ప్రజల్ని ఛార్జీల రూపంలో బాదాలంటే చంద్రబాబు ప్రభుత్వం కొత్త కొత్త మార్గాలు వెదకుతూనే ఉంటుంది. గత కాలంలో 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు మళ్లీ తన రికార్డుల్ని తానే తిరగరాసుకొనే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రవేశ పెట్టిన ఉదయ్ స్కీమ్ ను మార్గంగా చేసుకోబోతున్నారు. ఈ విధానం ప్రకారం చూస్తే మూడు నెలలకోసారి డిస్కమ్‌ల లాభనష్టాలను సమీక్షించడం తప్పనిసరి. ఈ కాల వ్యవధిలో నష్టాలను చవిచూస్తే, దాన్ని వెంటనే రాబట్టాలి. అన్ని రకాల నష్టాలను అప్పటికప్పుడే లెక్కించి వినియోగదారుల నుంచి రాబట్టు వీలుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. తదుపరి మూడు నెలల కాలంలో వచ్చే విద్యుత్ బిల్లుల్లో ఈ భారం పడుతుందని వారు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం ఎక్కువ మొత్తం వెచ్చించినా దాన్ని మూడు నెలల్లోనే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే విద్యుత్ వినియోగదారులపై మూడు నెలలకు ఒకసారి భారం పడే అవకాశం ఉంది. నష్టాల భర్తీని పూడ్చుకోవడానికి రుణ విముక్తి పొందడానికి వాటికున్న రూ. 11వేల కోట్ల అప్పుల్లో 75 శాతానికి రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు విడుదల చేస్తుంది. విద్యుత్ పంపిణీ సంస్థలపై తిరిగి రుణభారం పడకూడదనేది ఉదయ్ పథకం ముఖ్యోద్ధేశం. ఏది ఏమైనా ప్రజల్ని బాదేందుకు అనువుగా ఉన్న పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం స్వీకరించటం గమనార్హం.