మరో ప్రజాప్రస్థానంలో జన హోరు

రంగారెడ్డి:

జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నాలుగో రోజున ప్రజలు ఉప్పెనలా తరలివచ్చారు. ఉత్సాహంగా సాగిన ఈ యాత్ర వైయస్ఆర్ కాంగ్రెస్  శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. దివంగత, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిలకు జిల్లాలో మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు.  ‘మా నాన్న రంగారెడ్డిని సొంత జిల్లాగా భావించేవారని షర్మిల పలుమార్లు ప్రస్తావించినపుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. యాత్ర పొడవునా జై జగన్.. జోహార్ వైయస్ఆర్ నినాదాలతో శివారు గ్రామాలు మార్మోగాయి. శుక్రవారం నగర శివారులోని నాదర్‌గుల్ నుంచి మొదలైన యాత్ర.. బడంగ్‌పేట్,అల్మాస్ గూడా మీదుగా ఇంజాపూర్ వరకు సాగింది. కరెంట్ బిల్లుల మోత, వ్యవసాయానికి అరకొర విద్యుత్ సరఫరా, పింఛన్లలో కోత తదితర సమస్యలను ప్రజలు షర్మిల ముందు ఏకరువు పెట్టారు.

     శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నాదర్‌గుల్ గ్రామంలో మొదలైన మరో ప్రజాప్రస్థానానికి మహిళలు, యువకులు, విద్యార్థులు, వద్ధులు ఇలా అన్నివర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో పోటెత్తారు. వైఎస్సార్ ఆశయ సాధనకోసం చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. నాదర్‌గుల్, వీకర్ సెక్షన్‌కాలనీ, ఎంవీఎస్సార్ కాలేజి, బడంగ్‌పేట్, అల్మాస్‌గూడ, ప్రశాంతి హిల్సు, బీడీరెడ్డి గార్డెన్స్ మీదుగా బీఎన్‌రెడ్డినగర్ బహిరంగ సభ వేదిక వద్దకు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది. అక్కడ బహిరంగ సభ అనంతరం ఇంజాపూర్ గ్రామం వరకు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది.

Back to Top