అప్పులాంధ్రప్రదేశ్

ఆదాయం అదఃపాతాళంలో ఉంది. అప్పులు ఆకాశానికెక్కుతున్నాయి. కాని ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధి చెందిపోతోంది. కంగారు పడకండి. అదంతే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాయాజాలమే ఇది.  అందినకాడికి అప్పులు తెచ్చి, ఆదాయాన్ని ఆడంబరాలకు ఖర్చులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు.  చివరికిప్పుడు తీరిగ్గా లెక్కలు కట్టుకుంటున్నారు. 

పైగా, అప్పులు చేయందే అభివృద్ధి ఎలా అంటూ ప్రశ్నించారు వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఆర్థిక మంత్రిగారైతే అప్పుల మీద బతికేస్తున్నాం అంటూ దర్జాగా చెప్పేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 16వేల కోట్ల ఆర్థిక లోటు ఉంది. ఇప్పుడది 20వేల కోట్లకు చేరింది. ఇక అప్పులైతే ఏకంగా లక్షా ఇరవై రెండు వేల కోట్లకు చేరాయి. ఆర్థికంగా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఎపి ఉన్నదన్నది సుప్పష్టం.

ఇక నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా అప్పులు తేవడమే కాక, అనవసర వ్యయాలు కూడా ఉండటంతో కేంద్రం నుంచి టిడిపి ప్రభుత్వానికి ఒత్తిడి కూడా ఎక్కువైంది. ఉత్పాదక రంగాలు, ఆదాయాన్నిచ్చే వాటిపై, ఆస్తుల కల్పనలపై ఏమాత్రం ఖర్చు చేయకుండా, అనుత్పాదక రంగంపై అధికంగా ఖర్చులు పెట్టడంతో, అప్పులు బారెడు, ఆస్తులు మూరెడు అయ్యింది పరిస్థితి. 

ఈ ఆర్థిక సంవత్సరంలో 16,100 కోట్ల అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవి కాక 2800 కోట్లు నాబార్డు నుంచి కూడా రుణాలు తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 23000 వేల కోట్ల అప్పును బడ్జెట్ లో ప్రతిపాదించారు. అయితే ఆరు నెలల వ్యవధిలోనే అప్పులు ఎక్కువగా తీసేసుకోవడంతో, 14వ ఆర్థిక సంఘం నిబంధనలను మించి అప్పులు పెరిగిపోయాయి. ప్రస్తుతం మరో 4000వేల కోట్లు విడుదల చేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రాన్ని కోరింది. కాని కేంద్రం నిర్మొహమాటంగా తిరస్కరించింది. గత రెండేళ్లతో పాటు ఈ ఏడాదికి సంబంధించి  రాష్ట్ర స్థూల ఉత్పాదకత, అప్పుల వివరాలూ  పంపాలని, ఆ తర్వాతే మిగిలిన అప్పు గురించి ఆలోచిద్దామంటూ చెప్పేసింది. 

Back to Top