మంత్రి నారాయణ రూటే సెపరేటు

మంత్రి మండలి లో మిగిలిన మంత్రుల పరిస్థితి ఒకలా ఉంటే, నారాయణ రూటు ఎప్పుడూ సెపరేటుగా ఉంటుంది. రాజధాని వ్యవహారాల దాకా ఆయన్ని షాడో సీఎం అంటారు.రాజధాని భూసమీకరణలో   ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హల్ చల్ చేశారు. అన్నీ తామే అన్నట్లుగా వ్యవహరించారు. రైతుల నుంచి భూములు లాక్కొనేందుకు ఊరూరా తిరిగారు. ఆయన వెంట జిల్లాకు చెందిన మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎప్పుడూ కనిపించేవారు. ఆ సమయంలో ఈ ఇద్దరు మంత్రులు రైతులకు బోలెడన్ని వరాలు కురిపించారు. ప్రపంచాన్ని రైతుల ముందు పరిచేస్తున్నట్లు హామీలు వాగ్దానాలు గుప్పించారు. రైతుల్ని భయపెట్టి, కంగారు పెట్టి, ఆందోళనకు గురిచేసి భూములు లాగేశారు.


ఇదంతా పూర్తయి, ఇప్పుడు రైతుల ప్రయోజనాల సంగతి ప్రస్తావనకు వచ్చాక ఈ ఇద్దరు మంత్రులు ఇటు వైపు రాకుండా పోయారు. రాష్ట్రంలోని అన్ని చోట్లకు తిరుగుతున్నారు. రాజధాని ప్రాంతానికి రావటం తగ్గించేశారు. ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అదే ఊరిలో ఇస్తామని, అన్ని ప్లాట్లు ఒక్కచోటే ఇస్తామని మంత్రులు నమ్మబలికారు. కానీ, వాస్తవం మరోలా ఉంది.


సీడ్ క్యాపిటల్ కు అన్నివైపులా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉంచేలా జాగ్రత్త పడుతున్నారు. రైతుల నుంచి భూములు లాక్కొని వాళ్లను దూరంగా తరిమేసేందుకు కుట్రలు చక చకా జరిగిపోతున్నాయి. అందుకే ప్లాట్లు అడుగుతున్న రైతుల్ని బెదిరిస్తున్నారు. తప్పితే అంతకు మించి ఏమీ మాట్లాడటం లేదు. భూములు లాక్కొనేటప్పుడు బాగా హడావుడి చేసిన మంత్రులు ఇప్పుడు జాడ లేకుండా పోయారు. దీంతో రైతుల గోడు వినే నాథుడు లేకుండా పోయాడు.

తర్వాత పత్తా లేకుండా పోయారు. భూములిస్తే అవిస్తాం.. ఇవిస్తాం అని ఊదరగొట్టి.. ఇప్పుడు కనీసం తమవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భూములిచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములిచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ముప్ఫై లక్షల రూపాయలు ఇప్పిస్తామని నమ్మబలికారని,ఇప్పుడు పైసా విడుదల కావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు.

Back to Top