సినిమాలు చూపిస్తున్న చంద్రమామఅమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు ఏడాదికి రెండు సినిమాలైనా చూపిస్తున్నారు. సింగపూరు, జపాను, లండన్ సంస్థల డిజైన్లు బాబుగారి నచ్చడం లేదు. నచ్చితే నిర్మాణం చేయాల్సి వచ్చేయడమే అందుకు కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకోండి. 
2015లో ఆచార్యనాగార్జునా యూనివర్సిటీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ విభాగానికి రాజధాని భవనాల నిర్మాణ నమూనాలను తయారు చేయమన్నారు. దేశీయ ఆర్కిటెక్టుల డిజైన్లు బాబుకు నచ్చలేదు.
2016లో జపాన్ కి చెందిన మాకి అండ్ అసోసియేట్స్, టోక్యో ఆర్కిటెక్ నమూనాలకు ఆమోదం అన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. శాతవాహనుల రాజధాని అమరావతిలో రాణి రుద్రమ దేవి పట్టాభిషేకం చేసిన 1261 సంవత్సరం మార్చి 25వ తేదీ అమరావతి నిర్మాణానికి నమూనాలు ఆమోదం శుభసూచకం అన్నాడు. జులైలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం అన్నాడు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు ఐకానిక్ భవనాలన్నాడు. కూచిపూడి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఐకానిక్ వంతెన అన్నాడు. ఏమైందో తెలియదు తర్వాత జపనీస్ డిజైన్లను పక్కకుపెట్టారు. 
తర్వాత సెప్టెంబర్ 2017లో లండన్ సంస్థ నార్మపోస్టర్ రాజధాని నిర్మాణాలకు కొన్ని ఆకృతులు ఇచ్చింది. వాటినీ బాలేదని పెదవి విరిచాడు చంద్రబాబు. నార్మన్ పోస్టర్ సంస్థ వారు నా ఆలోచనలు అందిపుచ్చుకోలేకపోతున్నారని అన్నాడు. దర్శకుడు రాజమౌళి నించి సలహాలు తీసుకోవాలని,రాజమౌళిని లండన్ పంపి నార్మపోస్టర్ ప్రతినిధులతో కలిసి డిజైన్ల రూప కల్పనకు సలహా ఇవ్వాలని చెప్పాడు. డిజైన్లు రాకముందే సెప్టెంబర్ 30న హైకోర్టు,అసెంబ్లీ భవనాల శంకుస్థాపన అని ప్రకటించి, డిజైన్లు ఒకె కాలేదంటూ వాయిదా వేశాడు.
2017 అక్టోబర్ లో వద్దు మొర్రో అన్నా వినకుండా రాజమౌళిని వెంట తీసుకుని లండన్ నార్మన్ పోస్టర్ కంపెనీకి వెళ్లారు. మంత్రి నారాయణ, ఎంపి గల్లా జయదేవ్, రాజమౌళి, సిఆర్డీయే కమీషనర్ శ్రీధర్లు కూడా రాజమౌళితో గుంపుగా వెళ్ళి 7 డిజైన్లు ఖరారు చేసి సీఆర్డీఏ వెబ్ లో పెట్టారు.
2017 అక్టోబర్ లోనే చంద్రబాబు కూడా లండన్ వెళ్ళాడు. అక్కడ కొన్ని డిజైన్లను చూసి హైకోర్టు భవనం ఆకృతి బావుందని, అసెంబ్లీ భవనం ఆకృతిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి వచ్చేసాడు. 
ఆ తర్వాత సూది మొన టవర్, చతురాస్రాకారం టవర్ లను ఇఖఈఅ  డొమైన్లో పెట్టి ప్రజాభిప్రాయం అడిగారు.
2018 మార్చి బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీ భవనాలకు టెండర్లు అని చెప్పారు.
2018 నవంబర్ లో శాసన సభ, సచివాలయం బాహ్య ఆకృతులను దాదాపు ఖరారు చేసారని నేడు చెబుతున్నారు. పాతవాటికి మార్పులు చేసి బోర్లించిన లిల్లీలా తయారు చేసిన ఆకృతలను చంద్రబాబు తీక్షణంగా పరిశీలిస్తున్నాడట. ఈ డిజైన్లు ఖరారైతే ఈనెల 30న టెండర్లు పిలవనున్నారని ప్రకటించారు.
ఐదేళ్లుగా ఐకానిక్ భవనాలని, స్విన్ టవర్లని, ఆకాశ హర్మ్యాలని, బంగారు సౌధాలని చెబుతూ చంద్రబాబు చూపుతున్న భ్రమరావతి సినిమాలో ఇది క్లైమాక్స్ కావచ్చు అనుకోవాలి. ఎందుకంటే టెండర్లు అంటూ హడావిడి చేసినా, పునాదులంటూ ప్రచారం చేసినా 2019 ఎన్నికల్లో బాబు సినిమాకు కలెక్షన్లు నిల్ అంటున్నారు ఎపి ప్రజలు. ఇన్నాళ్లూ చూపించిన అట్టర్ ఫ్లాప్ అమరావతికి కాలం చెల్లిందని చెబుతున్నారు. 

 

 
Back to Top