కట్టుబట్టలతో వచ్చి…. ఇంత ఖర్చా బాబూ? 

బడ్జెట్‌ లోటు ఎంత? ఆ లోటును కేంద్రం పూడ్చలేదా?

రాజధాని కట్టుకోవడానికి కేంద్రం డబ్బులు ఇవ్వలేదా?…. ఇస్తే ఎంత ఇచ్చింది?

  
కట్టుబట్టలతో హైదరాబాద్‌ నుంచి వచ్చేశాం…. లోటు బడ్జెట్‌…. ఉండటానికి రాజధాని లేదు…. ఇదీ చంద్రబాబు రోజూ వేసే రికార్డు. ఆయన చెప్పింది నిజమే అనుకుందాం. బడ్జెట్‌ లోటు ఎంత? ఆ లోటును కేంద్రం పూడ్చలేదా? ఆ మేరకు నిధులు ఇవ్వలేదా? రాజధాని కట్టుకోవడానికి కేంద్రం డబ్బులు ఇవ్వలేదా?…. ఇస్తే ఎంత ఇచ్చింది? ఆ వివరాల గురించి మాట్లాడడు…. ఆ విషయాలను పక్కన పెడితే….

పేద రాష్టం అంటాడు. ఇలాంటి పేద రాష్టానికి ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? ఎంత పొదుపుగా ఉండాలి? పైగా చిన్న రాష్ట్రం…. 13 జిల్లాల రాష్ట్రం. ఇంత చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి…. ప్రధానిని మించి ఖర్చులు పెట్టి…. ప్రజల డబ్బును దుర్వినియోగం చేసే చంద్రబాబుకు మనది పేద రాష్టం అనే అర్హత ఉందా? ఆయన తన సొంత సోకుల కోసం, ఆడంబరాలకోసం, విలాసాల కోసం, ఆర్భాటాల కోసం ప్రజల డబ్బును ఎంతగా దుర్వినియోగం చేశాడంటే….

  • హైదరాబాద్‌ లోని లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ ను క్యాంపు ఆఫీసుగా మార్చినప్పుడు దానిని ఆయనకు కావాల్సిన విధంగా మార్పులు చేయడానికి ప్రభుత్వ డబ్బు 10 కోట్లు ఖర్చుపెట్టారు…. అందులో కొత్త ఫర్నీచర్‌ కోసం 9.5 కోట్లు ఖర్చుపెట్టారు. అయితే ఇందులో కొద్ది నెలలు కూడా ఆయన ఉండలేదు.
  • ఇంకో క్యాంప్‌ ఆఫీస్‌గా విజయవాడలోని ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌ ను ఆయనకు కావాల్సిన విధంగా మార్పులు చేయడానికి ప్రభుత్వ డబ్బును 42 కోట్లు ఖర్చు చేశారు.
  • మళ్ళీ దాన్ని కూడా వదిలేసి కరకట్టమీద ఉన్న అక్రమకట్టడం లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను తన అతిధి గృహంగా మార్చుకున్నాడు. దానికి 60 నుంచి 70 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం.
  • ఇవి చాలవన్నట్టు హైదరాబాద్‌లోని సొంత ఇంటిని కూడా క్యాంప్‌ ఆఫీస్‌ గా ప్రకటించి…. పెద్ద మొత్తంలో ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారు. అక్కడ నుంచి జూబ్లీహిల్స్‌ లోని ఓ అద్దె ఇంట్లోకి మారినప్పుడు అక్కడి ఏర్పాట్లకోసం ప్రజల సొమ్ము బాగానే ఖర్చు అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఫామ్‌ హౌస్‌కు మారినప్పుడు ఆ ఫామ్‌ హౌస్‌ మీద 4 కోట్లు ఖర్చుపెట్టడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి పార్క్‌హయాత్‌ కు మారినప్పుడు అక్కడ ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిందీ ప్రభుత్వం సరిగ్గా లెక్క చెప్పడం లేదు.
  • అలాగే హైదరాబాద్‌ సచివాలయంలో తను ఉండే ఎల్‌ బ్లాక్‌ రిపేర్ల కోసం 15 కోట్లు ఖర్చుపెట్టాడు. అందులో తన ఆఫీస్‌ సుందరీకరణ కోసం 7 కోట్లు ఖర్చుపెట్టాడు.
  • చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు విదేశాలను సందర్శించడానికి 120 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చుపెట్టాడు.
  • తను రాష్ట్రంలో తిరగడం కోసం ఒక ప్రత్యేక బస్సును 5.5 కోట్లు ఖర్చుపెట్టి తయారు చేయించాడు. దాన్ని ఉపయోగించడం ఎవరిమీ చూడలేదు.
  • మనదేశంలో చాలా పెద్ద రాష్టాలు ఉన్నాయి. వాటికి ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళకు ఒక కాన్వాయ్ మాత్రమే ఉంది‌…. కాన్వాయ్‌ అంటే ముఖ్యమంత్రి ప్రయాణించేటప్పుడు అనుసరించే కార్ల సముదాయం. కాని మన చంద్రబాబుకు మాత్రం హైదరాబాద్‌లో ఒకటి, అమరావతిలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, ఢిల్లీలో ఒకటి ఉన్నాయి. మన ముఖ్యమంత్రికి తప్ప దేశంలో ఏ రాష్ట ముఖ్యమంత్రికీ ఢిల్లీలో కాన్వాయ్‌ లేదు.
  • శాశ్వత రాజధాని భవనాలకోసం ఇంతవరకూ ఒక్క పునాది రాయి కూడా పడలేదు గానీ శంఖుస్థాపనలు, శిలాపలకాల పేరుతో ఇప్పటివరకు 350 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చుపెట్టేశారు.
  • నవనిర్మాణ దీక్షలకు ప్రజల సొమ్మును 80 కోట్లు ఖర్చుపెట్టారు.
  • ధర్మపోరాట దీక్షలకు 70 కోట్ల పైనే ఖర్చుపెట్టారు.
  • పోలవరం ప్రాజెక్టును మేము కడుతున్నాం…. చూడండీ అంటూ రైతులను తీసుకువెళ్ళి చూపించడానికి 90 కోట్ల దాకా ఖర్చు అయిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే 400 కోట్ల దాకా ఖర్చు అయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.
  • పుష్కరాలకోసం 3,200 కోట్ల రూపాయల పైనే ఖర్చుపెట్టారు.
  • ప్రభుత్వ సదస్సులకు సలహాలకోసం ప్రైవేట్‌ సలహాదారులకు చెల్లించిన ప్రభుత్వ సొమ్ము 300 కోట్ల రూపాయలకు పైమాటే.
  • హ్యాపీ సండేస్‌ కోసం 10 కోట్లు…. హ్యాపీ సిటీస్‌ కోసం 61 కోట్లు…. ఖర్చు చేశారు.
  • పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుల కోసం 150 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టారు.

ఇక రెయిన్‌గన్స్‌…. నీరు చెట్టు…. ఇలా చెప్పుకుంటూ పోతే మరికొన్ని వందల కోట్ల దుర్వినియోగం మనకు కనిపిస్తుంది. మనలాంటి 13 జిల్లాల చిన్నరాష్ట్రం ఇంత దుబారా ముఖ్యమంత్రిని ప్రజలు భరించగలరా?….. భరించగలరో లేదో ఈ ఎన్నికల్లో ప్రజలే తీర్పుచెబుతారు.

-----------------

- courtesy: Telugu Global

Back to Top