తప్పని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ అధికారులతో గొడవ పడాల్సి వస్తోంది. పట్టణంలోని ఏ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటుచేసినా, దానిని తొలగించే వరకు అధికారులు నిద్రపోవడం లేదు. అనుమతులు లేవనే సాకుతో మునిసిపల్‌అధికారులు వాటిని తొలగిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టినా, చివరకు మహానీయుల విగ్రహాలకు పచ్చజెండాలు కట్టినా పట్టించుకోని అధికారులు...వైయస్సార్సీపీ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చివరకు పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసుకున్న బ్యానర్‌ను కూడా తొలగించాలంటూ కొద్ది రోజుల క్రితం మునిసిపల్‌ అధికారులు పోలీసు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల సాయంతో నానా హడావుడి చేశారు. దాదాపు పది గంటలకు పైగా హైడ్రామా నడిచింది. అధికారులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్ష నాయకులు ప్రహరీకి ఆనుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. దానిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి చింపివేయడం వివాదాస్పదమైంది.

అధికారులే సమన్వయ పర్చాలి..
నందిగామలో ఫ్లెక్సీల వివాదంపై పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా అధికారుల తీరుతో ఇటువంటివి మరింత ముదురుతున్నాయని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో వ్యవహరించి వివాదాలు జరగకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top