కాదేదీ కమీషన్‌కు అనర్హం

  •  ప్రాజెక్టుల పేరుతో  అడ్డగోలు సంపాదన 
  •  నీరుగారిపోతున్న భారీ ప్రాజెక్టులు 

ముఖ్యమంత్రి చంద్రబాబు ధనదాహానికి కాదేదీ అనర్హం అన్నట్టుగా మారిపోయింది. ఏ పని మొదలు పెట్టినా ఎంతొస్తుంది.. నా వాటా ఎంత..? అనే విధంగా పరిస్థితి మారిపోయింది. ఇసుక తవ్వకాల దగ్గర్నుంచి ఎయిర్‌పోర్టుల వరకు చంద్రబాబు అవినీతి ఏరులై పారుతోంది. ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా ముఖ్యమంత్రి అనేవారు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తారు. చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టులు పూర్తి చేసి గుర్తింపు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రులు ఆరాటపడటం కూడా సర్వసాధారణం. అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం దీనికి పూర్తి భిన్నం. పోలవరం లాంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్టులను పూర్తి చేసి గొప్ప పేరు తెచ్చుకోవడం పక్కనపెట్టి.. పెద్ద ప్రాజెక్టులైతే వచ్చే కమీషన్‌ ఎక్కువగా పొందవచ్చనే విపరీత ధోరణితో చంద్రబాబు వ్యవహరించడం బాధాకరం. అభివృద్ధి ముసుగులో రాబోయే ఎన్నికల కోసం చంద్రబాబు ప్రభుత్వం సంచులు నింపుకొంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే జపం చేస్తున్న అభివృద్ధి మంత్రం వెనుక గల అవినీతి కోణం రోజురోజుకు స్పష్టమవుతున్నది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన  నిర్ణయాలు ఇందుకు తాజా తార్కాణం. అర్హత పొందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియా ( ఏఏఐ) టెండర్‌ను రద్దు చేశారు. భావనపాడు ఓడరేవు నిర్మాణాన్ని మోడీ అనుంగు మిత్రుడైన అదానీ సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్‌ను మార్చి నవయుగ కంపెనీకి కొన్ని పనులు అప్పగిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వెనుక గల మర్మాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 

ముడుపుల కోసమే టెండర్‌ రద్దు!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్‌ను పోటీ బిడ్డింగ్‌లో ఏఏఐ సాధించుకుంది.  ఏఏఐతో పాటు రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జి.ఎం.ఆర్‌ గ్రూప్‌ దాఖలు చేసింది. చాలాకాలం తాత్సారం చేసిన ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో టెండరును 2017 ఆగస్టులో తెరిచారు. రెవెన్యూ వాటాగా 30.2 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తామని  ఏఏఐ పేర్కొనగా జి.ఎం.ఆర్‌. 21.6 శాతం మాత్రమే ఇస్తామంది. ఐదో తరగతి చదివిన పిల్లవాడికైనా  ఏఏఐ ప్రతిపాదనకే ప్రాజెక్టు ఇవ్వడం సబబుగా ఉంటుందని తెలుస్తుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణ పనిని ఏఏఐ చేపడితే అంతా పారదర్శకంగా జరుగుతుంది. ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతూ అనుబంధ ప్రతిపాదనలు చేయడం, వాటిని సర్కారుతో ఆమోదింప జేసుకోవడం వంటి అనుభవాలు కొత్తమీ కాదు. పోలవరం విషయంలోనే అంచనాలు నాలుగుసార్లు పెంచి 16 వేల కోట్ల నుంచి 58 వేల కోట్లకు చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. భోగాపురం టెండరును  ఏఏఐ నుంచి తప్పించడానికి ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం సాకులు వెదికినా ఏదీ దొరకక చివరకు దాన్ని రద్దు చేసింది.

ఏఏఐకు అర్హతులున్నా..

ప్రస్తుత టెండర్లను రద్దు చేసి,  ఎయిర్‌పోర్టుకు మాత్రమే కాక అనుబంధ పరిశ్రమలను, ఇతర వాణిజ్య కార్య కలాపాలను కలిపి కొత్త టెండరును పిలవనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే టెండరు పిలిచినప్పుడే ప్రభుత్వ రంగ సంస్థలను పాల్గొన నీయకుండా సాంకేతిక ఆటంకాలను సృష్టి్టంచే అవకాశం పుష్కలంగా ఉంది. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును నిర్మించి సకాలంలో అప్పగించడంలో ఏఏఐ సమర్ధతపై అనుమానా లున్నాయని పత్రికలకు మరో లీకులిచ్చారు. దేశంలోనే అత్యాధునికమైన ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల విస్తరణ, ఆధునీకరణ పనులను  ఏఏఐ స్వతంత్రంగాను, కొన్నింటిని జాయింట్‌ వెంచర్‌గాను చేపడుతున్నది. అంతేగాక మాల్దీవులు, యెమెన్, లిబియా, అల్జీరియా, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాల్లో విమానాశ్రయాల నిర్మాణాన్ని, ఆధునీకరణను  ఏఏఐ నిర్వహిస్తోంది. వీటన్నింటికీ సమర్ధత గలిగిన సంస్థ రాష్ట్ర పాలకులకు ఎందుకు నచ్చలేదో వేరుగా చెప్పనవసరం లేదు.

పోలవరం పల్టీలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. ప్రాజెక్టుకు కాఫర్‌డ్యాం అవసరమా కాదా,ఎంత ఎత్తున నిర్మించాలి వంటివి ఇంజనీర్లు తేల్చవలసిన అంశాలు. అలాగే కాంట్రాక్టు సంస్థలు చేసిన పని, వాటికి చెల్లించవలసిన నిధులను గురించి పరిపాలనా యంత్రాంగం నిర్ణయిస్తుంది. కానీ ఈ రెండు అంశాల చుట్టూనే రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్చ నడిపింది. పోలవరం ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చును చెల్లించవలసిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా ‘కాంట్రాక్టరును మార్చుకునే స్వేచ్ఛ మాకివ్వండి’ అనే రీతిలో సాక్షాత్తూ ముఖ్యమంత్రే కేంద్ర మంత్రితో చర్చించడం అవమానకరం. పోలవరం ప్రాజెక్టును ట్రాన్స్‌ట్రాయ్‌కి అప్పగించడంపై మొదట్నుంచీ ఆరోపణలు వెల్లువెత్తాయి. అవన్నీ పట్టించుకోకుండా తీరా గడువు ముంచుకొస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టింది. ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించి నవయుగకు పనులు అప్పగించాలని నిర్ణయించారు. అయితే అందుకు కేంద్రమంత్రి గడ్కరీ ఒప్పుకోకపోవడంతో అసెంబ్లీ వేదికగా పెద్ద డ్రామాకే తెరదీశాడు బాబు. పోలవరం సకాలకంలో పూర్తికాకపోవడం వెనుక బీజేపీని ముద్దాయిని చేయబోతున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే కేంద్రమంత్రి గడ్కరీ ఈ విషయాన్ని గుర్తించి కాంట్రాక్టర్‌ను మార్చడానికి ఒప్పుకోకుండా చంద్రబాబుకు చెక్‌ పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 
Back to Top