చంద్రబాబూ! మేము రాము నీ కోసం!!

చంద్రబాబు తలపెట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర కార్యక్రమానికి ఎదురుదెబ్బ. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మేము రామని తేల్చేశారు. పార్టీ వీడి పోవద్దంటూనే తమ మీద దుష్ర్పచారం చేయడం, పొగబెట్టే చర్యలకు తెర లేపడంతో టీడీపీతో తెగదెంపులు చేసుకునేందుకే వీరు మొగ్గు చూపుతున్నారు.

చంద్రబాబు పాదయాత్రకు ముందు అమర్, ప్రవీణ్ ఎగుర వేసిన తిరుగుబాటు జెండా పార్టీ అధినేతకు తీవ్ర ఆందోళన కలిగించింది. నేరుగా అధినేతనే తిట్టిపోసి, పార్టీ సర్వనాశనం కావడానికి ఆయనే కారణమని వారు ధ్వజమెత్తారు. క్రమశిక్షణ చర్యలకింద ఇద్దరికీ షోకాజ్ నోటీసు ఇచ్చి వేటు వేయాలని పార్టీ నాయకత్వం తొలుత భావిం చింది. పాదయాత్ర సమయంలో ఈ పరిణామాలు మరింత ఇబ్బందులకు దారితీస్తాయనే భయంతో షోకాజ్ విషయంలో వెనకడుగు వేశారు. పార్టీ కార్యకర్తలు వీరితో వెళ్లకుండా చేయడంతో పాటు, ప్రజల్లో వీరిపట్ల చెడు అభిప్రాయం కల్పించేందుకు చర్చల రాజకీయానికి తెర లేపా రు. ఇంత జరిగినా తాము వారిని పార్టీలోనే ఉండమంటున్నామని పైకి చెప్పుకుంటూ, పరోక్షంగా ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు మహదేవనాయుడు మూడు రోజుల కిందట ఎమ్మెల్యే లిద్దరినీ కలిసే యత్నం చేసినట్టు చెప్పుకున్నారు.

అమరనాథరెడ్డికి ముందుగా చెప్పకుండా పలమనేరుకు వెళ్లిన వారు కాసేపు పార్టీ ఆఫీసులో కూర్చుని వెనుతిరిగారు. ఆయన తమను రమ్మని చెప్పి బెంగళూరుకు వెళ్లారనే లీకులు ఇప్పించారు. అదేరోజు సాయంత్రం అమరనాథరెడ్డి పలమనేరులో వినాయక విగ్రహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్ హైదరాబాదులో ఉన్నారనే విషయం తెలిసినా ఆయన ఇంటికి వెళ్లి ఆయన తల్లితో మాట్లాడి బాబు పాదయాత్రకు ఆహ్వానించారు. ఒకవైపు ఈ పని చేస్తూనే మరో వైపు పలమనేరులో పట్నం సుబ్బయ్య, బాలాజీ, సుభాష్ చంద్రబోస్‌లతో, కార్యకర్తలతో మంతనాలు, సమీకరణలు సాగించే ఏర్పాట్లు చేశారు. తంబళ్లపల్లెలోనూ ఇవే పాచికలు విసిరినా అవిపెద్దగా ఫలితం ఇవ్వలే దు. ఇదే సందర్భంలో ప్యాకేజీల ఆరోపణలు తెర మీదకు తెచ్చి జనం దృష్టిలో ఆ ఇద్దరి మీద బురద చల్లించే ఏర్పాట్లూ చేశారు.
ఈ వ్యవహారాలపై ఎమ్మెల్యేలిద్దరూ మరింత తీవ్రంగా రగిలిపోతున్నారు. తమ మానాన తాము పోతామంటే వదిలేయకుండా బుజ్జగింపు డ్రామాలు నడిపి తమ మీద బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆగ్రహిస్తున్నారు. ఈ కారణాల వల్లే చంద్రబాబు పాదయాత్రకు దూరంగానే ఉండాలని అమర్, ప్రవీణ్ నిర్ణయించుకున్నారు. పరిస్థితి ఇంత దాకా వచ్చినందువల్ల తమ వర్గీయులు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించి భవిష్యత్ గురించి తేల్చుకోవాలని వారు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ప్రవీణ్ బుధవారం నుంచి తమ మద్దతు దారులతో సమాలోచనలు జరిపి వారి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.

పొమ్మనకుండా పొగ : అమర్
పార్టీ నాయకత్వం తమను పొమ్మనలేక పొగబెడుతోందని, మద్దతుదారులు, ప్రజలే తన రాజకీయ పయనం ఎలా సాగాలో నిర్ణయిస్తారని పలమనేరు ఎమ్మెల్యే ఆమరనాథరెడ్డి చెప్పారు. ఒక సమస్య మీద పార్టీ అధినేతతో విభేదిస్తే జిల్లాలోని కొందరు టీడీపీ ముఖ్య నాయకులు తన మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తాను ప్యాకేజీలు తీసుకుని తిరుగుబాటు చేశానని మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు రాయించడం దురదృష్టకరమన్నారు. ప్యాకేజీల రాజకీయం చేస్తున్న అనేక మంది టీడీపీ నాయకులు హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువచేసే ఖరీదైన ఇళ్లు నిర్మించుకున్నారన్నారు.
జిల్లాలో చంద్రబాబు సహా ఇప్పుడున్న టీడీపీ నేతలందరూ రాజకీయాల్లోకి రాకముందే తమ కుటుంబం రాజకీయాల్లో ఉందన్నారు. 1950వ దశకంలోనే ఖరీదైన కార్లు ఉన్న కుటుంబం తమదని, నిజాయితీ రాజకీయాలు చేస్తున్నందువల్లే హైదరాబాదులో సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేక పోయామన్నారు. చంద్రబాబు కంటే ముందు నుంచి తమ కుటుంబం టీడీపీలో ఉందని, పార్టీ తమకు అవకాశం కల్పించడం వల్లే పార్టీ అభివృద్ధికి తాము పాటుపడ్డామన్నారు. గెలిచే సత్తా ఉంది కాబట్టే పార్టీ తమ కుటుంబానికి టికెట్లు ఇచ్చిందే తప్ప, తమకు కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు ఇవ్వలేదనే విషయం తమ మీద దుష్ర్పచారం చేస్తున్న వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
విలువల కోసం, ప్రజల మధ్యన ఉంటూ రాజకీయం చేస్తున్న తన మీద ఇలాంటి ఆరోపణలు చేయిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తనతో సంప్రదింపులకు వచ్చినట్టు, తాను ముఖం చాటేసినట్టు కొందరు వార్తలు రాయించారని, ముఖం చాటేయడానికి తానేమీ తప్పు చేయలేదని చెప్పారు. సమాచారం ఇవ్వకుండా పలమనేరు పార్టీ ఆఫీసుకు వచ్చి ఫొటోలు తీయించుకుని వెళితే తనకు ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు తమను పార్టీలో కొనసాగమంటూ పైకి చెపుతూ మరో వైపు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Back to Top