కాంగ్రెస్ గూటికి చేరువౌతున్న కొద్దీ చంద్రబాబు, లోకేషూ ఇద్దరూ కలిసి కాంగ్రెస్ నామ జపం చేస్తున్నారు. రాహుల్ ను పొగుడుతూ చంద్రబాబు తరిస్తుంటే, ఇందిరాగాంధీని పొగుడుతూ లోకేష్ భజన చేస్తున్నాడు. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఇందిరా గాంధీకి దక్కుతుందని చెబుతున్నాడు లోకేషం. ఈ లెక్కన చంద్రబాబు గెలుపులో ఏ పార్టీకి ఎంత శాతం పాత్ర ఉందో కాస్తా ఆరాతీస్తే మంచిదేమో! లోకేషాన్ని కాపీ కాట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారంటే పెట్టరూ...ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా మాట్లాడాలని, ప్రవర్తించాలనీ తెగ ఆరాటపడుతుంటాడు ఎపి పప్పు. అందుకోసం పడే తాపత్రయంలో మరింత అభాసు పాలౌతుంటాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంటోంది లోకేష్ యవ్వారం. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా మేనిఫెస్టోనే కాదు, పార్టీ కేండేట్లను కూడా ప్రకటిస్తున్నారు వైఎస్ జగన్. ప్రజల సమక్షంలో చేస్తున్న ఈ అరుదైన సభ్యుల ఎంపిక విధానం ఓ విధంగా క్రేజ్ ను సంపాదించుకుంది. కర్నూలు పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాడు. ఓ మంత్రి స్థానంలో ఉన్న లోకేషే అభ్యర్థులను ఖరారు చేస్తున్నాడా, పప్పు బాబే భవిష్య ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల జాబితాను నిర్ణయిస్తున్నారా అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు కర్నూలు ప్రజానీకం. ఇక్కడ మరో విశేషమేమిటంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి, ఫిరాయింపులకు పాల్పడ్డ నాయకులే తిరిగి టిడిపికి దిక్కయ్యారు. ఎంపిగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలంటూ పిలుపునిచ్చాడు నారాలోకేష్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు ఎంపిగా గెలిచిన బుట్టా రేణుక ఏడాది క్రితం టిడిపిలో చేరారు. 2016లో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ కూడా పచ్చకండువా కప్పుకున్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పార్టీ మారామని చెప్పుకున్న ఈ నేతలు ఆ ప్రాంతాలకు చేసిన మేలు ఏమీలేదని ప్రజలకూ బాగానే తెలుసు. బుట్టా రేణుక అయితే రానున్న ఎన్నికల్లో టిడిపి నుంచి టికెట్ కన్ఫర్మేషన్ తీసుకునే ఫిరాయించారని సాగిన ప్రచారం నిజమని లోకేష్ ఆమె అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో తేటతెల్లం అయ్యింది. ఇక ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్న అసంతృప్తులకు ఇది మరింత ఆజ్యం కానుంది. ఫిరాయింపు నేతలకు పదవులివ్వడమే కాక, మళ్లీ ఎన్నికల్లో వారికే పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం, అభ్యర్థులుగా ఎంపిక చేయడం టిడిపిలో ముసలానికి కారణం కాకపోదు. కర్నూలులో లోకేష్ పొదుపు సంఘాల మీటింగ్ లో ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో వేదికపై ఉన్న ఎంపి టిజి వెంకటేష్ కంగు తిన్నారు. తన కుమారుడికి కర్నూలు అసెంబ్లీ సీటు ఎక్స్ పెక్ట్ చేస్తున్న ఆయన అసంతృప్తికి గురై తర్వాత కార్యక్రమాలకు లోకేష్ తో కలవకుండా వెళ్లిపోయారు. సమీక్షలు చేసి అభ్యర్థులను ఖరారు చేస్తామని చంద్రబాబు చెబుతుంటే, బహిరంగంగా అభ్యర్థులను ప్రకటించడం అనే కొత్త అలవాటును టిడిపి ప్రతిపక్ష పార్టీని చూసే అలవాటు చేసుకుంటోందంటూ ఆగ్రహించారు టిజి వెంకటేష్. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఆ ప్రాంతానికి టిడిపి అధినాయకత్వం ఇచ్చిన కోట్లాది రూపాయిల హామీల పరిస్థితి ఏమైందో ఆ ప్రాంతవాసులే కాదు, రాయలసీమ ప్రజానీకం అంతా గమనించారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీ నేతలు తిరిగి నంద్యాల వైపు కన్నెత్తి చూసింది లేదు. నమ్మక ద్రోహం చేసిన నాయకులనే గెలిపించమంటూ మంత్రి లోకేష్ చేస్తున్న ప్రచారం దిగజారిన ఆ పార్టీ విలువలకు సాక్షంగా కనిపిస్తోంది. లోకేష్ ప్రతిపాదించినంత మాత్రాన, పార్టీ ఫిరాయించి టిడిపిలోకి లాంగ్ జంప్ చేసిన నాయకులను ప్రజలు క్షమిస్తారా? నమ్మక ద్రోహాన్ని, వంచనను మరచిపోతారా? ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేసిన నాయకులకు బుద్ధి చెప్పకుండా ఉంటారా? <br/><br/>