హరికృష్ణ దయవల్లే  చంద్ర‌బాబు సీఎం అయ్యారు

 వైయ‌స్ఆర్‌సీపీ నేత నార్నే శ్రీ‌నివాస‌రావు 

తమ్ముడి ఎదుగుదలను చంద్రబాబు ఓర్వలేకపోయారు

 హరికృష్ణ కుమార్తెకు ఓడిపోయే సీటిచ్చి మోసగించారు.

అమరావతి : ‘స్వార్థానికి చంద్రబాబు పరాకాష్ట. సొంత తమ్ముడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు. చంద్రబాబును నమ్మి తమ్ముడు రామ్మూర్తి  పిచ్చివాడైపోయాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత నార్నే శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. ఆయనను తాళ్లతో కట్టి గదిలో బంధించింది వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు. ఓ మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీలోకి వలసొచ్చిన బాబు ఈ రోజు ఆ పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టుపెడుతున్నారు. ఆయన  సీఎం అయ్యారంటే హరికృష్ణ దయవల్లే. అలాంటి కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారు. హరికృష్ణ కుమార్తెకు ఓడిపోయే సీటిచ్చి మోసగించారు.

సుహాసినిని మంగళగిరిలో పోటీకి ఎందుకు నిలబెట్టలేదు. వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేక కేసీఆర్, మోదీతో సంబంధాలు అంటగడుతూ ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. వైఎస్సార్‌ ప్రజల కోసం ఎంతో అద్భుతంగా పనిచేశారు.  జగన్‌ కూడా అదేవిధంగా చేస్తారనే నమ్మకంతో వైఎస్సార్‌సీపీలో చేరా.  జగన్‌ను సీఎం చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను’ అని ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ, వైఎస్సార్‌సీపీ నాయకుడు నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పలు సంచలన విషయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే..       

తన ఎదుగుదల కోసం ఏదైనా చేస్తారు
చంద్రబాబును చాలా ఏళ్లు దగ్గరనుంచి చూశాను. స్వార్థం తప్ప వేరే ఆలోచనే లేని ఆయన మనస్తత్వం నాకు తెలుసు. బాబు వల్ల రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగదు. 1998లో నన్ను పిలిచి చిలకలూరిపేట నుంచి పోటీ చేయమని చెప్పారు. ఆ రోజుల్లోనే రూ.కోటి ఖర్చుపెట్టి, రెండేళ్లు అక్కడే ఉండి కష్టపడ్డా. చివరి నిమిషంలో టికెట్‌ ఇవ్వలేదు. బంధువులు అభివృద్ధి చెందడాన్ని చంద్రబాబు సహించలేరు. తన ఎదుగుదల కోసం ఏదైనా చేస్తాడు. ఎవరికి ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా రెడీ. ఆయనొక మర్రిచెట్టు. తన కింద ఎవరినీ ఎదగనివ్వరు. 
 
అన్న మోసంతో రామ్మూర్తి కుంగిపోయారు 
చంద్రబాబు తమ్ముడు  రామ్మూర్తినాయుడు 1994లో అసెంబ్లీ టికెట్‌ కావాలని ఎన్టీఆర్‌ను అడిగారు. అయితే రామ్మూర్తికి టికెట్‌ ఇవ్వొద్దని ఎన్టీఆర్‌కు చంద్రబాబు చెప్పారు. దీంతో మనస్తాపం చెంది రామ్మూర్తి వెనక్కి వెళ్లిపోతే.. లక్ష్మీపార్వతీ పట్టుబట్టి ఆయనకు బీఫాం ఇప్పించారు. ఆ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి రామ్మూర్తి ఎమ్మెల్యే అయ్యారు. రామ్మూర్తికి అన్న చంద్రబాబు అంటే చాలా అభిమానం. అయితే 2004లో అన్న తనను మోసంచేసి టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా నిలబడి ఓడిపోయారు.  

అన్న మోసం చేయడంతో మతిస్థిమితం కోల్పోయారు. ఈ రోజు ఆయన దారుణమైన స్థితిలో ఉన్నారు. చంద్రబాబు ఎక్కడికెళ్లినా తమ్ముళ్లు అని అంటుంటారు. అయితే ఆయన సొంత తమ్ముడు ఎక్కడున్నారు? నీ తమ్ముడిని తాళ్లతో కట్టేసి రూంలో పడేయలేదా? రామ్మూర్తినాయుడు బాగానే ఉంటే బయటకు తీసుకొచ్చి చూపించమనండి.  దాదాపు 7–8 ఏళ్లుగా రామ్మూర్తినాయుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు. కేవలం అన్న చంద్రబాబును నమ్మి ఆయన పిచ్చివాడైపోయారు. తమ్ముడు నానా కష్టాలు పడి చంద్రబాబు ఖర్చులకు డబ్బులు పంపితే.. చివరకు ఆయనను ఈ స్థితికి తీసుకొచ్చారు.  

కాంగ్రెస్‌కు టీడీపీని తాకట్టు పెడుతున్నారు 
టీడీపీకి చంద్రబాబు వలసొచ్చారు. కాంగ్రెస్‌ వ్యతిరేకతతో పుట్టిన పార్టీ టీడీపీని అదే పార్టీకి  తాకట్టుపెడుతున్నారు. అది భరించలేక ఈ రోజు బయటకొచ్చాను. చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని, జగన్‌ను గెలిపించాలని వైఎస్సార్‌సీపీలో చేరా. జగన్‌ను ఏపీ ప్రజలు తప్పకుండా సీఎంగా చూస్తారు. చంద్రబాబు తన అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తులు రూ.700 కోట్లకు పైగా చూపించారు. అంత ఆస్తి ఉన్న ఆయనకు తమ్ముడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించే స్తోమత లేదా? ఈ రోజు చంద్రబాబు సీఎం అయ్యారంటే అది హరికృష్ణ భిక్ష. హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరావు, బాలకృష్ణ కలిసి సీఎం చేశారు. హరికృష్ణ కుటుంబాన్ని వాడుకుని వదిలేశారు. దగ్గుబాటి అప్పట్లో వేరే పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? వాడుకోవడం, వదిలేయడం చంద్రబాబు నైజం. నన్ను, జూ.ఎన్టీఆర్, హరికృష్ణను ఇలాగే వదిలేశారు.  

హైదరాబాద్‌ నువ్వు కట్టావా? 
హైదరాబాద్‌ను నేనే కట్టానని చంద్రబాబు పదేపదే చెపుతున్నారు. రాజధానిగా 70 ఏళ్ల హైదరాబాద్‌ చరిత్రలో చంద్రబాబు 8 ఏళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. వైఎస్సార్‌ ఐదున్నరేళ్లకు పైగా, కేసీఆర్‌ దాదాపు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. ఎయిర్‌పోర్ట్, ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్‌ రింగ్‌రోడ్డు ఇలా ఎన్నో రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించారు. వేల మంది కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేస్తే హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి  నిర్మాణం జరిగింది. అందరు సీఎంలు కష్టపడితే ఈ రోజున్న హైదరాబాద్‌ తయారైంది. ఇప్పుడు అమరావతిని సింగపూర్‌ చేస్తానంటున్నావు. నువ్వు చెప్పిన పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఎక్కడ? నీ డబ్బా మీడియాతో ప్రచారం చేసుకుంటున్నావు. ఇంకో 20 ఏళ్లు అవకాశమిచ్చినా అమరావతిలో చంద్రబాబు ఏమీ చేయలేరు.

మంగళగిరిలో లోకేష్‌ ఓటమి ఖాయం
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మొదట ఓడిపోయే నియోజకవర్గం లోకేష్‌దే. అక్కడ ఆర్కే గెలవడం ఖాయం. మేము ఆ నియోజకవర్గంపై దృష్టిపెట్టాం. అక్కడ లోకేష్‌ విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. ఐదేళ్లుగా ఆర్కే మంగళగిరి ప్రజలకు ఏం చేశారో అందరికీ తెలుసు. అంకితభావంతో ఆయన చేసిన పనులే గెలిపిస్తాయి.   

8 ఏళ్లు జగన్‌ ప్రజల మధ్యే ఉన్నారు 
ఈ 10 ఏళ్లలో వైఎస్‌ జగన్‌ 8 ఏళ్లు జనం మధ్యే ఉన్నారు. ఆయన నెలకు 2, 3 రోజులే కుటుంబంతో గడిపారు. చంద్రబాబు ఇప్పుడు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఇస్తానంటూ పార్టీ నాయకులను మోసగించడం చంద్రబాబుకు చాలా సులభం. నాకు కూడా రాజ్యసభ ఇస్తానన్నారు. అలా దాదాపు 300 మందికి హామీనిచ్చారు. నేనైతే వద్దని చెప్పాను. ఎప్పుడూ సీఎంగా ఉండడమే చంద్రబాబు లక్ష్యం. కొడుకంటే పిచ్చి ప్రేమ. తన వారసుడిగా లోకేష్‌కు పట్టంగట్టడమే ఆయన టార్గెట్‌. ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు చంద్రబాబును నమ్మారు. చివరకు వాళ్లకు చుక్కలు చూపించారు. సొంత తమ్ముడినే పట్టించుకోలేదు. ఇక బంధువులకు ఏం సాయం చేస్తారు. పదవే ఆయన బంధువు. నా కొడుకు, నేను బాగుండాలి అనే మనస్తత్వం చంద్రబాబుది. 

మోహన్‌ బాబు నోరు తెరిస్తే.. 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం కాలేజీ పిల్లలతో కలిసి మోహన్‌బాబు రోడ్డుపైకి వచ్చారు. టీడీపీ వాళ్లు ఆయనను బెదిరిస్తున్నారు. చంద్రబాబు, మోహన్‌బాబులది పక్క పక్క ఊర్లే. రామారావు దగ్గర చంద్రబాబు, లక్ష్మీ పార్వతి ఉన్నప్పుడు మోహన్‌ బాబు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో మొత్తం ఆయనకు తెలుసు. మోహన్‌బాబు నోరు తెరిస్తే బాబు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. 

తిమ్మిని బమ్మిని చేయడంలో దిట్ట 
వై.ఎస్‌.వివేకానందరెడ్డి చనిపోయి ఆ కుటుంబం దుఃఖంలో ఉంటే చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. వాళ్ల కుటుంబంపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ పోలీసులపై నమ్మకం లేదని సీబీఐతో విచారణ చేయించాలని వివేకా కుమార్తె ఢిల్లీ వరకూ వెళ్లారు. అయితే బాబు మాత్రం తన ఎన్నికల ప్రచారంలో విషం కక్కుతున్నారు. ఆయన తిమ్మిని బమ్మిని చేసి సంబంధం లేని వారిపై నేరం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. వారికి రూ. 40 వేలు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు ఎన్నికల సమయంలో రూ. 5 వేలు ఇచ్చి మోసం చేస్తున్నారు. జగన్‌ నవరత్నాలు ప్రకటించాక.. భయంతో ఎన్నికలముందు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు.  ఐదేళ్ల క్రితం ఎన్నో చేస్తామని ఆయన పదవి ఎక్కారు. ఇప్పుడు నవరత్నాల్ని కాపీకొడుతున్నారు. కుల పిచ్చి, గజ్జి ఉంది చంద్రబాబుకే. వైఎస్‌ జగన్‌ చేసేదే చెబుతారు. అమలు చేయలేనివి అసలు చెప్పరు. చంద్రబాబు అన్ని చెబుతారు కానీ ఏమీ చేయరు. కేవలం వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడానికే పార్టీలోకి వచ్చా. దీని తర్వాత రాజకీయాల్లో కొనసాగను.  

జగన్‌ను ఎదుర్కోలేక కేసీఆర్‌ పేరును తెరపైకి తెస్తున్నారు
వైఎస్సార్‌ అందరినీ తన కుటుంబం అనుకున్నారు. చంద్రబాబు మాత్రం ఎవరినీ తన కుటుంబంగా చూడలేరు. ఏపీ ప్రజల్ని తనవారిగా ఎప్పుడూ భావించలేదు. జగన్‌ను ఎదుర్కోలేక పక్క రాష్ట్రం సీఎం పేరును పదేపదే తెరపైకి తెస్తున్నారు. మోదీకి జగన్‌కు సంబంధముందని చెపుతున్నారు. నాలుగేళ్లు మోదీతో కలిసి కాపురం చేసింది ఎవరు.?    కేసీఆర్‌ అనే పదం బూచిగా చూపి ఏపీ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయాలనుకుంటున్నారు. జనాల దగ్గర నుంచి ఓట్ల దండుకోవడానికి నాటకాలాడుతున్నారు. జనం చంద్రబాబును నమ్మరు.  తెలంగాణలో 60 లక్షల మంది సెటిలర్లు ఉండగా.. ఎవరికైనా ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడిందా? ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు.? 

హరికృష్ణ కుమార్తెకు అన్యాయం చేశారు 
హరికృష్ణకు అన్యాయం చేశారని అందరూ అనేసరికి.. ఆయన కుమార్తెను తీసుకొచ్చి ఓడిపోయే సీటులో కావాలనే నిలబెట్టారు.  మంచి చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోనే టికెట్‌ ఇచ్చేవాడు కదా. హరికృష్ణపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆమెను మంగళగిరిలో నిలబెట్టవచ్చు కదా. నీ కొడుకునెందుకు నిలబెట్టాలి. సుహాసినికి హైదరాబాద్‌తో సంబంధం లేదు. ఆమె పెళ్లి చేసుకుని రాజమండ్రి వెళ్లిపోయింది. ఆమెకు ఆంధ్రలో సీటివ్వాలి కానీ హైదరాబాద్‌లో ఎందుకిచ్చారు. ఇవ్వన్నీ దొంగ ట్రిక్కులు. ఇలాంటివి చంద్రబాబు దగ్గర చాలా చూశా.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top