నిన్న వాలంటీర్లు.. నేడు రేషన్ వాహనాలు

చంద్ర‌బాబు వెన్నుపోటు రాజకీయాలు షురూ..

అమ‌రావ‌తి:  చంద్ర‌బాబు త‌న వెన్నుపోటు రాజ‌కీయాలు మొద‌లుపెట్టారు.  జగనన్న ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంటింటి రేషన్ పంపిణీ కి నారా చంద్ర‌బాబు కూటమి ప్రభుత్వం మంగళం పాడేందుకు సిద్ధ‌మైంది. గిరిజన ప్రాంత ప్రజలకు ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం మళ్లీ తిప్పలు తెస్తోంది. పెన్షన్ పంపిణీకి వాలంటీర్స్ ను దూరం చేస్తూ నిన్న కేబినెట్‌లో తీర్మానం చేశారు. నేడు ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు ఇక కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే.. రేషన్ షాప్స్ వద్ద మళ్లీ క్యూ లైన్లో తిప్పలు పడనున్న గిరిజనులు. గత ఐదేళ్లు గడప వద్దే జగనన్న ప్రభుత్వం అందించిన సేవలకి వరుసగా మంగళం పాడుతున్నారు.

అత్యంత కీల‌కం..వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌
ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్‌ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్‌గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివా­ల­యాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని సోమవారం మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హా­మీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీ­న్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధా­నంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యా­మ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. 

లక్షన్నర మంది విధుల్లోనే..
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణ ప్రాంతా­ల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున గతంలో 2.65 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వర్తించారు. ఎన్నికల కోడ్‌ అ­మ­లులోకి వచ్చిన తరువాత మినహా ఐదేళ్ల పాటు వలంటీర్ల సేవలు కొనసాగాయి. అనంతర పరిణామాల నేపథ్యంలో పలువురు రాజీనామాలు చేయగా ప్రస్తుతం లక్షన్నర మంది­కి పైగా విధుల్లో కొనసాగుతు­న్నారు.  అయితే పింఛన్ల పంపి­ణీతో పాటు ఇతర సాధారణ విధులు కూడా అప్ప­గించకుండా వారిని దూరంగా ఉంచడం ప్రశ్నార్థకంగా మారింది.

ఆగస్టు 14 ఆఖరి గడువు..
సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో నెలవారీ గౌరవ వేతనంతో పనిచేసే వారిని కొనసాగించేందుకు నిర్దిష్ట సమయంలో­గా ఎప్పటికప్పుడు అనుమతు­లు మంజూరు చేస్తారు. 2019 ఆగస్టులో ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు గడువు ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీతో ముగియనుంది. అనంతరం ఈ వ్యవస్థను కొనసాగించాలంటే ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది.  

వలంటీర్లకు బాబు వెన్నుపోటు! 
వలంటీర్లకు చంద్రబాబు తనదైన శైలిలో వెన్నుపోటు పొడిచారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ‘వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తూ.. వారికి నెలకు రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో బాబు హామీ ఇచ్చారు. అయితే జూలై 1న వలంటీర్లతో కాకుండా, సచివాలయ ఉద్యోగులతో పెన్షన్‌ పంపిణీ చేయాలని తాజాగా కేబినెట్లో నిర్ణయించారు. అంటే వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడే దిశగా నిర్ణయం తీసుకున్నారు’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విటర్‌)లో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోస్ట్‌ చేసింది. 

Back to Top