కాంగ్రెస్ కు కలత నిద్ర

చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నాడట వెనకటికో ఆసామీ.  దాంతోనూ ఉపశమనం రాక బిగ్గరగా ఏడుస్తున్న అతణ్ణ్ని చూసిన ఓ ఇల్లాలు గబగబా నవనీతం(సున్నపు తేట, కొబ్బరినూనెల మిశ్రమం) తయారుచేసి బొబ్బలకు రాసుకోమని ఇచ్చిందట.

రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని గట్టెక్కించడానికి సోనియా గాంధీ ప్రస్తుతం ఇలాంటి చిట్కానే ప్రయోగించదలిచారు. వివిధ సమస్యలనుంచి పుట్టిన నిప్పు జ్వాలాగా మారడంతో ఒళ్ళంతా బొబ్బలు తేలిన పార్టీని చూసి, ఆమె ముందు ప్రాథమిక చికిత్స చేస్తే తప్ప మనుగడ కష్టమనే నిర్ణయానికొచ్చేశారు. తెలంగాణ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాల్సి ఉంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలలో మనుగడ కష్టమనే సంగతి అర్థమైపోయింది. ఇదెప్పుడో తేలినా.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ  చదరంగం ఆడుతున్నట్లు ఎత్తులు వేస్తూ  ఇంతవరకూ ఆటను నెట్టుకొచ్చింది. వైయస్ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన రెడ్డి రూపంలో ఎదురైన చెక్‌ను ఎదుర్కోవడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు అంకానికి తెరలేపింది.

నేత కోసం అన్వేషణ
రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చే నాయకుడి కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుందని కూడా యోచిస్తోంది. రాహుల్‌కు ప్రధాని పట్టాభిషేకం కావాలంటే కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టు కోల్పోకూడదనే విషయం వారి స్ఫురణలో ఉండడమే దీనికి ముఖ్య కారణం. తెలంగాణ ప్రాంతానికి చెందిన సూదిన జైపాల్‌రెడ్డికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెడితే ప్రస్తుతానికి ఆ అంశం మరుగునపడటమే కాక, పార్టీ నేతలను ఏకతాటిపై నిలపగలరని సోనియా భావిస్తున్నారు. మంచి కల వస్తే ఎప్పుడూ కమ్మగానే ఉంటుంది. చెడ్డ కలవస్తే కలత నిద్రవుతుంది.  ముళ్ళబాటలా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తే ఆయన అంగీకరిస్తారా అనేదే అసలు ప్రశ్న. 70 ఏళ్ళు దాటిన వయసులో బాధ్యత నెత్తినెత్తుకుంటే, రాబోయే ఏడాదిన్నరలో రాష్ట్రమంతటా తిరిగి పార్టీని పటిష్ట పరచగలరా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. గతంలో ఓ సారి ఈ ప్రతిపాదనను జైపాల్ తిరస్కరించిన సంగతిని అధిష్ఠానం మరిచి ఉంటుందని భావించలేం. ఈ నేపథ్యంలో మళ్ళీ అడిగి భంగపడటం ఎందుకులే అనుకుని ఊరుకునే పరిస్థితి అసలే కాదు. 

కోట్ల.. ఓ ఉదాహరణ
ఇక్కడ కోట్ల విజయభాస్కరరెడ్డి అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంది. ఇంచుమించుగా జైపాల్ రెడ్డి వయసులోనే ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికలను ఎదుర్కొన్నారు. కానీ, అధికారం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి బదిలీ అయిపోయింది. ఇదే పరిస్థతి తనకు ఎదురవుతుందని జైపాల్‌ సైతం భావించడం సహజం. ఎందుకంటే 'గెలిస్తే నా గొప్ప ఓడితే నీ తప్పు' అనే విధానాన్ని అవలంబించే పార్టీలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. కొన్నేళ్ళలో రాజకీయాలనుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుందామని యోచిస్తున్న ఆయన ఈ భారాన్ని మోసేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు. తెలంగాణ అంశమే లేకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనేది వారి భావన.  ముఖ్యమంత్రి మార్పు గురించి తామసలు ఆలోచించడమే లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గులాం నబీ ఆజాద్ చెప్పడం దీనికి కొసమెరుపు.

మూడు అంశాలపై పరిశీలన

తెలంగాణ సమస్య నుంచి బయట పడడానికి పార్టీ మూడు అంశాలను తీవ్రంగా పరిశీలిస్తోంది. తెలంగాణ అభివృద్ధి మండలిని నెలకొల్పి ఆ ప్రాంతానికి సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచడం,   తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం, లేదా ప్రస్తుత మంత్రివర్గాన్ని తెలంగాణ నేతను ముఖ్యమంత్రిగా చేసి నడిపించడం పరిశీలనలో ఉన్నాయి. మూడో అంశాన్ని ఆచరించడం చాలా ప్రమాదమనే అభిప్రాయంలో పార్టీ ఉంది. దీనిబదులు తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలు కె. జానారెడ్డి, డి. శ్రీనివాస్, మర్రి శశిధర్‌రెడ్డి, ఎస్. జైపాల్‌రెడ్డిలలో ఒకరిని ముఖ్యమంత్రిగా కొత్త కేబినెట్‌ను ఏర్పాటుచేయాలనేది భావన. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తామంటేనే ముఖ్యమంత్రి బాధ్యతను తలకెత్తుకుంటానని జానారెడ్డి తన అనుయాయులతో చెప్పినట్లు సమాచారం.  ఇక డి. శ్రీనివాస్ అంశానికొస్తే అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య తమిళనాడు గవర్నరుగా నియమితులైన అనంతరం ఆయన స్థానంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పార్టీలోని అన్ని వర్గాలనూ ఆకట్టుకోగలరనే పేరుంది. మర్రి శశిధరరెడ్డి చాలా కాలంగా తెరవెనుకే ఉంటున్నారు. బాధ్యతలప్పగిస్తే ఎంతమంది కార్యకర్తలను ఆకట్టుకోగలరనేది అనుమానాస్పదమే.  ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి జైపాల్ నుంచి పొంచి ఉన్న ముప్పును ముందే ఊహించారు. కేజీ బేసిన్‌లో ఉత్పత్తయిన గ్యాస్‌ను మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాజెక్టుకు తరలించడాన్ని ఆయుధంగా మలచుకుని పావులు కదిపి విజయం సాధించారు.

Back to Top