చంద్రబాబు నోట రాజధాని హడావుడి

అమరావతి) రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. చుట్టుపక్కల
ప్రాంతాల్లో బినామీ సంస్థల రియల్ ఎస్టేట్ బూమ్ కోసం ఉద్యోగుల్ని పరుగులు
తీయిస్తున్నారు. కనీసం నిర్మాణాలు పూర్తికాకపోయినా సరే వచ్చేవారం రాజధాని ప్రారంభం
అంటూ హడావుడి చేసేస్తున్నారు.

నిర్మాణాల వాస్తవ పరిస్థితి..

వెలగపూడిలో ప్రభుత్వం రూ.600 కోట్ల
వ్యయంతో 45 ఎకరాల్లో నిర్మిస్తున్న తాత్కాలిక సచివా లయ పనులు ఇంకా
కొలిక్కి రాలేదు. ప్రధానమైన ఆరు బ్లాకుల నిర్మాణంలో ఒక్కటీ ఇప్పటివరకూ పూర్తికాలేదు.
ఆరో బ్లాకు నిర్మాణం ఇంకా పునాదుల్లోనే ఉంది. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రెయిన్ల పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. రెండు
రోజులుగా పడుతున్న వర్షాలతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరో రెండు నెలల వరకు
పనులు  పూర్తయ్యే అవకాశం లేదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.

 

సీఎం కార్యాలయం, సీఎస్, సాధారణ పరిపాలన విభాగం, న్యాయశాఖ, సీఎం హామీల పరిష్కారం కోసం ఈ బ్లాక్‌ను కేటాయించారు. ప్రస్తుతం
ఆరు బ్లాకులు పూర్తిచేయలేమని ఇంజినీర్లు చెప్పడంతో మొదటి బ్లాక్ అయినా పూర్తిచేసి
ఈనెల 27 నాటికి కార్యక్రమాలు నిర్వహిం చాలన్నది ప్రభుత్వ నిర్ణయం.
అయితే, మొదటి బ్లాకు కూడా 27        
నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం 50శాతం పనే అయ్యింది. లోపల పూర్తిస్థాయిలో గదుల నిర్మాణం
జరగలేదు. ఓపక్క ఫ్లోరింగ్, మరోపక్క
సీలింగ్, ఇంకోవైపు వైట్‌వాష్, వైరింగ్
పనులు చేస్తున్నారు. అదేవిధంగా.. రెండో అంతస్తులో గోడలు కాకుండా ఫైబర్ ప్లేట్స్‌తో
చిన్నచిన్న గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే గానీ ఫ్యాన్లు, సెంట్రల్ ఏసీ పనులు ప్రారంభించే అవకాశమే లేదు.

 

రోడ్లన్నీ బురదమయం

రాజధాని ప్రాంతంలో ఒక వాహనం
వస్తే.. ఎదురుగా వస్తున్న వాహనం తప్పించుకు వెళ్లడానికి ఇబ్బందికర పరిస్థితి.
వర్షం వస్తే రోడ్డుకిరువైపులా వాహనం ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ ఒక్క రోడ్డు తప్ప
సచివాలయానికి వెళ్లటానికి మరో మార్గం లేదు.  మంగళగిరి
నుంచి ఐనవోలు మీదుగా సచివాలయానికి రహదారి ఉన్నా ఛిద్రమై కనిపిస్తోంది. ఇటీవల
ప్యాచ్ వర్క్ పనులు చేపట్టినా ప్రయోజనం లేదు. సచివాలయ ప్రాంగణంలో గ్రావెల్ రోడ్లు
శరవేగంగా చేస్తున్నారు. గ్రావెల్ పనులు తాత్కాలిక సచివాలయ పనులు పూర్తయ్యాక
తారురోడ్డు లేదా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఆ పనులు ప్రారంభం కావడానికి మరి కొన్నిరోజులు పట్టే   అవకాశం ఉంది. ప్రస్తుతం కురిసిన
వర్షాలకు సచివాలయ ప్రాంగణమంతా బురదగా మారింది.

 

  

కరెంటు కష్టాలు

తాత్కాలిక సచివాలయం పనులు పూర్తయ్యాక రోజుకు 6 ఎంవీఏ విద్యుత్ అవసరం అవుతుందని అంచనా. ఇందుకోసం విద్యుత్‌శాఖ
తాడికొండ, తాడేపల్లి నుంచి విద్యుత్ లైన్ పనులు ప్రారంభించింది. మొత్తం 42 కిలోమీటర్ల దూరం పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులు 50 శాతం మాత్రం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రాత్రింబవళ్లూ
కష్టపడుతున్నా 27 నాటికి పనులు పూర్తయ్యేలా లేవు.
నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రతి బ్లాక్‌లో పవర్ స్విచ్చింగ్ యూనిట్‌ను
నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన పనులు ఇంకా ప్రారంభం
కాలేదు.

 

డ్రైనేజీ సమస్య ఇబ్బందే

హైదరాబాద్ నుంచి తాత్కాలిక సచివాలయానికి వచ్చే
అధికారులు మొత్తం సుమారు 2వేల మంది
వరకు ఉండొచ్చని సమాచారం. వీరందరూ వినియోగించి వదలివేసే వృథానీరు, మురుగు వెళ్లటానికి భూగర్భ డ్రెయినేజీ, సెప్టిక్ ట్యాంక్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన
పనులేవీ ప్రారంభం కాలేదు. వర్షపు నీరు వచ్చినా వెలుపలకు వెళ్లే అవకాశం లేదు. ఈ
పనులు పూర్తి చేయాలంటే సుమారు నెలరోజులకుపైనే పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. 

 

నీటి కొరత కూడా

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది, కార్యాలయ అవసరాల కోసం రోజుకు 7 లక్షల
లీటర్ల నీరు అవసరం ఉంది. ఈ నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే విషయంపై ఇంతవరకు
అధికారుల్లో స్పష్టత లేదు. తుళ్లూరు ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ ద్వారా
తాత్కాలిక సచివాలయానికి తీసుకొస్తామని కొందరు అధికారులు చెబుతున్నారు. మరికొందరు
అధికారులు శాఖమూరు పెలైట్ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయనున్నట్లు
వెల్లడించారు. నీటి విషయంపై అధికారులు ఇప్పటివరకు స్పష్టత లేకపోతే సచివాలయ పనులు
పూర్తయినా ప్రయోజనం శూన్యమే. 

రియల్ ఎస్టేట్ కోసమే హడావుడి

తాత్కాలిక రాజధాని చుట్టు పక్కల
ప్రాంతాల్లో చంద్రబాబు బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాచుకొని ఉన్నారు.
తాత్కాలిక రాజధానిని అక్కడ ఏర్పాటు చేసుకొంటే తమ తమ వ్యాపారాల్లో బూమ్ వస్తుందని
అంచనా వేసుకొంటున్నారు. అందుకోసమే చంద్రబాబు ఒత్తిడి తెచ్చి మరీ రాజధానిని
తరలిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. 

 

Back to Top