బాబు పత్యేక విమాన ప్రయాణాల ఖర్చు 16 కోట్లు

చంద్రబాబు విమానయాన ఖర్చు రూ. 16 కోట్లు
విదేశాలకూ ప్రత్యేక విమానమే..!

హైదరాబాద్: ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దేశ రాజధాని న్యూఢిల్లీకి మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలంటే రెగ్యులర్ విమానాల్లోనే ప్రయాణిస్తారు. సాధారణంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి మాత్రమే అధికారిక ప్రయాణాలకు ప్రత్యేక విమానాలు ఉపయోగిస్తుంటారు. సీఎం చంద్రబాబు మాత్రం సింగపూర్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లి రికార్డు సృష్టించారు. అయితే కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోకగజపతిరాజు ఉన్నందునే ఇది సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీకి చెందిన క్లబ్-1 ప్రత్యేక విమానంలో చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. విమాన చార్జీల కింద అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అర కోటి రూపాయలు చెల్లించింది. చంద్రబాబు ఎక్కువగా నవయుగ, కృష్ణపట్నం, జీవీకే, జీఎంఆర్ సంస్థలకు చెందిన తొమ్మిది, పదిహేను సీట్లు గల ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ప్రత్యేక విమానాల్లో ప్రయాణించినందుకు గానీ వాటి చార్జీల కింద 16 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు ప్రభుత్వం లెక్క తేల్చింది. ఇందుకు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో ఈ 16 కోట్ల రూపాయలకు అదనంగా బడ్జెట్ కేటాయించాల్సిందిగా ఆర్థికశాఖను ప్రభుత్వం కోరింది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఈ రూ. 16 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి నేడో రేపో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేయనున్నారు.

నెలకు రూ. 2 కోట్లు చొప్పున...

ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు పూర్తయింది. ఈ లెక్కన చంద్రబాబు నెలకు రెండు కోట్ల రూపాయలు ప్రత్యేక విమానాల చార్జీలకు ఖర్చు చేశారన్నమాట. ఇప్పటివరకు చంద్రబాబు 8 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ ఎనిమిది సార్లూ ప్రత్యేక విమానాల్లోనే వెళ్లొచ్చారు.
ఇటీవల ఛత్తీస్‌గఢ్ పర్యటనకు చంద్రబాబు ఏకంగా మూడు ప్రత్యేక విమానాలను వినియోగించారు. నవయుగకు చెందిన విమానంలో చంద్రబాబు, ఆయన పేషీ అధికారులు వెళ్లారు. పోలవరం కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ సమకూర్చిన ప్రత్యేక విమానంలో పారిశ్రామికవేత్తలు వెళ్లగా.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సమకూర్చిన మరో విమానంలో అధికారులు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జన్మభూమి, రైతు సాధికారిత సదస్సులతో పాటు ఇతర కార్యక్రమాల నిమిత్తం అన్ని జిల్లాల పర్యటనలకు కూడా ప్రత్యేక విమానాల్లోనే వెళ్లారు. ఆఖరికి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలకు రోజూవారి రెగ్యులర్ విమానాలు నడుస్తున్నప్పటికీ వాటిల్లో కాకుండా ప్రత్యేక విమానాల్లో వెళ్లారు.

‘పొదుపు’ పాఠం.. మంత్రులు, అధికారులకే...
ఒకపక్క రాజధాని కోసం ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తూ మరోపక్క కోట్ల రూపాయలను ప్రత్యేక విమానాలకు వెచ్చించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మంత్రులు, అధికారులు పొదుపు చర్యలు పాటించాలని ఒకపక్క ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. స్వయంగా ముఖ్యమంత్రే ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అవసరం లేకపోయినా ప్రత్యేక విమానాల్లో విహరించడం పట్ల ఉన్నతస్థాయి అధికారవర్గాలూ ముక్కున వేలేసుకుంటున్నాయి. ప్రత్యేక విమానాల్లో వెళ్లడం అక్కడి నుంచి మళ్లీ ప్రైవేట్ హెలికాప్టర్లలో వెళ్లడం చంద్రబాబుకు నిత్యకృత్యంగా సాగిపోతోంది.

జూన్:  విజయవాడ, విశాఖపట్నం
జూలై: విజయవాడ, తిరుపతి, పుట్టపర్తి, విజయవాడ, విశాఖ
ఆగస్టు: విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి
సెప్టెంబర్: విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం,  రాయపూర్, తిరుపతి, విజయవాడ
అక్టోబర్ : విజయవాడ, రాజమండ్రి, పుట్టపర్తి, విజయవాడ,తిరుపతి, విశాఖపట్నం- హైదరాబాద్, విజయవాడ-రాజమండ్రి, ముంబై
నవంబర్: విజయవాడ, బెంగళూరు, తిరుపతి,  న్యూఢిల్లీ, తిరుపతి, న్యూఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, సింగపూర్, విజయవాడ, న్యూఢిల్లీ, అహ్మదాబాద్
డిసెంబర్: రాజమండ్రి, విశాఖపట్నం, న్యూఢిల్లీ, తిరుపతి-చిత్తూరు, విజయవాడ- తిరుపతి, విశాఖపట్నం, విశాఖపట్నం, విజయవాడ, విజయవాడ, అహ్మదాబాద్, న్యూఢిల్లీ
జనవరి: విజయవాడ, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, విశాఖపట్నం-తిరుపతి-న్యూఢిల్లీ, విశాఖపట్నం, రాజమండ్రి-విజయవాడ, విజయవాడ
ఫిబ్రవరి (8 వరకు):  విజయవాడ, న్యూఢిల్లీ, న్యూఢిల్లీ

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజూవారి నడుస్తున్న విమానాలు
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రధానంగా ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్‌కోస్టా వంటి సంస్థలు ప్రముఖ నగరాలకు రోజూవారీ విమాన సర్వీసులు నడుపుతున్నాయి. వారాంతాల్లో, కొన్ని ఇతర సందర్భాల్లో మినహాయిస్తే సగటున ఈ సంస్థలన్నీ కలిపి హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు రోజూ నడిచే విమాన సర్వీసులు ఇలా ఉన్నాయి..

నగరం         సర్వీసులు    నగరం    సర్వీసులు
ఢిల్లీకి              19         విజయవాడ    7
బెంగుళూరు     20         తిరుపతి         5
ఆహ్మదాబాద్   2         విశాఖపట్నం    6

ప్రజా ధనంపై నియంత్రణ ఏదీ.?

  • రాష్ట్ర అవసరాలకు, ఉద్యోగుల జీతాలకు ఖాజానాలో చిల్లిగవ్వ లేదంటున్న చంద్రబాబు ఆయన వ్యవహారాల్లో మాత్రం ఖర్చును నియంత్రించడం లేదని గత సంఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి
  • ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల రూ.16 కోట్లు  
  • ఇటీవల చంద్రన్న కానుక పేరిట సంక్రాంతి సరుకులను పేదలకు తక్కువ ధరకే అందించే పథకానికి హడావుడిగా శ్రీకారం చుట్టారు. నెయ్యి కోసం టెండర్లు పిలవకుండా ఏకపక్షంగా మార్కెట్ ధర కన్నా ఎక్కువ రేటుకు సొంత కంపెనీ హెరిటేజ్‌కు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఇందుకోసం ప్రజా ఖజానాపై పడిన భారం రూ. 26 కోట్ల రూపాయలు. ఈ విషయంలో బాబు వ్యవహరించిన తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.  మార్కెట్‌లో చవక ధరకు లభిస్తుండగా ఎక్కువ ధరకు అదికూడా ప్రజల సొమ్ముతో కొనే హక్కు ఎవరు ఇచ్చారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.                           
Back to Top