ప్రతిపక్షం గొంతు నులుముతున్న సర్కార్

  • మార్చి 6నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • అంకెల గారడీతో బురిడీ కొట్టిస్తున్న బాబు
  • ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న చంద్రబాబు సర్కార్
  • సభలో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా కుట్రలు
  • ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు
ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మమ అనిపించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైందా..? రాజధాని అమరావతిలోని నూతన తాత్కాలిక అసెంబ్లీలోనైనా ప్రభుత్వం ప్రతిపక్షానికి వాయిస్ ఇస్తుందా..?  యథారాజ తథా ప్రభ అన్నట్టు మునుసపటి లాగే తన పంథా కొనసాగిస్తుందా..? ప్రతిపక్షం గొంతు నులిమేస్తుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు గతాన్ని చూసినవారెవ్వరైకైనా ఇదే సమాధానం వస్తుంది. గత  బడ్జెట్ సమావేశాలలో అన్ని రంగాలకు మొండిచేయి చూపించిన సర్కార్..ఈ సారైనా ప్రజలకు న్యాయం చేస్తుందా అన్నది సందేహాస్పదమే. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈమూడేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రతిసారి బడ్జెట్ లో అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టించడం, శాసనసభలో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా చేయడం, రాష్ట్రాన్ని దోపిడీ చేయడమే పనిగా పెట్టుకుంది తప్ప చంద్రబాబు సర్కార్ ఏనాడు  ప్రజల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు . సంవత్సరం పొడవునా కనీసం 30 రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలను జరపలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటేనే అర్థమవుతోంది. ప్రతిపక్షం వాయిస్ వినాలంటేనే చంద్రబాబు హడలిపోతున్నారు. కారణం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ మోసపూరిత, నిరంకుశ పాలనను ఎండగడుతుండడమే. 

మూడేళ్ల పాలనలో బాబు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.  ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లాగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం.  ప్రజాసమస్యలేవీ చర్చకు రాకుండా ప్రతిపక్షం గొంతు నొక్కడం. తమ అవినీతి, అరాచకాలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడం. తన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం టాపిక్ డైవర్ట్ చేయడం.  ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇచ్చే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా  స్పీకర్ పదే పదే మైక్ కట్ చేయడం.  అడుగడుగునా ఆటంకాలు సృష్టించడం. టీడీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రం గంటల కొద్ది మైక్ ఇచ్చి ప్రతిపక్ష నేతను తిట్టించడం ఓ తంతుగా ఏపీ అసెంబ్లీలో జరుగుతోంది.  ఇదేమని ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ ను ప్రశ్నిస్తే...స్పీకర్ పైనే దాడి చేస్తారా అంటూ అధికార టీడీపీ బురదజల్లడం. నిబంధనలకు విరుద్ధంగా వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం. ఇది  అసెంబ్లీ సమావేశాలకు ముందు, సభలో తన టీంకు చంద్రబాబు ఇచ్చే శిక్షణ. వైయస్ జగన్ ను పట్టుమని పది సెకన్ లు కూడా మాట్లాడనీయకుండా మంత్రులంతా లేస్తారు. బాబు డైరక్షన్ లో ప్రతిపక్షనేతను దూషించి నాటకాన్ని రక్తి కట్టిస్తారు. వీళ్లకు కావాల్సింది వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని, పార్టీని దెబ్బకొట్టడమే తప్ప ప్రజల బాగోగులు పట్టవు.  అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల గాథను వినిపించే ప్రతిపక్షాన్ని అణగదొక్కడం. వాయిదాల పర్వంతో చంద్రబాబు సర్కార్ సభను తూతూమంత్రంగా ముగించడమే లక్ష్యంగా పెట్టుకుంది.  

అసలే రాష్ట్ర విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు మరింత చీకట్లోకి నెట్టారు. అనుభవజ్ఞుడిని, నవ్యాంధ్ర అభివృద్ధి నాతోనే సాధ్యమంటూ  ఎన్నికల సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అమలుకు సాధ్యం కాని వందలాది హామీలు గుప్పించారు. రుణాలు మాఫీ కావాలన్నా, బ్యాంకుల్లో బంగారం రావాలన్నా బాబు ముఖ్యమంత్రి కావాలని ప్రకటనలు గుప్పించారు. బాబు రుణమాఫీ చేయని కారణంగా రైతులు, డ్వాక్రామహిళలు దారుణంగా మోసపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్న ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నాడు. జాబు రావాలంటే బాబు రావాలంటూ ఊదరగొట్టిన చంద్రబాబు..ఉద్యోగాలు ఇవ్వకపోగా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడు. ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిమాట తప్పాడు.  పక్కా ఇళ్ల ఊసే లేదు. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలన్నంటికీ తూట్లు పొడిచాడు.  అన్ని వర్గాల ప్రజలను వంచించాడు.  అంతేకాదు ప్రత్యేకహోదా పదిహేనేళ్లు కావాలి, హోదాయే సంజీవని అని ఎన్నికల్లో ఢంకా బజాయించారు. హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలన్నీ సాధిస్తామని బీరాలు పలికారు.  అలా మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను నమ్మించి  ఐదుకోట్ల ఆంధ్రులను వెన్నుపోటు పొడిచారు. హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి ఆంధ్రుల భవిష్యత్తును నాశనం చేశారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలు ఇచ్చి కొంటూ పట్టుబడిన చంద్రబాబు...కేసుల నుంచి తప్పించుకునేందుకు ఏపీ ప్రయోజనాలను ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టాడు.  

శాసనసభలో ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని చర్చకు రానీయకుండా చేసేందుకు మరోసారి బాబు తన మంత్రిగణానికి పాఠాలు నేర్పాడు. ఇదుకు క్యాబినెట్ ను వేదికగా చేసుకున్నారు. ప్రతిపక్ష నేతపై ఎలా బురదజల్లాలి, ఆయన వ్యక్తిత్వంపై ఎలా దాడి చేయాలన్న దానిపై క్యాబినెట్ సమావేశాలను బాబు వేదికగా మల్చుకోవడం సిగ్గుచేటు.  ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటాని పరిష్కరించేందుకు వేదికగా నిలిచిన శాసనసభ సంప్రదాయాలను బాబు నిలువునా మంటగల్పుతున్నారు. తప్పు చేసిన నిందితులను సభలో తన పక్కనే కూర్చోబెట్టుకొని సభ్యసమాజం తలదించుకునేలా చంద్రబాబు రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. ఏ తప్పు చేయని ప్రతిపక్ష నేత, సభ్యులపై నిందారోపణలు వేయడం...నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేయడం.  సభను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సభా కాలాన్ని వృథా చేయడం...ప్రతిపక్షం సభను సజావుగా సాగనీయలేదని ఓ బండ వేసి చేతులు దులుపుకోవడం బాబు అండ్ కోకు అలవాటుగా మారింది. 

మార్చి 6 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  కాకి లెక్కల బడ్జెట్ తో కాలక్షేపం చేస్తున్న చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం ఏమాత్రం లేదు. అందుకు కారణం మూడేళ్లుగా ప్రజలు బాబు తమను ఆదుకుంటారేమోనని కళ్లు కాయలుకాచేలా ఎదురుచూసి విసిగిపోయారు. ప్రజల బడ్జెట్ ప్రవేశపెట్టామంటూ మాయమాటలతో గారడీ చేసి మభ్యపెట్టడం తప్ప బాబు ఏమీ చేయడని ప్రజలకు అర్థమైపోయింది.  ఐనా, బాబు మళ్లీ తన అబద్ధాలతో మాయాజలాన్ని ప్రయోగించకమానడు.  నూతన  తాత్కాలిక అసెంబ్లీ భవనంలోనైనా ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రజల గొంతుక అయిన ప్రతిపక్షానికి మైక్ ఇచ్చి సభా సంప్రదాయాలను కాపాడాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రతిపక్షం వాయిస్ వినిపించకుండా స్పీకర్ పదే పదే మైక్ కట్ చేయడం తగదని, సభకు మకిలీ అంటకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అంటున్నారు. వైయస్సార్సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి  ఫిరాయించిన 21మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి స్పీకర్ పదవిని గౌరవించాలని సూచిస్తున్నారు.  
Back to Top