జడివానతో జనం పోటీ

అనంతపురం:

జడివానతో జనం పోటీపడ్డారు. జల్లులు కురుస్తున్నా చెక్కుచెదరని అభిమానానికి రాజన్న తనయ, జననేత జగనన్న సోదరి షర్మిల తడిసిముద్దయ్యారు. ఆత్మీయ పలకరింపులు.. అధైర్య పడొద్దంటూ ఓదార్పు.. భవిష్యత్తుపై భరోసా ఇవ్వడంతో జనాభిమానం ఉప్పొంగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టి ఘనస్వాగతం పలికారు. మంగళవారం రాత్రి కమ్మూరుకు సమీపంలో బస చేసిన షర్మిల బుధవారం ఉదయం 10.30 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు.
నడిచినంత దూరం బంతిపూల వాన
గుడారం నుంచి షర్మిల అడుగు బయట పెట్టగానే అప్పటిదాకా మేఘావృతమై ఉన్న ఆకాశం నుంచి వర్షపు చినుకులు మొదలయ్యాయి. ఆ చినుకులతో జనం కూడా పోటీపడ్డారు. షర్మిల గుడారం నుంచి బయటకు వచ్చే సరికే ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జడివానలోనూ జనం చెక్కుచెదరక పోవడంతో షర్మిల కదనోత్సాహంతో అడుగులు ముందుకేశారు. అరవకూరుకు చేరుకున్న షర్మిలకు.. ఆ గ్రామ శివారులో మహిళలు హారతులు పట్టి.. దిష్టి తీసి ఘనస్వాగతం పలికారు. అరవకూరులో షర్మిల నడిచినంత దూరం ఆమెపై బంతిపూల వర్షం కురిపించారు. ఓ వేరుశెనగ రైతును పలకరించినపుడు తాళిబొట్టు బ్యాంకులో  కుదువపెట్టి రుణం తెచ్చి పంటలు సాగు చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని  వాపోయారు. ‘అన్నా.. ఈ ప్రభుత్వానికి రైతులంటే చులకన.. చంద్రబాబు ప్రభుత్వం మాదిరే ఈ సర్కారు కూడా.. ఆందోళన చెందవద్దు.. రాజన్న రాజ్యం వస్తుంది. మళ్లీ రైతే రాజవుతారటూ షర్మిల భరోసా ఇచ్చారు.

Back to Top